AP Politics: చీప్ పాలిటిక్స్.. ఆధారాలు ఉన్నా అవినాష్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
ABN , First Publish Date - 2023-09-11T16:33:45+05:30 IST
వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించినా, ఛార్జిషీట్లు దాఖలు చేసినా పోలీసులు మాత్రం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెనకడుగు వేస్తున్నారు. అవినాష్ అరెస్టు కాకపోవడానికి బీజేపీ -వైసీపీ మధ్య అనుబంధం కూడా ఒక కారణమని పలువురు అనుమానిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చీప్ పాలిటిక్స్‌ను ప్రజలు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు. దీంతో తన అవినీతిని అందరికీ అంటించే పనిలో జగన్ ఉన్నారని ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోపణలు వచ్చాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేసి సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారంటూ వీరలెవల్లో స్టేట్‌మెంట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సోషల్ మీడియాలో నెటిజన్‌లు కౌంటర్లు ఇస్తున్నారు. మరి బాబాయ్‌ను హత్య చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నా.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదనేదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఆర్ధికపరమైన కేసులో ఆరోపణలు ఉంటేనే అరెస్ట్ చేసిన పోలీసులు.. మర్డర్ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదో కూడా సజ్జల వివరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించినా, ఛార్జిషీట్లు దాఖలు చేసినా పోలీసులు మాత్రం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెనకడుగు వేస్తున్నారు. అవినాష్ అరెస్టు కాకపోవడానికి బీజేపీ -వైసీపీ మధ్య అనుబంధం కూడా ఒక కారణమని పలువురు అనుమానిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ వెనుక కూడా కేంద్ర ప్రభుత్వం ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్‌కు మద్దతిస్తే తమకు ఏ అంశంలోనూ ఎదురుచెప్పడన్న ఆత్మవిశ్వాసం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలను జగన్ కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు. ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చినా.. ఇక్కడ ఏది ధర్మం.. ఏది చట్టం అనేది ప్రజలకు సంబంధించిన విషయం.
ఇది కూడా చదవండి: Viveka Case : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ.. సునీత విజ్ఞప్తితో సుప్రీం ఏం చేసిందంటే..
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఏపీ అట్టుడికి పోతుందా? ఆయనేమైనా గొప్ప ప్రజా నాయకుడా? అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యడం సీబీఐకి తలకు మించిన భారంగా పరిణమించిందా? సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని అవసాన దశలో ఉందా? అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు ఆపసోపాలు పడుతోంది? అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. చంద్రబాబు జైలుకి వెళ్ళడానికీ, అవినాష్‌రెడ్డి బయటే ఉండటానికి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు తేలిగ్గానే అర్ధమైపోతున్నాయి. అయితే ఈ రెండు సంఘటనలకు మధ్య చట్టపరమైన, న్యాయపరమైన ప్రాతిపదికలు చాలా సంక్లిష్టమైనవి. ఇంటర్ ప్రెటేషన్లను బట్టి, వాదనలతో కోర్టును కన్విన్స్ చేయడాన్ని బట్టి న్యాయస్ధానాల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. దీన్ని సామాన్య ప్రజలు తేలిగ్గా అర్ధం చేసుకోలేరు. అయితే ధర్మం అనేది అందరికీ అర్ధమవుతుంది. ఇంగిత జ్ఞానమూ, వివేకం, విచక్షణలే ధర్మ నిర్ణయానికి ప్రాతిపదికలు అని చెప్పవచ్చు. న్యాయమూర్తులకు ధర్మం తెలిసినా చట్టం ప్రాతిపదికన మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అందుకే కోర్టులకు కళ్లు, చెవులు ఉండవని నానుడి ఉంది. చంద్రబాబు అరెస్ట్ నుంచి రిమాండ్ విధించడం వరకు జరిగిన అన్ని పరిణామాలు చట్టబద్ధమైనవే కావచ్చు. కానీ ధర్మబద్ధం కాదని ప్రజలు భావిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ధర్మబద్ధంగా ఆలోచిస్తారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.