YS Viveka Case: ఇంకెన్ని మలుపులో.. వివేకా రెండో భార్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో తేలిందేంటంటే..

ABN , First Publish Date - 2023-04-21T22:08:28+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై (YS Viveka Case CBI Enquiry) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని..

YS Viveka Case: ఇంకెన్ని మలుపులో.. వివేకా రెండో భార్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో తేలిందేంటంటే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై (YS Viveka Case CBI Enquiry) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని సీబీఐకి (CBI) సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. దీంతో.. సీబీఐ కూడా విచారణను వేగవంతం చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ (YS Bhaskar Reddy Arrest) చేయడం మొదలుకుని ఇటీవల వివేకా హత్య కేసు విచారణలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) కూడా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. ఉక్కిరిబిక్కిరయిన వైసీపీ ఏం చేయాలో పాలుపోక వివేకా రెండో పెళ్లిని తెరపైకి తెచ్చింది.

వైసీపీ సోషల్ మీడియాతో పాటు అవినాశ్ రెడ్డి కూడా వైఎస్ వివేకా రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం గమనార్హం. వివేకా రెండో పెళ్లిపై వైసీపీ సోషల్ మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైఎస్ వివేకాకు వివాహేతర సంబంధాలున్నాయని కూడా ప్రచారం చేసి ఆయనను ఒక స్త్రీలోలుడిగా వైసీపీ చిత్రీకరించింది. అవినాష్‌ను వెనకేసుకొచ్చే క్రమంలో వివేకా వ్యక్తిత్వ హననానికి వైసీపీ పాల్పడటం గమనార్హం. వివేకా రెండో పెళ్లిపై ఇంత చర్చ జరుగుతున్న వేళ ఆయన రెండో భార్య షమీం తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. సీబీఐకి వివేకా రెండో భార్య షమీం శుక్రవారం (April 21, 2023) నాడు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నట్టయింది. సీబీఐకి షమీం ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను ఒక్కసారి పరిశీద్దాం..

సీబీఐకి వివేకా రెండో భార్య షమీం వాంగ్మూలంలోని అంశాలు:

* వివేకాతో నాకు రెండుసార్లు పెళ్లి జరిగింది: షమీం

* మా పెళ్లి వివేకా ఫ్యామిలీకి ఇష్టం లేదు

* శివప్రకాష్‌రెడ్డి నన్ను, మా కుటుంబీకులను చాలాసార్లు బెదిరించారు..

* వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి హెచ్చరించారు

* నా కొడుకు పేరు మీద భూమి కొనాలని వివేకా అనుకున్నారు

* భూమి కొనకుండా వివేకాను శివప్రకాష్‌రెడ్డి అడ్డుకున్నారు

* వివేకా ఆస్తిపై రాజశేఖర్‌రెడ్డికి, పదవిపై శివప్రకాష్‌రెడ్డికి వ్యామోహం

* వివేకాను కుటుంబ సభ్యులే దూరం పెట్టారు

* చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు

* హత్యకు కొన్ని గంటల ముందు వివేకా నాతో మాట్లాడారు

* బెంగళూరు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌తో రూ.8 కోట్లు వస్తాయన్నారు

* వివేకా చనిపోతే శివప్రకాష్‌రెడ్డిపై భయంతో వెళ్లలేకపోయా

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలేంటంటే..

‘‘ఈ కేసులో ఇప్పటి వరకూ నేను నిందితుడిగా లేను. 2021లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో నన్ను అనుమానితుడిగా చేర్చారు. నాపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా రెండో భార్య కొడుకుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని రెండో భార్యకు వివేకా హామీ ఇచ్చారు. వివేకా తన రెండో భార్యకూ ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో మొదటి భార్య కుమార్తె అయిన సునీత తండ్రిపై కక్ష గట్టింది. ఆర్థిక లావాదేవీల్లో రెండో భార్య ప్రమేయం ఎక్కువ కావడంతో సునీత తన తండ్రి వివేకాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా చెక్ పవర్‌ను కూడా సునీత తొలగించింది. డబ్బు కోసం బెంగుళూరులో వివేకా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశారు. నిందితులతో కలిసి డైమండ్స్ వ్యాపారం చేశారు. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధం ఉంది’’ అని ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషనల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని, అవినాశ్ బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పోల్చి చూస్తే.. కొన్ని పాయింట్లు కామన్‌గా కనిపిస్తుండటం కొసమెరుపు. వివేకా చెక్ పవర్‌ను తొలగించారని అవినాశ్, వివేకా రెండో భార్య షమీం.. ఇద్దరూ చెబుతున్నారు. బెంగళూరులో వివేకా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశారని కూడా ఇద్దరూ చెప్పుకొచ్చారు. సునీతారెడ్డికి, వివేకాకు మధ్య విభేదాలున్నాయని వైఎస్ వివేకా రెండో భార్య, అవినాశ్ రెడ్డి చెబుతుండటం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే.. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతా రెడ్డిని, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిని వైసీపీ, అవినాశ్‌తో పాటు ప్రస్తుతం షమీం కూడా తప్పుబడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇక.. షమీం వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. కొన్ని ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని చెప్పిన షమీం ఏం మాట్లాడారనే విషయాన్ని మాత్రం వాంగ్మూలంలో వెల్లడించలేదు. బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్‌తో రూ.8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పారని వెల్లడించిన షమీం ఆ ల్యాండ్ డీల్‌లో ఇన్వాల్ అయిన వారి పేర్లను బయటపెట్టలేదు. ఇలా.. వివేకా హత్య కేసు విచారణలో వీడని చిక్కుముడులు ఎన్నో ఇప్పటికీ అలానే మిగిలిపోవడం గమనార్హం. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో ఇంకెన్ని ఆసక్తికర మలుపులతో సాగుతుందోననే చర్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2023-04-21T22:08:32+05:30 IST