Kamareddy KCR: కామారెడ్డిలో కేసీఆర్ సర్వే చేయించగా ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2023-08-21T16:59:59+05:30 IST

గత కొంత కాలంగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారని బీఆర్‌ఎస్ లీకులిచ్చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే కేసీఆర్ పోటీపై ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పలు సర్వేలు కూడా చేసింది. సర్వేలన్నీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండటంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయమైంది.

Kamareddy KCR: కామారెడ్డిలో కేసీఆర్ సర్వే చేయించగా ఏం తేలిందంటే..

తెలంగాణలో ఎన్నికల వేడి (TelanganaElections2023) రాజుకుంది. అధికార బీఆర్‌ఎస్ (BRS) దాదాపు 95 శాతం సీట్లను ప్రకటించేసింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Supremo KCR) ఈసారి అనూహ్యంగా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకటి సిట్టింగ్ స్థానం గజ్వేల్ కాగా, మరొకటి కామారెడ్డి. తాను పోటీ చేసేందుకు రెండో స్థానంగా కామారెడ్డిని కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారని బీఆర్‌ఎస్ లీకులిచ్చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే కేసీఆర్ పోటీపై ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పలు సర్వేలు కూడా చేసింది. సర్వేలన్నీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండటంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయమైంది.

కామారెడ్డి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు కేసీఆర్ తన స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం పెద్ద షాకిచ్చే పరిణామం ఏమీ కాదు. ఎందుకంటే.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఈసారి సీఎం కేసీఆర్ బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి తోడు గంప గోవర్ధన్ కూడా కామారెడ్డి నుంచి పోటీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఇటీవల స్వయంగా ప్రకటించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కూడా వచ్చే ఎన్నికల్లో గంప గోవర్ధనే పోటీ చేస్తారని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామంతో స్థానిక ఎమ్మెల్యేకు కేసీఆర్ పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు కొంత క్లారిటీ ఇచ్చినట్టయింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా తీసిపారేసే స్థితిలో ఏం లేదు.


2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు 68,167 ఓట్లు పోలయ్యాయి. 42.02 శాతం ఓట్లు గంపకు అనుకూలంగా పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి 63,610 ఓట్లు పోల్ కాగా, 39.21 శాతం ఓట్లు షబ్బీర్‌ అలీకి అనుకూలంగా పోలవడం గమనార్హం. కేవలం 4,557 ఓట్ల మెజార్టీ మాత్రమే గంప గోవర్ధన్‌కు రావడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి స్థానం నుంచి కేసీఆర్ లాంటి బలమైన అభ్యర్థి పోటీ చేస్తే కామారెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటు బ్యాంకుపై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ అంచనా వేసింది. ఈ లెక్కలన్నీ చూసుకునే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్తాల్లోనూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నలుగురిలో ముగ్గురికి బీఆర్‌ఎస్ అధిష్టానం ‘మీరే అభ్యర్థులు’ అనే భరోసా ముందే ఇచ్చింది. గంప గోవర్ధన్‌కు తన సిట్టింగ్ సీటును త్యాగం చేయడం వల్ల బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలో వస్తే కీలక పదవి దక్కే అవకాశం లేకపోలేదు. ఈ మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు బీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారోనన్న చర్చ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నుంచి దాదాపుగా షబ్బీర్ అలీనే పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. షబ్బీర్ అలీ కూడా తనకు కాంగ్రెస్ అధిష్ఠానం కేసీఆర్‌పై పోటీ చేసే అవకాశం ఇస్తే కచ్చితంగా ఓడిస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం కేసీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థిగా షబ్బీర్ అలీకి అవకాశం ఇస్తుందా లేక మరెవరినైనా ఎంచుకుంటుందోననే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలియడంతో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Updated Date - 2023-08-21T17:03:47+05:30 IST