YCP: వైసీపీలో పెద్దన్న పాత్ర వహించే బోస్‌కే కష్టాలు.. ఇండిపెండెంట్‌గా బరిలోకి బోస్?
ABN , First Publish Date - 2023-07-12T14:05:15+05:30 IST
వైసీపీ ఎంపీ బోస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంత్రి వేణుకు టిక్కెట్ ఇస్తే ఆయనపై స్వయంగా బోసే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. కాగా ఉమ్మడి జిల్లా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపీ బోస్, మరో ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
బోస్ వర్సెస్ వేణు
రామచంద్రపురం వైసీపీలో ముసలం
ఎంపీ బోస్ తనయుడు సూర్యప్రకాష్ త్వరలో రాజకీయ అరంగేట్రం
మంత్రి వేణుకు టిక్కెట్ ఇస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి బోస్?
స్థానికేతర నినాదంతో సొంత సామాజికవర్గంలోనే తిరుగుబాటు
వైసీపీలో పెద్దన్న పాత్ర వహించే బోస్‌కే కష్టాలు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ముసలం మొదలైంది. నియోజకవర్గాల్లో వారి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలకు పెద్దన్న పాత్ర పోషించే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తన కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయన ఉమ్మడి జిల్లాలో వివిధ సామాజికవర్గాలకు చెందిన కీలక నేతలను కలిసి ఇప్పటికే తన మనోగతాన్ని వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం. తన ద్వితీయ కుమారుడు సూర్యప్రకాష్‌కు రామచంద్రపురం అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలనే డిమాండుతో బోస్ పార్టీకి తలబొప్పి కట్టించే రీతిలో వ్యూహరచన చేస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆయన్నే అధిష్ఠానం తిరిగి అభ్యర్థిగా ప్రకటించనుండడంతో బోస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వేణుకు టిక్కెట్ ఇస్తే ఆయనపై స్వయంగా బోసే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. కాగా ఉమ్మడి జిల్లా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపీ బోస్, మరో ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో నాలుగేళ్లు దాటిన తర్వాత పాత్రికేయులతో ఆత్మీయ సమావేశం పేరిట కాకి నాడ, అమలాపురంల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమా వేశాలకు సుభాష్‌చంద్రబోస్ హాజరు కాలేదు. దాంతో ఆ పార్టీ కీలక నేతల్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. దీనంతటికీ శనివారం రామ చంద్రపురం పట్టణంలోని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ క్యాంపు కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలే కారణంగా భావిస్తున్నారు. వైఎస్ జయంతి వేడుకల్లో భాగంగా క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్ చిత్రపటానికి ఎంపీ బోస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో వెల్ల గ్రామానికి చెందిన వైసీపీ దళిత నేత పోల్నాటి వరప్రసాద్ చేసిన ప్రకటనే ఈ వివాదానికి కారణమైంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ బోస్ రెండో కుమారుడైన సూర్యప్రకాష్ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారని బోస్ సమక్షంలోనే ప్రకటించారు. శ్రావణ మాసంలో ఓ మంచి ముహూర్తాన సూర్యప్రకాష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపి గ్రామగ్రామాన ప్రచారం చేసుకుని ఆయన్ను బలపరచడానికి వైసీపీ కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని ఇచ్చిన పిలుపుతో కోనసీమ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. శెట్టిబలిజ సామాజికవర్గంలో పెద్దగా వ్యవహరించే బోస్ మంత్రి వేణు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి.
రాజోలు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ స్థిరపడి రాజకీయంగా ఎదగడాన్ని బోస్ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అగాధం రోజురోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ టిక్కెట్టు వేణుకే ఇస్తే అవసరమైతే వైసీపీని సైతం వదులుకుని స్వతంత్ర అభ్యర్థిగా ఆయనపై పోటీకి దిగేందుకు బోస్ సిద్ధంగా ఉన్నారని ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, యానానికి చెందిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులను బోస్ ఇప్పటికే కలిసి తన అసంతృప్తిని వారితో పంచుకున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని మల్లాడి కృష్ణారావును బోస్ మద్దతుదారులు కోరినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఆదివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పర్యటనకు బోస్ దూరంగా ఉండడానికి గల కారణాలేమిటని ఎంపీ మిథున్‌రెడ్డిని అమలాపురంలో పాత్రికేయులు ప్రశ్నించారు. బోసే ఈ రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారని, అనారోగ్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేదని ఎంపీ మిథున్‌రెడ్డి వివరణ ఇచ్చారు. అంతే తప్ప ఎటువంటి అసంతృప్తులు లేవని బదులిచ్చారు. మొత్తం మీద వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటరే ఆ పార్టీకి చెందిన కీలక నేతలపై ఎదురుదాడికి దిగడం వారిద్దరి మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి.