Weird Letter: వానాకాలంలో వర్షాలు ఎందుకు పడట్లేదు, దేవుడిని అడిగి చెప్పండి.. కేంద్రానికి ఓ వ్యక్తి విచిత్రమైన లేఖ

ABN , First Publish Date - 2023-09-08T21:06:11+05:30 IST

తమ ప్రాంతంలోని సమస్యలను స్థానిక అధికారులు పరిష్కరించనప్పుడు.. ప్రజలు పై అధికారులకు లేఖలు రాస్తుంటారు. ఆయా సమస్యలని పేర్కొంటూ, వెంటనే వాటిని పరిష్కరించాల్సిందిగా లేఖల ద్వారా..

Weird Letter: వానాకాలంలో వర్షాలు ఎందుకు పడట్లేదు, దేవుడిని అడిగి చెప్పండి.. కేంద్రానికి ఓ వ్యక్తి విచిత్రమైన లేఖ

తమ ప్రాంతంలోని సమస్యలను స్థానిక అధికారులు పరిష్కరించనప్పుడు.. ప్రజలు పై అధికారులకు లేఖలు రాస్తుంటారు. ఆయా సమస్యలని పేర్కొంటూ, వెంటనే వాటిని పరిష్కరించాల్సిందిగా లేఖల ద్వారా కోరుతుంటారు. కానీ.. కొందరు మాత్రం ఊహకందని విచిత్ర విజ్ఞప్తులు చేస్తుంటారు. అసలు సంబంధం లేని విషయాల్ని మెన్షన్ చేసి, ఎలాగోలా వాటిని పరిష్కరించమని రిక్వెస్టులు చేస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా అలాగే చాలా వింత లేఖ రాశాడు. వానాకాలంలో ఎందుకు వర్షాలు పడట్లేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు.. అవసరమైన దేవుడిని అడిగి, తనకు సమాచారం ఇవ్వాలని కోరాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం నమోదైతే, మరికొన్ని చోట్ల అధిక వర్షపాతం కారణంగా నగరాలే నిండకుండల్లా మారుతున్నాయి. కానీ.. బీహార్ పరిసర ప్రాంతాల్లో మాత్రం సరిపడా వర్షాలు కురవలేదు. ఎండాకాలం తరహాలో అక్కడ ఎండలు మండిపోతున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వానాకాలంలోనూ సకాల వర్షాలు పడకపోవడం నానాతంటాలు పడుతున్నారు. దీంతో.. గౌరాబౌరమ్‌ జిల్లా మహౌర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాజ్‌కుమార్‌ ఝాకు చిర్రెత్తుకొచ్చింది. ఆ కోపంలోనే ఆయన భూవిజ్ఞాన శాఖకు ఓ లేఖ రాశారు. వానాకాలంలోనూ వర్షాలు కురవకపోవడానికి కారణమేంటో వివరించాలని ఆ దరఖాస్తులో కోరారు. అవసరమైతే దేవుడిని అడిగి తెలుసుకోవాలని, దీనికోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ఏమైనా ఉపయోగపడుతుందేమో పరిశీలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

‘‘ఆ దేవుడు సకాలంలో వర్షాలు ఎందుకు కురిపించడం లేదు. చంద్రుడిపై చంద్రయాన్‌-3 అడుగుపెట్టిన తర్వాత ప్రకృతి కదలికలు ఆగిపోయాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అవసరమైతే ఆ దేవుడినే అడిగి తెలుసుకోండి. సాంకేతికతను వాడేవారు ఎవరైనా సరే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’’ అని రాజ్‌కుమార్‌ ఝా తన దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రజ్ఞాన్‌ రోవర్‌కు అమర్చిన అధునాతన పరికరాల వల్లే ప్రకృతి స్తంభించిపోయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా విడ్డూరం ఏమిటంటే.. ప్రజ్ఞాన్‌ రోవర్‌ దేవుడి నుంచి సంకేతాలను సేకరించి, ల్యాండర్ సహాయంతో వాటిని భూమికి చేరవేస్తుందని ఆయన చెప్పండి. ఆ సంకేతాల్ని పరిశోధించి వాతావరణ మార్పులకు గల కారణాలను తెలుసుకోవచ్చని కూడా ఆ వ్యక్తి పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ దరఖాస్తు పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-09-08T21:06:11+05:30 IST