YCP MLAs: గడప గండం తప్పేట్టు లేదుగా.. పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్‌లో ఉంచిన జగన్..!
ABN , First Publish Date - 2023-06-22T12:30:37+05:30 IST
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడప గండం తప్పేట్టులేదు. మరోసారి ఎమ్మెల్యేల గడప ప్రోగ్రెస్‌పై తాజాగా సీఎం జగన్ సమీక్షించారు. గడప గడపకు వెళ్లమని పదే పదే ఆదేశించినా రాష్ట్రంలోని మరో 18 మంది మైనస్‌లో ఉన్నారని తేల్చారు. అయితే వారెవరో పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్ మిగిల్చారు.
మరోసారి జగన్ నోట టికెట్ల మాట
‘గడప గండం’ దాటిందెంత మంది
ఇప్పుడు కొత్తగా ‘సురక్ష’ పరీక్ష
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరో తలపోటు
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు (YCP Sitting MLAs) గడప గండం తప్పేట్టులేదు. మరోసారి ఎమ్మెల్యేల గడప ప్రోగ్రెస్‌పై తాజాగా సీఎం జగన్ (CM Jagan) సమీక్షించారు. గడప గడపకు వెళ్లమని పదే పదే ఆదేశించినా రాష్ట్రంలోని మరో 18 మంది మైనస్‌లో ఉన్నారని తేల్చారు. అయితే వారెవరో పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్ మిగిల్చారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సిట్టింగ్‌లకు అగ్ని పరీక్షగా మారింది. ఈ ఏడాది ఆరంభం నుంచే వారికి జనం ఎదురు తిరగడం ఆరంభించారు. ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పండంటూ నిలదీస్తున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి ఇది పార్టీపరంగా అత్యంత ప్రతిష్టాత్మకమని గడప గడప కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా బుధవారం జరిగిన సమీక్షలో మరోసారి ఈ ప్రస్తావనే చోటు చేసుకుంది. ఉమ్మడి పశ్చిమలో గడప గడప కార్యక్రమంలో వెనుకబడిన ఎమ్మెల్యేలు ఎవరు..? అన్నది సస్పెన్స్‌గా మారింది. అలాంటి వారిపై సీఎం గుర్రుగా ఉన్నారని తాజా సమావేశంలో తేలిపోయింది.
మంత్రివర్గ విస్తరణలో ఆశలు పెంచుకుని ఆ తర్వాత అది కాస్తా సాఫల్యం కాకపోవడంతో అప్పటి నుంచి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కాస్తంత వెనుకంజలోనే ఉన్నారు. తొలుత మీకే మంత్రి పదవి అంటూ ఆయనను ఊరించి చివరకు మాట దాట వేయడంతో అప్పటి నుంచి ఆయన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నార నేది కార్యకర్తల సమాచారం. సీఎం పేర్కొన్నట్టు రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉంటే వారిలో ఇద్దరు, ముగ్గురైనా ఉమ్మడి పశ్చిమకు చెందిన వారై ఉంటారనేది పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే చేతినిండా పనిలేక.. పని చేయించలేక సిట్టింగ్‌లు ఎప్పుడో నీరసపడ్డారు. పైపైకి నవరత్నాలు, ఇతర పథకాలను వల్లెవేస్తూ ఇప్పటి వరకు జనం ముందు కాస్త మెహర్భాని చేశారు. అదే గడప గడప వద్దకు వచ్చే సరికి దాదాపు అర డజను మంది ఎమ్మె ల్యేలకు అక్కడక్కడ జనం నిరసన సెగ తగిలింది. అలాంట ప్పుడు ఇదే జిల్లాకు చెందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గడపలో వెనుకబడ్డారని, ఇదే క్రమంలో సీటు దక్కించుకోవ డంలోను ప్రభావం ఉండబోతుందని అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ గతంలో మాదిరి ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్‌లు ఇవ్వక పోయినా పరోక్షంగా పార్టీ కార్యక్రమాలకు.. గడప గడపకు.. సక్సెస్ చేయలేని వారికి టికెట్లు ఉండబోవని సంకేతాలు ఇచ్చారు. అలాంటి కోటాలో ఉన్న వారెవరు అన్న ప్రశ్న ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశమైంది. కొన్నాళ్లపాటు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చురుగ్గానే ‘గడప గడప’కు పాల్గొన్నా ఈ మధ్యన స్టంటు వేయించుకోవడంతో కాస్తంత ఎండలో తిరిగేందుకు వెనుకంజవేశారు. భీమవరం ఎమ్మెల్యే గడప తొక్కడం మానేశారు. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ వంటి వారంతా వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గాల్లో తిరుగుతూ ఐ ప్యాక్ నుంచి తమకు బ్యాడ్ రాకుండా చూసుకున్నారు. నిడదవోలు, చింతలపూడి, దెందులూరు వంటి నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌లు ఇదే పద్ధతి పాటించారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఐదుగురిని మార్చి ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. సిట్టింగులు మాత్రం ఎవరంతట వారు తాము ఆ జాబితాలో లేమనే ధీమాతో ఉన్నారు.
ఎమ్మెల్యేలకు ఇంకో సవాల్..
జగనన్న సురక్ష పేరిట వారానికి నాలుగు రోజులు జనం మధ్యనే ఉండాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారు. ఈసారి రథసారధులు, వలంటీర్లను వెంటేసుకుని తిరగాలని ఆదేశించారు. ఇప్పటికే గృహ సారథులుగా నియామకం అయిన వారిలో అత్యధికుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారిని సారథులుగా నియమించేశారు. వలంటీర్ల మాదిరిగా వీరెవరూ స్పందించకపోవడం ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పే.