Skill Development Case: ఆధారాలు ఉంటే అర్ధరాత్రి హంగామా ఎందుకు? ఇది కుట్ర కాదంటారా?

ABN , First Publish Date - 2023-09-09T14:28:37+05:30 IST

టీడీపీ ప్రభుత్వం 2015లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు వ్యయం 3,356 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ కంపెనీ, డిజైన్‌ టెక్‌ భరించేలా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. 2020 డిసెంబరులో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నిజనిజాలను నిగ్గు తేల్చకుండా చంద్రబాబును దోషిగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విచారణ సాగాలని జగన్ సర్కారు నిర్ణయించింది.

Skill Development Case: ఆధారాలు ఉంటే అర్ధరాత్రి హంగామా ఎందుకు? ఇది కుట్ర కాదంటారా?

ఏపీలో తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని తేటతెల్లమైన ప్రతీసారి వైసీపీ అండ్ గ్యాంగ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రూ.550 కోట్ల స్కాం జరిగిందని సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టులో రూ.3,300 కోట్ల స్కాం జరిగిందని జగన్ సర్కారు తన సొంత మీడియా ద్వారా కథనాలు ప్రసారం చేసింది. దీంతో నిజనిజాలను నిగ్గు తేల్చడానికి సీఐడీని రంగంలోకి దింపింది. కానీ విచారణ పేరుతో జగన్నాటకానికి శ్రీకారం చుట్టింది. షరతులు విధించి కొన్ని అంశాలను మాత్రమే పరిశీలించాలని.. కీలకమైన ఆధారాలను పట్టుకోవద్దని కండిషన్లు పెట్టింది. చంద్రబాబును దోషిగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విచారణ సాగాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పుడు అదే ఫార్ములాను అమలు చేస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ప్రభుత్వం తన వాటాగా రూ.370 కోట్లను డిజైన్ టెక్‌కు విడుదల చేసింది. ఇందులో నుంచి సీమెన్స్‌కు రూ.48.72 కోట్లు ఇచ్చారు. మిగిలిన నిధుల్లో రూ.241.78 కోట్లను స్కీలర్‌టెక్ అనే కంపెనీకి చెల్లించాయి. ఈ సంస్థ నుంచి అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసీఐ)కి చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు తీసుకున్న కంపెనీలు పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే డిజైన్ టెక్ సంస్థ పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును మిగుల్చుకోవాలనే కక్కుర్తితో తక్కువ లావాదేవీలు చూపించి దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని పూణేకు చెందిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 2017లో నిర్ధారించింది. దీనిపై డిజైన్ టెక్ ఎండీపై కేసు నమోదు చేశారు. నిజానికి ఈ ప్రాజెక్టులో స్కాం జరిగిందని భావిస్తే ముందుగా ప్రభుత్వంతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులను విచారించాలి. ఎందుకంటే పన్ను ఎగవేత, లావాదేవీలకు సంబంధించి సంస్థ ప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ పన్ను ఎగవేతను చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నాన్ని వైసీపీ సర్కారు చేస్తోంది. సీమెన్స్‌ ప్రాజెక్టులో ప్రభుత్వం తరపున కార్యదర్శిగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, ఆనాటి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణపై కేసులు నమోదు చేసింది. ఈ ప్రాజెక్టు ఒప్పందంలో ప్రభుత్వం తరపున స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి సంతకాలు చేశారు. గంటా సుబ్బారావు సాక్షి సంతకం మాత్రమే చేశారు. డిజైన్‌ టెక్‌కు నిధులు విడుదలైంది కూడా ప్రేమ్‌చంద్రారెడ్డి హయాంలోనే. అయితే ఈ కేసు విచారణలో ఇప్పటి వరకు ప్రేమ్‌చంద్రారెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిందా? ఆయన్ను విచారించిందా? అన్న విషయం మిస్టరీగా మారింది


సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు ఎండీలుగా ఉన్న వ్యక్తులు సొంత లాభం కోసం షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకుని పన్ను ఎగవేతలకు పాల్పడి ఉండొచ్చు. ఈ విషయంలో కుట్ర ఉంటే జీఎస్టీ, ఈడీ విచారణలో తేలుతుంది. కానీ ఏదీ తేలకముందే మాజీ సీఎం చంద్రబాబుకు, ఈ కేసుకు లింకు పెట్టి అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని సీఐడీ చీఫ్ సంజయ్ చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టును పరిశీలిస్తే.. ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన కింద సర్కారు 10 శాతం నిధులు ఖర్చుపెడితే మిగతా 90 శాతం ఖర్చు కింద అంత విలువైన సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్ అందిస్తుందని అర్ధం. అంతే తప్ప 2,986 కోట్లు సీమెన్స్ పెట్టుబడిగా వాడుతుందని కాదు. ఇదే విషయంలో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా దీనికి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. వైసీపీ నేతలే ఈ ప్రాజెక్టు గురించి తలో మాట చెప్తున్నారు. కొందరు రూ.370 కోట్లు అని.. మరికొందరు రూ.240 కోట్లు అని సంబంధం లేకుండా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. డిజైన్ టెక్ కంపెనీ జీఎస్టీ ఎగ్గొడితే సర్కారుకు ఏం సంబంధం ఉంటుందని నిలదీస్తున్నారు. ఇది ముమ్మాటికీ కుట్రేనని టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. ఆధారాలు ఉంటే అర్ధరాత్రి పోలీసులు హంగామా చేయాల్సిన అవసరం ఏంటని.. నిజాయితీ ఉంటే పట్టపగలే అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అటు ఈ ప్రాజెక్టులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని గతంలో హైకోర్టు చెప్పినట్లు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో 20 నెలల పాటు చంద్రబాబు పేరు లేదని.. ఇప్పుడు ఆయన పేరు ఇరికించి కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

CBI Ex Director Nageswara Rao : ఆయన అనుమతి లేకుంటే చంద్రబాబుది అక్రమ నిర్బంధమే..

K Raghavendra Rao on Chandrababu Arrest : ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది

Updated Date - 2023-09-09T14:31:21+05:30 IST