Cow hug day: హాట్‌ టాపిక్‌గా మారిన ‘గో హగ్ డే’.. అసలు ప్రయోజనాలు, ప్రభావాలు ఇవే!

ABN , First Publish Date - 2023-02-09T22:16:34+05:30 IST

‘కౌ హగ్‌ డే’పై (Cow hug day) సానుకూల, విమర్శలతో ఈ అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా (trending) మారింది. కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతుండగా.. గో ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నారు.

Cow hug day: హాట్‌ టాపిక్‌గా మారిన ‘గో హగ్ డే’.. అసలు ప్రయోజనాలు, ప్రభావాలు ఇవే!

గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నంగా హిందువులు విశ్వసిస్తారు. ఆవును దర్శించి పనులు మొదలుపెడితే ఎంతో శుభశకునమని బలంగా నమ్ముతారు. అయితే ఈ వైదిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై పాశ్చ్యాత్య పోకడల ప్రభావం పెరిగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్‌ డే (Valentine's Day) జరుపుకుంటున్న ఫిబ్రవరి 14న ‘కౌ హగ్‌ డే’గా (Cow hug day) నిర్వహించాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు (Animal Welfare Board of India) పిలుపునిచ్చింది. ‘‘ భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీవన మనుగడ, పశుసంపద, జీవవైవిద్యానికి గోవు వెన్నెముక అని అందరికీ తెలుసు. సహజ సిద్ధంగా తల్లిలాంటి పోషణ శక్తి, మనుషులను ధనవంతులుగా మార్చే గుణం ఉంది కాబట్టి ఆవును కామధేనుగా, గోమాతగా పిలుస్తుంటాం. అయితే పాశ్చాత్య సంస్కృతి కారణంగా వైదిక సంపద్రాయాలు ప్రమాదంలో పడ్డాయి. పాశ్చాత్య నాగరికత మోజులో పడి భౌతిక సంస్కృతి, వారసత్వాన్ని విస్మరిస్తున్నాం. అందుకే విస్తృత ప్రయోజనాలున్న గోవును కావలించుకోవడం ద్వారా భావ సంపద (emotional richness) వృద్ధి చెందుతుంది. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుంది ’’ అంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ‘కౌ హగ్‌ డే’పై (Cow hug day) సానుకూల, విమర్శలతో ఈ అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా (trending) మారింది. కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతుండగా.. గో ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నారు. ఆవును అప్యాయంగా హత్తుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. చాలా రోగాలు దూరమవుతాయని విశ్వసిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా బీపీ, శ్వాస సంబంధిత వ్యాధులతోపాటు పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు. ఇక జంతువులకు దగ్గరగా ఉన్నప్పుడు సెరోటోనిన్ లాంటి న్యూరోట్రాన్స్‌మిటర్లు విడుదలవుతాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కేరింగ్ నిపుణులు చెబుతున్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

గురుగ్రామ్‌లో తొలి ఆవు కౌగిలింత కేంద్రం...

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ ఎన్‌జీవో గతేడాది దేశంలో తొలి ఆవు కౌగిలింత కేంద్రాన్ని (first cow cuddling centre) ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్‌పీ గుప్తా సారధ్యంలో జీవన విధానం, ఇతర పలు రోగాలను నయం చేసే ఉద్దేశ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ఆవులను స్పృశించడం, కావలించుకోవడం, పక్కనే కూర్చోవడం, ఆవులకు జాగ్రత్తలు తీసుకోవడం వంటి యాక్టివిటీలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ తరహా కేంద్రాలు ఇప్పటికే అమెరికా, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల్లోనూ ఉన్నాయి. ఈ తరహా కేంద్రాల ద్వారా రోగాలు నయమవుతాయని అక్కడివారు విశ్వసిస్తున్నారు.

గో సంరక్షణపై సానుకూల ప్రభావం..

ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’పై (Cow hug day) భిన్న వాదనలు, చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఈ పరిణామం గోసంరక్షణకు మరింత సానుకూలమవుతుందని గో ప్రేమికులు విశ్వసిస్తున్నారు. ప్రతి ఏడాది ‘కౌ హగ్ డే’ నిర్వహణ కారణంగా జనాల్లో గోమాత సంరక్షణ, విశిష్టత పట్ల అవగాహన పెంపునకు తోడ్పడుతుందని విశ్వసిస్తున్నారు. బారసాల, నామకరణం, సీమంతం, గృహప్రవేశం వంటి కార్యక్రమాల్లో గోమాతలకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. మొత్తంగా దేశంలో గోసంరక్షణకు ఈ పరిణామం ప్రయోజనకరంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మరి వాస్తవ ప్రభావం ఏవిధంగా ఉండబోతోందనేది కాలమే నిర్ణయించనుంది.

Updated Date - 2023-02-09T22:16:35+05:30 IST