Thummala Nageswara Rao: తుమ్మల భవితవ్యం ఏంటో.. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-08-22T16:19:43+05:30 IST
ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల అభిమానుల సమావేశం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో జరిగిన అభిప్రాయ సేకరణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎదుట ఉంచుతామని, తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే నడుస్తామని అనుచరుల స్పష్టం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్లు దక్కకపోవడం పట్ల జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మలకు అవకాశం కచ్చితంగా ఉంటుందని, సర్వేల్లోనూ ఆయనకే మొగ్గు ఉందన్న ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించడంతో పాలేరు టికెట్‌పై ఆశపెట్టుకున్న తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ జరుగుతోంది. ఆయకు సీఎం కేసీఆర్ ఎలాంటి భరోసా ఇస్తారన్నది వేచి చూడాల్సిందే.
అయితే తుమ్మల తమ పార్టీలో చేరితే పాలేరు లేదా ఖమ్మం నుంచి బరిలో దింపుతామని కొందరు కాంగ్రెస్ నేతలు ఆఫర్లు ఇస్తుండగా.. తుమ్మల మాత్రం తాను బీఆర్‌ఎస్ నుంచే పోటీ చేస్తానన్న ధీమాతో ఇప్పటి వరకు వేచి చూశారని చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తుమ్మల పాలేరులో తాను పోటీ చేయడం ఖాయమని, గోదావరి జలాలతో పాలేరును సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. కానీ బీఆర్‌ఎస్ జాబితాలో ఆయనకు చోటు లేకపోవడంతో ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఊహాగానాలు నడుస్తున్నాయి.
కేసీఆర్ ఇచ్చే భరోసాతో తుమ్మల నిర్ణయం ముడిపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. తనకు కొత్తగూడెం అభ్యర్థిత్వం దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆయనకు చోటివ్వకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికే కొత్తగూడెం టికెట్ విషయంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలో ఉండటంతో.. ఒకవేళ పొంగులేటి పాలేరు లేదా ఖమ్మం వైపు వస్తే జలగం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరి కొత్తగూడెం అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ విషయమై జలగం ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుల నిర్ణయం కోసం జిల్లా రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల అభిమానుల సమావేశం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో జరిగిన అభిప్రాయ సేకరణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎదుట ఉంచుతామని, తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే నడుస్తామని అనుచరుల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలి వెళ్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసే యోచనలో ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలిసింది.