Telugu Desam Party: గులాబీ పార్టీ గుండెల్లో ముల్లు.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఆరోపణలు

ABN , First Publish Date - 2023-09-14T14:57:57+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి క్యాడర్ ఇంకా లేదని భావిస్తున్న కేసీఆర్ పార్టీకి బుధవారం షాక్ తగిలింది. ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు, ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసనలకు దిగారు.

Telugu Desam Party: గులాబీ పార్టీ గుండెల్లో ముల్లు.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఆరోపణలు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి క్యాడర్ ఇంకా లేదని భావిస్తున్న కేసీఆర్ పార్టీకి బుధవారం షాక్ తగిలింది. ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు, ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, సైబరాబాద్ వంటి ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి ఐయామ్ విత్ సీబీఎన్ అనే ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో టీడీపీ క్యాడర్ అలాగే ఉందని.. కేవలం నాయకులు మాత్రమే లేరని మరోసారి స్పష్టమైంది. ఈ పరిణామం ఖచ్చితంగా గులాబీ పార్టీ నేతలకు గుండెల్లో ముల్లు గుచ్చుకునే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సెటిలర్ల ఓట్లు, వాళ్ల మద్దతు తమకే అని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఇది ఊహించని షాక్ అని చర్చించుకుంటున్నారు.

తొలుత సైబరాబాద్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు కేపీహెచ్‌బీలో జాతీయ రహదారిపై జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు వివేకానంద నగర్ కాలనీ వద్ద సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు వెంగళరావునగర్ ప్రధాన రహదారిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నల్లజెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ ప్రదర్శించారు. చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా టీడీపీ నేతలు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: జగన్ ఒక పిరికిపంద.. నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రెస్‌మీట్ పెట్టాడా?

మరోవైపు టీడీపీ అభిమానుల ధర్నాలను తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. పక్క రాష్ట్రాల్లో పెయిడ్ ఆర్టిస్టులకు ఇక్కడేం పని అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి వీడియోలను పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా విప్రో సర్కిల్ వద్ద నిరసనలకు వచ్చిన కార్యకర్తలకు ఒక్కొక్కరికి స్విగ్గీ కంపెనీ రూ.5000 కూపన్ ఇస్తున్నారంటూ విషప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలాంటి ఆరోపణలు చేశారు. దీంతో ఇలాంటి వాళ్లకు టీడీపీ అభిమానులు కౌంటర్లు ఇచ్చారు. అయినా నిరసన తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి 5000 కూపన్ అంటే స్విగ్గీ కంపెనీ ఆస్తులు అమ్మినా సరిపోవని కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2023-09-14T14:57:57+05:30 IST