Chennai: వాద్య పరికరాలతో వచ్చిందని....!
ABN , First Publish Date - 2023-05-12T11:24:38+05:30 IST
తిరునల్వేలి బస్‌స్టేషన్ నుంచి మదురై(Madurai) వెళ్లే ప్రభుత్వ బస్సులో వాద్య పరికరాలతో వచ్చిన ఓ విద్యార్థినిని దూషిస్తూ, మార్గమధ్యంలో
ప్యారీస్(చెన్నై): తిరునల్వేలి బస్‌స్టేషన్ నుంచి మదురై(Madurai) వెళ్లే ప్రభుత్వ బస్సులో వాద్య పరికరాలతో వచ్చిన ఓ విద్యార్థినిని దూషిస్తూ, మార్గమధ్యంలో దింపేసిన కండక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలిలా వున్నాయి... శివగంగ జిల్లా త్రిభువనం ప్రాంతానికి చెందిన రంజిత తిరునల్వేలి జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుకుంటోంది. ఆమె కళాశాలలో జరిగిన వార్షికోత్సవం కోసం శివగంగ నుంచి డప్పు వాయిద్యాలతో పాల్గొంది. వేడుకలు అనంతరం బుధవారం సాయంత్రం ఆమె ఆ వాద్య పరికరాలతో మదురై వెళ్లేందుకు తిరునల్వేలి(Tirunalveli) బస్సెక్కింది. ఆ బస్సు కొంతదూరం వెళ్లాక టిక్కెట్ ఇచ్చేందుకు వచ్చిన కండక్టర్ గణపతి వాద్య పరికరాలను చూసి తన అనుమతి లేకుండా ఎందుకు ఎక్కావంటూ ఆమెను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చీకటిపడిందన్న ఆలోచన కూడా లేకుండా ఆమెను మార్గమధ్యలోనే వన్నారపేట వద్ద దింపేశాడు. దీనిపై రంజిత ఫిర్యాదు మేరకు తిరునల్వేలి ప్రభుత్వ రవాణా సంస్థ మేనేజర్ గోపాలకృష్ణన్ విచారణ జరిపి గణపతిని సస్పెండ్ చేసినట్లు గురువారం ప్రకటించారు. ప్రయాణీకుల పట్ల రవాణా సిబ్బంది మర్యాదగా నడచుకోవాలని, మానవతా దృక్పథం అలవరచుకోవాలని గోపాలకృష్ణన్ ఈ సందర్భంగా సూచించారు.