Congress: కోమటిరెడ్డితో పాటు ‘హస్తం’ అందుకునేదెవరు?
ABN , First Publish Date - 2023-07-05T14:38:54+05:30 IST
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని సమాచారం అందుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress) అనూహ్యంగా పుంజుకుంటోంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీకి గ్రాఫ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. తాజాగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభ విజయవంతంగా ముగిసింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ సభలో పాల్గొనడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
త్వరలో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని సమాచారం అందుతోంది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మళ్లీ హస్తం పార్టీలోకి రానున్నారు. మంగళవారం ఈ మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రహస్యంగా మంతనాలు జరిపారు. బీజేపీలో తనకు సరైన స్థానం లభించడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారని.. దీంతో పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రాజగోపాల్‌రెడ్డి నివాసంలోనే ఈ సమావేశం జరిగినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈనెల 16 తర్వాత మహబూబ్‌నగర్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో జూపల్లి కృష్ణారావు చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
అటు కోమటిరెడ్డి, జూపల్లి బాటలోనే మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna) కూడా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె పైకి తాను పార్టీ మారడం లేదని ఖండిస్తున్నా అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. మంత్రి పదవి కూడా ఆమెకు లభించింది. అయితే తెలంగాణ విభజన తర్వాత అంతర్గత సమస్యల కారణంగా ఆమె బీజేపీలోకి వెళ్లారు. కానీ బీజేపీపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం, ఇటీవల రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో డీకే అరుణ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి (Kishan Reddy) నియామకం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా కాంగ్రెస్‌లో చేరికలు అధికారికంగా ఖరారైన తర్వాతే తాము పూర్తి వివరాలు వెల్లడిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పార్టీలో ఎవరు చేరినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ అన్నారు.