PARIGI BRS: సోషల్ మీడియా వేదికగా అనుచరుల వార్‌..నేతల తీరుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం..!

ABN , First Publish Date - 2023-03-11T12:53:56+05:30 IST

వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని అసమ్మతి వెంటాడుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ నేత...

PARIGI BRS: సోషల్ మీడియా వేదికగా అనుచరుల వార్‌..నేతల తీరుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం..!

సంగారెడ్డి జిల్లాలోని ఆ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో కీలక నేతకు మధ్య టిక్కెట్‌ ఫైట్‌ నడుస్తోంది. ఇద్దరు నేతల పోటాపోటీ పర్యటనలతో.. ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్న ఫీలింగ్‌ కలుగుతోంది. కానీ.. కేడర్‌ మాత్రం రెండుగా చీలిపోవడం బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారుతోంది. ఇంతకీ.. ఏంటా.. నియోజకవర్గం?.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి సెగ పెడుతున్న కీలక నేత ఎవరు?..అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-260485.jpg

అసంతృప్త నేతలకు గాలం వేస్తూ గ్రూపు రాజకీయాలు

వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని అసమ్మతి వెంటాడుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇరువురు నేతలు నియోజకవర్గంలో ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేగా మహేశ్‌రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తుంటే.. మనోహర్‌రెడ్డి బీఎంఆర్ ఫౌండేషన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజానికి.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మనోహర్‌రెడ్డిని అధిష్టానం బుజ్జగించి డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. కానీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు.

Untitled-25578.jpg

ఆ మేరకు.. ఆయన కూడా.. బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మహేశ్‌రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్నవారిని ఆయన వైపు తిప్పుకొని గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. గ్రామస్థాయి నుండి మండలస్థాయి వరకు టచ్‌లో ఉంటూ చాపకింద నీరులా తన వర్గాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఈ సారి టికెట్ ఖాయమని.. ఖచ్చితంగా బరిలో ఉంటానంటూ అనుచరుల అంతర్గత సమావేశాల్లో మనోహర్‌రెడ్డి చెప్పుకొస్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Untitled-290.jpg

ప్రజలు ఎన్నుకుంటే పదవులు వస్తాయంటూ కౌంటర్‌

ఇదిలావుంటే.. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ ఆయనకేననే ధీమాతో ఉన్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి రాగాలు వినిపిస్తుండడంతో గతంలో కంటే చురుగ్గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదేసమయంలో.. మనోహర్‌రెడ్డి వైపు వెళ్తున్న నేతలను కూడా బుజ్జగిస్తూ ఆయన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. సిట్టింగులకే మళ్ళీ చాన్స్ అన్న గులాబీ బాస్ ప్రకటనతో మహేశ్‌రెడ్డిలో విశ్వాసం మరింత పెరిగిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. తమ కుటుంబం డీసీసీబీ చైర్మెన్ పీఠాన్ని వదులుకోవడంతో మనోహర్‌రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే సోదరుడు అనిల్‌రెడ్డి ఓ సమావేశంలో కుండబద్దలు కొట్టారు. అయితే.. ఎవరో వదిలిపెడితే పదవులు రాలేదని.. ప్రజలు ఎన్నుకుంటే వస్తాయంటూ మనోహర్‌రెడ్డి అదే వేదికపై అనిల్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఆ ఘటనతో ఇద్దరి మధ్య వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. ప్రజల్లో ఎమ్మెల్యేపైనున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు మనోహర్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఇద్దరు నేతలు పోటాపోటీగా కాన్వాయ్‌లతో బల ప్రదర్శనలు నిరూపించునే ప్రయత్నం చేస్తున్నారు.

Untitled-27474.jpg

నేతల తీరుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం

మరోవైపు.. మహేశ్‌రెడ్డి- మనోహర్‌రెడ్డి మధ్య పోరు అలా ఉంటే.. వారి అనుచరుల మాత్రం సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే కొనసాగిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్కుల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పోస్టింగులు పెడుతుండడంతో పరిగిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇక.. ఇద్దరు కీలక నేతల తీరుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇద్దరిలో ఎవరి వైపు వెళ్లాలో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. ఇద్దరూ బీఆర్ఎస్‌ పార్టీయే కదా అంటూ వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తే వారికే మద్దతు అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక.. గ్రామాల్లో బీఆర్ఎస్‌.. రెండు వర్గాలుగా విడిపోవడమే కాదు.. ఆయా నేతలు ఒకరికొకరు మాట్లాడుకునేందుకు కూడా సంశయిస్తున్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య కొందరు ద్వితీయ శ్రేణి నేతలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఎవరి వైపు వెళ్తే ఏమవుతుందోనని ఊగిసలాడుతున్నారు.

Untitled-284178.jpg

మొత్తంగా.. సంగారెడ్డి జిల్లా పరిగి బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి మధ్య టిక్కెట్‌ ఫైట్‌ గట్టిగానే కొనసాగుతోంది. అయితే.. ఇద్దరిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో?.. ఎవరిని బుజ్జగిస్తుందో?.. చూడాలి మరి.

Updated Date - 2023-03-11T12:59:23+05:30 IST