Avinash Vs CBI : ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ అవినాష్.. వెంటాడుతున్న సీబీఐ.. టెన్షన్.. టెన్షన్..!
ABN , First Publish Date - 2023-05-19T11:57:03+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మరోసారి సీబీఐ విచారణకు..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మరోసారి సీబీఐ విచారణకు (CBI Enquiry) డుమ్మా కొట్టారు. శుక్రవారం నాడు పక్కాగా విచారణకు రావాల్సిందేనని నోటీసులివ్వడంతో నిన్ననే పులివెందుల నుంచి హైదరాబాద్ (Pulivendula-Hyderabad) బయల్దేరి వచ్చారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటల వరకూ అదిగో వస్తున్నారు.. ఇదిగో వస్తున్నారన్న సమాచారంతో ఎంపీ కోసం సీబీఐ అధికారులు (CBI Officers) వేచి చూశారు. అయితే విచారణకు బయల్దేరినట్లే బయల్దేరి హుటాహుటిన ఆయన పులివెందులకు రూటు మార్చారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మి (Avinash Mother) అనారోగ్యంతో పులివెందులలోని ఆస్పత్రిలో చేర్పించారని ఇంటి నుంచి ఎంపీకి సమాచారం వచ్చింది. దీంతో సీబీఐ విచారణకు బయల్దేరిన ఆయన మార్గమధ్యలోనే పులివెందులకు తన కాన్వాయ్‌ను మళ్లించాల్సి వచ్చిందని అనుచరులు చెబుతున్నారు.
సీబీఐకి లేఖ.. వెంటాడుతున్న అధికారులు..!
తాను ఇవాళ విచారణకు హాజరుకాలేనని మరోసారి అవినాష్ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అందుకే తాను పులివెందులకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని లేఖలో అవినాష్ పేర్కొన్నారు. విచారణకు రావడానికి తనకు మరో రోజు (డేట్) ఇవ్వాలని లేఖలోనే ఎంపీ కోరారు. ఇదే విషయాన్ని ఆయన అనుచరులు కూడా సీబీఐ ఆఫీస్ ముందు మీడియాకు చెబుతున్నారు. అయితే.. అవినాష్ లేఖ రాసి అరగంటపైన అయినా ఇంతవరకూ సీబీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ దాటిన అవినాష్ కాన్వాయ్.. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తోంది. అవినాష్ కాన్వాయ్‌ను సీబీఐ అధికారుల బృందమున్న రెండు కార్లు ఫాలో అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవినాష్‌ను సీబీఐ వెంటాడుతోందనే చెప్పుకోవచ్చు. పులివెందుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసిన తర్వాత.. ఆయన్ను పులివెందులలోనే విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు.. కడపలో ఉన్న సీబీఐ బృందం కూడా అలర్ట్ అయ్యింది. మొత్తమ్మీద చూస్తే.. ఇవాళ సాయంత్రంలోపు పులివెందులలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు.. అవినాష్ ఇవాళ పక్కాగా అరెస్ట్ అవుతారని కోట్లల్లో బెట్టింగ్‌లు కడుతుండటం గమనార్హం.
టెన్షన్.. టెన్షన్..!
ఇప్పటికే ఆరుసార్లు అవినాష్ సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఈయన ముందస్తు బెయిల్‌లో అటు హైకోర్టు.. ఇటు సుప్రీంకోర్టులు వాదోపవాదాలు జరిగాయి. ఆఖరికి హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం బట్టడం, అవినాష్ అరెస్ట్‌కు దాదాపు సీబీఐకి లైన్ క్లియర్ చేయడంతో మే-16న విచారణకు రాగానే ఆయన్ను పక్కాగా అరెస్ట్ చేస్తారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే చివరి నిమిషంలో ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. మళ్లీ సీబీఐ లేఖ రాయడం.. అధికారులు మరోసారి నోటీసులిచ్చి మే-19న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే ఇవాళ కూడా విచారణకు బయల్దేరి ఆఖరి నిమిషంలో మళ్లీ డుమ్మా కొట్టేశారు. అయితే ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అవినాష్ అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. అటు హైదరాబాద్‌లో ఇటు పులివెందులలో ఏం జరుగుతోంది..? ఏం జరుగబోతోంది..? అని వైసీపీ అధిష్టానంలో టెన్షన్ మొదలైందట. అంతేకాదు.. ఎప్పటికప్పుడు అవినాష్‌కు చెందిన కొందరు ముఖ్య వ్యక్తుల ద్వారా వైసీపీ కీలక నేతలు సమాచారం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. అవినాష్ వర్సెస్ సీబీఐగా పరిస్థితులు మారిపోయాయ్. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అవినాష్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు ఇలా ఆయన కాన్వాయ్‌ను సీబీఐ బృందం ఫాలో అవుతోందని ఎంపీ అనుచరులు టెన్షన్ పడుతున్నారు. అటు వైసీపీలోనూ ఇదే పరిస్థితి. ఏం జరుగుతుందో.. ఫైనల్‌గా సీబీఐ ఏం తేలుస్తుందో వేచి చూడాల్సిందే మరి.