Ambedkar Jayanti: కోట్లాది మందికి అంబేడ్కర్ ఆదర్శం.. మరి అంబేడ్కర్ ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారో తెలుసా..

ABN , First Publish Date - 2023-04-14T15:44:29+05:30 IST

అపుడే కుల వివక్ష సామాజిక-ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించని భవిష్యత్తు అవకాశాలకు పాల్వంకర్ బాలూ ప్రాతినిధ్యం వహిస్తారని డాక్టర్ అంబేద్కర్ విశ్వసించారు.

Ambedkar Jayanti: కోట్లాది మందికి అంబేడ్కర్ ఆదర్శం.. మరి అంబేడ్కర్ ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారో తెలుసా..

సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప యోధుడు బాబా సాహెబ్ అంబేడ్కర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ చిన్నతనంలో కులవివక్షకు గురయ్యాడు. క్లాస్ రూంలో అట్టడుగు కులాల పిల్లలు తరగతి గదిలో కూర్చోవడానికి అనుమతించేవారు కాదు. ఉపాధ్యాయులు కూడా వీరిపై శ్రద్ధ చూపేవారు కాదు, ఎటువంటి సహాయం అందించేవారుకాదు. అలాంటి వివక్షనుంచి అట్టడుగు వర్గాలను విముక్తి చేసేందుకు అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశాడు. ఇంతవరకు మనందరికి తెలుసు..అయితే సమానత్వం,సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడటానికి అంబేద్కర్‌ను ప్రేరేపించిన స్ఫూర్తిదాతల్లో ఒకరి గురించి మనం తెలుసుకోవాల్సిందే.

Ambedkar01.jpg

అతడే పాల్వంకర్ బాలూ. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడు క్రికెట్‌లో అసాధారణ ప్రతిభతో అందరి మన్ననలు పొందిన గొప్ప క్రికెటర్ కావడం. అంబేడ్కర్ తన ప్రసంగాల్లో సమానత్వం,సామాజిక న్యాయం కోసం పోరాడేందుకు పాల్వంకర్ స్పూర్తి అని ప్రస్తావించారు కూడా. బీఆర్ అంబేద్కర్‌ ఎంతో అభిమానించే పాల్వంకర్ బాలూ గురించి అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

పాల్వంకర్ బాలూ కూడా అంబేద్కర్ లాగా కులవివక్షకు గురైనవారే. అసాధారణ క్రీడాప్రతిభ కలిగిన పాల్వంకర్ తన లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో ఇంగ్లీష్ క్రికెటర్లను బోల్తా కొట్టించిన క్రికెట్ దిగ్గజం. భారత క్రికెట్ చరిత్రలో పాల్వంకర్ బాలూ తెలియనివారుండరు. ఇరవయ్యవ శతాబ్దపు తొలి రెండో దశాబ్దాలలో అతను క్రికెట్‌లో తనదైన ముద్రవేసిన క్రికెటర్‌గా చెప్పవచ్చు. అయితే భారత క్రికెట్ చరిత్ర తెలిసిన వారికి, పాల్వంకర్ బాలూ కుటుంబ కథ తెలిసిన వారికి.. కేవలం పాల్వంకర్ ప్రతిభనే అతనికి సామాజిక గుర్తింపు తెచ్చిందని తెలుసు.

పాల్వంకర్ తండ్రి వృత్తిరీత్యా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ పనిచేసేవాడు. తండ్రికి ఉన్న క్రికెట్ సంబంధాలతో పాల్వంకర్, అతని తమ్ముడిని పార్శీ క్రికెట్ క్లబ్‌లో స్వీపర్, రోలర్లుగా పనిలో పెట్టాడు. పాల్వంకర్ అప్పుడప్పుడు క్రికెటర్లకు బౌల్ చేస్తుండేవాడు. తర్వాత ఫుణెలోని యూరోపియన్ క్రికెట్ క్లబ్‌కు బదిలీ అయిన పాల్వంకర్‌..అక్కడ కూడా ప్రముఖ తెల్లజాతి క్రికెటర్లకు బౌల్ చేసేవాడు. పాల్వంకర్ ప్రతిభను గుర్తించిన తెల్లజాతి క్రికెటర్ జార్జ్ హిందూ క్రికెట్ టీంకు పాల్వంకర్‌ను తీసుకోవాలని పట్టుబట్టారు.

