CBN Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ ఇంత జరిగిందా..!?
ABN , First Publish Date - 2023-10-10T21:28:32+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై (Chandrababu) సీఐడీ అక్రమంగా బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) క్వాష్ పిటిషన్‌పై రెండ్రోజులుగా సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే...
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై (Chandrababu) సీఐడీ అక్రమంగా బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) క్వాష్ పిటిషన్‌పై రెండ్రోజులుగా సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడే ‘జడ్జిమెంట్ డే’ గా.. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పటికీ.. ఒకట్రెండు తప్ప అన్నీ మళ్లీ వాయిదా పడ్డాయి. ఇక సుప్రీంకోర్టులో మాత్రం.. వరుసగా రెండ్రోజులుపాటు చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ (CID) తరఫున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డిల వాదనలు వాడీవేడిగా సాగాయి. ముఖ్యంగా ఈ విచారణలో 17 ఏ సెక్షన్‌కు సంబంధించి వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో తీర్పులను సైతం ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) వాదనలు వినిపించారు. అనంతరం ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత శుక్రవారానికి విచారణ వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అయితే.. ఆరోజు కూడా ఇరువురి వాదనలు పరిశీలించి.. తీర్పు మళ్లీ వాయిదా పడుతుందా..? అదే రోజు ఉంటుందా..? అనేది తెలియట్లేదు.
ముకుల్ మౌనం!
ఇక అసలు విషయానికొస్తే.. సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత ఈ కేసు పూర్వ పరాలు ఏమిటి..? అసలు 17 ఏ సెక్షన్, ఎఫ్ఐఆర్ కథేంటి..? ఇలా పలు ప్రశ్నలను సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీకి సంధించారు. అయితే.. ఈ ఆరు మౌలికమైన ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు కూడా ముకుల్ సమాధానం చెప్పలేదని తెలియవచ్చింది. ఆ ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో ముకుల్ మౌనంగానే ఉండిపోయారట. అనంతరం రోహత్గీ చెప్పాల్సింది చెప్పి సైలెంట్‌గానే ఉన్నారట. ఒకరకంగా చెప్పాలంటే స్కిల్ కేసులో పసలేదు కాబట్టే ఆయన ఇంత మౌనం పాటించారని.. లేకుంటే ముకుల్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదనే ఆరోపణలు సైతం పలువురు న్యాయ నిపుణుల నుంచి వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సుప్రీం ప్రశ్నలకు రోహత్గీ ఉక్కిరిబిక్కిరి అయ్యారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాయి.
ఆరు ప్రశ్నలివే..!
01. చంద్రబాబుకు 17ఏ సెక్షన్ కింద ఉన్న రక్షణ సంగతేమిటి..?
02. కొత్త అవినీతి నిరోధక చట్టంలో లేని సెక్షన్లు, నేరంగా పరిగణించని అంశాలపై FIR నమోదు చేయవచ్చా..?
03. 17ఏ నేరానికి వర్తిస్తుందా..? నిందితులకు వర్తిస్తుందా..?
04. 2018 లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు..?
05. అవినీతికి సంబందించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్ట్ విచారించవచ్చా ? మిగతా సెక్షన్‌ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా..?.. లేదా.. ?
06. విచారణకు ముందు అధీకృత వర్గాల నుంచి అనుమతి పొందేందుకు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుందా.. లేదా ? అని సుప్రీంకోర్టు జస్టిస్ జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు.
ముకుల్ ఫైనల్‌గా ఏమన్నారు..?
పై ఆరు ప్రశ్నలకు ముకుల్ స్పందిస్తూ.. ప్రాథమిక విచారణ జరుపుకోవచ్చని బదులిచ్చారు. ఇందుకు ధర్మాసనం రియాక్ట్ అవుతూ..17ఏ సెక్షన్‌లో విచారణ అని మాత్రమే ఉందని.. ప్రాథమిక విచారణ అని లేనే లేదని సమాధానం ఇచ్చింది. అయితే.. మిగిలిన ఐదు ప్రశ్నలకు మాత్రం ముకుల్ నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు.. నోరు తెరిచి చెప్పలేకపోయారు. అయితే.. నేరం జరిగినప్పటి కాలాన్నే మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని రోహత్గీ పదే పదే చెప్పుకొచ్చారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనపుడు ఐపీసీ సెక్షన్- 420 కింద కేసును పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. సెక్షన్- 420 పరిగణనలోకి తీసుకోవాలంటే అవినీతి నిరోధక చట్టం వర్తించదని కాదు కానీ.. అనేక రకాల నేరాలు కలగలసి ఉన్నప్పుడు స్పెషల్ జడ్జికి విచారణాధికారం ఉంటుందన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించదు అనుకున్నప్పుడు ఇతర చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. ఈ వాదనలు, వివరణలు అయ్యాక శుక్రవారానికి ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. కాగా.. ఈ ప్రశ్నల తాలూకు విషయాలన్నీ విచారణ వాయిదా పడిన ఒకట్రెండు గంటల తర్వాత ఆలస్యం వెలుగుచూశాయి. ఇవన్నీ చూసిన టీడీపీ శ్రేణులు, సామాన్య ప్రజలుసైతం.. వామ్మో సుప్రీంకోర్టులో ఇంత జరిగిందా..? అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి. కేసులో పసలేకపోతే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. శుక్రవారం నాడు చంద్రబాబుకు అంతా మంచే జరుగుతుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.