YCP MLA: వైసీపీలో మరో వికెట్ డౌన్..? టీడీపీ ఎంపీతో ఎమ్మెల్యే తండ్రి భేటీ అందుకేనా..?
ABN , First Publish Date - 2023-01-10T18:04:38+05:30 IST
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తున్నా ఏపీలో పాలిటిక్స్ (AP Politics) మాత్రం రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీలో (YCP) అసంతృప్త జ్వాలలు జగన్‌కు (CM Jagan) చలికాలంలో..
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తున్నా ఏపీలో పాలిటిక్స్ (AP Politics) మాత్రం రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీలో (YCP) అసంతృప్త జ్వాలలు జగన్‌కు (CM Jagan) చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్నాయి. వైసీపీ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తుండటం, వారి వ్యాఖ్యలు నిజం నిష్టూరంగానే ఉంటుందనే మాటలను గుర్తుచేసేలా ఉండటంతో వైసీపీ అధినేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై (Venkatagiri MLA Anam) వేటు ఐతే వేశారు గానీ రోజుకొక ఎమ్మెల్యే వైసీపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరనే విషయాన్ని బయటపెడుతుండటం జగన్‌కు తలనొప్పిగా మారింది. ఆనం తరహాలోనే కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Mylavaram MLA Vasantha Krishna Prasad) కూడా వైసీపీ పాలనపై, వైసీపీలో అంతర్గత వ్యవహారాలపై బాహాటంగానే స్పందిస్తుండటం జగన్‌కు మింగుడు పడటం లేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు సోమవారం టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో భేటీ కావడం కలకలం రేపింది.
వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరే ఆలోచనలో వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తండ్రి టీడీపీ ఎంపీతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. వైసీపీలో తన కొడుకుకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే ఉద్దేశంతోనే టీడీపీ ఎంపీతో వసంత నాగేశ్వర రావు మంతనాలు జరిపారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. ఎంపీ కేశినేని నానిని కలవడంపై మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు మంగళవారం నాడు వివరణ ఇచ్చారు. నాని కుమార్తె వివాహానికి వెళ్లలేకపోవడంతో నిన్న ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాల కాపీలు అందజేశామని, టీడీపీ ఎంపీగా ఉండి కూడా తనకు నిధులు కేటాయిస్తామనడం పట్ల గ్రామ ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నానని వసంత నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. బయటకు ఇలా చెబుతున్నప్పటికీ రాజకీయ కారణాలతోనే కేశినేని నానితో వసంత నాగేశ్వరరావు భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం సొంత పార్టీపై బాహాటంగా విమర్శలు చేసే విషయంలో తగ్గేదేలే అంటున్న పరిస్థితి. తాజాగా మంగళవారం నాడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెను దుమారమే రేపాయి. మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తిని వసంత కృష్ణప్రసాద్ వెళ్లగక్కారు. అక్రమ కేసుల విషయంలో తమ పార్టీలో ఉన్న కొందరు నాయకులపై అసంతృప్తి ఉందని, పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానని వసంత కృష్ణప్రసాద్ నిట్టూర్చారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని ఆయన చెప్పుకొచ్చారు.
రౌడీలను వెంటేసుకుని తిరిగితేనే ముందుకెళ్లే పరిస్థితులున్నాయని, ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని వసంత కృష్ణప్రసాద్ నిర్వేదం వ్యక్తం చేయడం కొసమెరుపు. సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేపోతున్నానని మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో వైసీపీ నేతలు హుటాహుటిన భేటీ కావడం ఇందుకు నిదర్శనం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెల్లంపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
అసలు ఎక్కడ మొదలైందంటే..
గుంటూరులో టీడీపీ ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు పేదలకు చీరెల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారి ముగ్గురు మహిళలు మృతి చెందారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవోను కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఘటనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరాదని సీఎం పేషీ నుంచి సందేశం అందినట్టు కూడా సమాచారం. దీనిని ధిక్కరిస్తూ ఎమ్మెల్యే వసంత కొండపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం గుంటూరు ఘటనను ప్రస్తావించారు. ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు సేవా దృక్పధాన్ని కొనియాడటంతో పాటు జరిగిన సంఘటనను ఉలవలు, చిలవలుగా చిత్రీకరించడం బాధాకరం అంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా చేస్తే ఎన్నారైలు భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలు చేసేందుకు రాష్ట్రానికి రాకుండా పోతారని తెలిపారు.
జగన్ చెప్పినా మారని వైఖరి..!
కొద్ది రోజుల క్రితం జగ్గయ్యపేటలో కమ్మ వనసమారాధనలో ఎమ్మెల్యే వసంత తండ్రి మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంలో కమ్మసామాజిక వర్గానికి పదవుల్లో ప్రాధాన్యత లేదని అనటం తీవ్ర దుమారం లేపింది. అది ఎమ్మెల్యే వసంత పార్టీకి వివరణ ఇచ్చుకునే వరకు వెళ్లింది. ఇదే సమయంలో మంత్రి జోగి రమేశ్ వర్గానికి ఎమ్మెల్యే వసంతకు మధ్య వివాదాల కారణంగా నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు ఎర్పడ్డాయి. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో 70మంది స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వసంతకు దశ దిశ చెప్పి పంపారు. కాని ఎమ్మెల్యే వసంత అక్కడి నుంచి వచ్చిన కొద్ది రోజుల్లో ఒకసారి ఇబ్రహీంపట్నంలో తాను టీడీపీలోకి వస్తున్నానని దేవినేని ఉమా భయపడుతున్నాడన్నారు. అంతే కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టే విధంగా చేస్తున్నాడని.. అలా ఎన్నటికీ జరగదని చెప్పడం వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.