తన అసాధారణ బౌలింగ్ ప్రతిభతో హిందూ క్రికెట్ జట్టులోకి ప్రవేశించిన పాల్వంకర్‌ను మొదట జట్టులోకి అంత సులువుగా తీసుకోలేదు. ఆ రోజులో జట్టులో ప్రధానంగా అగ్రవర్ణ మరాఠీ హిందువుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది..దీంతో ‘చమర్’ కులానికి చెందిన పాల్వంకర్‌ను జట్టులో ఆడించేందుకు వారు నిరాకరించారు. అయితే పాల్వంకర్ ప్రతిభతో జట్టులో సభ్యుడయ్యాడు. జట్టును అనేకమార్లు గెలిపించాడు.

అయితే జట్టులో మేటి బౌలర్ అయినప్పటికీ జట్టు మెస్‌లోకి అనుతించేవారు కాదు. బయట కూర్చొని భోజనం చేయాల్సి వచ్చేది. అతను జట్టులో అత్యుత్తమ బౌలర్ అయినప్పటికీ, అతని అంటరానితనం కారణంగా అతను తన సహచరులతో కలిసి వికెట్లు తీసి సంబరాలు చేసుకోలేకపోయాడు.

క్రమంగా జట్టును గెలిపించడంలో పాల్వంకర్ కీలక పాత్ర పోషించాడు. తన ప్రతిభను గుర్తించిన సహచరులు అతనితో కలిసిపోయారు. అతను జట్టు భోజనాలలోకి కూడా స్వాగతించారు. సమాజంలో కుల వివక్షలు కఠినంగా ఉన్న తరుణంలో బాలూ నిశ్శబ్దంగా అడ్డంకులను ఛేదిస్తూ వచ్చాడు. అతని తమ్ముడు శివరామ్ జట్టులోకి ఎంపికైనప్పుడు, అతను చాలా సజావుగా అంగీకరించబడ్డాడు.

1920వ దశకం ప్రారంభంలో బాలూ యొక్క నిశ్శబ్ద పోరాటం ఫలించింది, పాల్వంకర్ మరో సోదరుడు విఠల్ హిందువుల జట్టుకు కెప్టెన్‌గా వహించాడు. జట్టును విజయపథంలో నడిపించి సహచరుల భుజంపై మోయబడ్డాడు.

బాలూ 1911లో ఇంగ్లండ్‌లో వ్యక్తిగతంగా విజయవంతమైన పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు పాల్వంకర్‌కు బొంబాయిలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభలో సిడెన్‌హామ్ కళాశాల యువ అధ్యాపకుడిగా పనిచేస్తున్న భీమ్‌రావ్ అంబేద్కర్ స్వాగతోపన్యాసం చేశారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి నిమ్న కులాలను చైతన్య పర్చేందుకు అంబేద్కర్ తన ప్రసంగాల్లో బాలూ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు.

అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే గాంధేయవాది అయిన పాల్వంకర్ అంబేద్కర్‌తో తనకు విభేదాలు వచ్చినప్పుడు మహాత్ముని పక్షాన నిలిచారు. 1937లో, బాంబే అసెంబ్లీ ఎన్నికలలో ఇద్దరూ పోటీ పడ్డారు.ఈ పోటీలో బాలూ పాల్గొనడానికి చాలా ఇష్టపడలేదు. ఈ పోటీలో అంబేద్కర్ 2000 ఓట్ల తేడాతో గెలిచారు. అపుడే కుల వివక్ష సామాజిక-ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించని భవిష్యత్తు అవకాశాలకు పాల్వంకర్ బాలూ ప్రాతినిధ్యం వహిస్తారని డాక్టర్ అంబేద్కర్ విశ్వసించారు.

అంబేద్కర్, పాల్వంకర్ మధ్య అభిప్రాయ బేధాలున్నప్పటికీ బాలూ పట్ల అంబేద్కర్ గొప్ప గౌరవాన్ని ప్రదర్శించేవారు. 1955లో బాలూ మరణించినప్పుడు శాంటాక్రూజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలకు పార్లమెంటు, బొంబాయి అసెంబ్లీలోని నిమ్మజాతి చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరవ్వాలని డాక్టర్ అంబేద్కర్ పిలుపునివ్వడం బాలుపట్ల అంబేద్కర్‌కు ఉన్న గౌరవం నిరూపించబడింది.

Updated Date - 2023-04-14T19:00:56+05:30 IST