Tomato prices: అమ్మా తల్లీ.. టమాటా ధర తగ్గేలా చూడమ్మా...
ABN , First Publish Date - 2023-08-04T10:25:04+05:30 IST
టమోటా ధరలు(Tomato prices) తగ్గాలంటూ అమ్మవారికి టమోటా మాలవేసి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నాగపట్టినం జిల్లా కురుకుడిలో ప్రసిద్ధి చెందిన మ
- అమ్మవారికి 508 టమోటాలతో మాల
పెరంబూర్(చెన్నై): టమోటా ధరలు(Tomato prices) తగ్గాలంటూ అమ్మవారికి టమోటా మాలవేసి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నాగపట్టినం జిల్లా కురుకుడిలో ప్రసిద్ధి చెందిన మహా మారియమ్మన్, నాగమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఆడి నెల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సంతాన భాగ్యం, విద్య, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగాలని కోరుతూ భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన టమోటా ధరలు తగ్గించాలని కోరుతూ కొందరు భక్తులు అమ్మవారికి 508 టమోటాలతో చేసిన మాల ధరింపజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పది రూపాయలు తగ్గిన కిలో టమోటా
కోయంబేడు మార్కెట్లో(Koyambedu Market) గురువారం టమోటా కిలో రూ.10కి తగ్గింది. బుధవారం రూ.160 పలికిన టమోటా గురువారం రూ.150కి విక్రయమైంది. ఇక, రెండో రకం టమోటా కిలో రూ.20 తగ్గి రూ.130గా ఉంది. టమోటా దిగుమతులు స్వల్పంగా పెరిగాయని, కొద్దిరోజుల్లో దిగుమతులు మరింత పెరిగి ధరలు తగ్గే అవకాశముందని వ్యాపారులు తెలిపారు.