DH srinivasarao: మరో వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు.. ఈసారి ఏకంగా సర్క్యూలరే ఇచ్చేశారు..
ABN , First Publish Date - 2023-02-16T21:51:55+05:30 IST
‘ ఏసుక్రీస్తు కృప వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యింది.. వైద్యులు, మెడిసిన్ వల్ల కాదు’’ అంటూ గతేడాది డిసెంబర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు...
హైదరాబాద్: ‘‘ ఏసుక్రీస్తు కృప వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యింది.. వైద్యులు, మెడిసిన్ వల్ల కాదు’’ అంటూ గతేడాది డిసెంబర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) శ్రీనివాసరావు (DH Srinivasa Rao) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫిబ్రవరి 17న (శుక్రవారం) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్లకు అసాధారణ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు(PHCs), సబ్‌సెంటర్లు సహా అన్నీ వైద్యసదుపాయాల వద్ద మొక్కలు నాటడంతోపాటు రోగులకు పండ్లు పంచిపెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సమాచారం అందిస్తూ రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్ మెడికల్, హెల్త్ ఆఫీసర్లకు ఆయన గురువారం ఒక సర్క్యూలర్ జారీ చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టాలని అధికారులను కోరారు. డీహెచ్ శ్రీనివాసరావు జారీ చేసిన ఈ ఆదేశాలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజుకు కొత్తగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ మెప్పు పొందేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
డీహెచ్ శ్రీనివాసరావు గతేడాది డిసెంబర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసుక్రీస్తు కృప వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యిందని, దీనికి వైద్యులు, మెడిసిన్ కారణం కాదని వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. హిందూ సంఘాలతోపాటు వైద్యరంగ సిబ్బంది కూడా భగ్గుమన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. ఒక ఉన్నత స్థానంలో ఉండి మతాలను ప్రేరేపించడం తగదని, కింది స్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడడం సబబుకాదని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే డీహెచ్ శ్రీనివాస రావు కొత్తగూడెనికి చెందినవారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నారని పలు రిపోర్టులు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఇప్పటికే తన కోరికను వ్యక్తం చేసినట్టుగా కొంతకాలం ప్రచారం నడిచింది. అయితే కేసీఆర్ ఆమోదం లభిస్తే వీఆర్‌ఎస్ తీసుకొని రాజకీయ అరంగేట్రం చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయన చర్యలు కూడా కేసీఆర్ దృష్టిని ఆకర్షించేందుకే అన్నట్టుగా ఉన్నాయి. కేసీఆర్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన పుట్టిన రోజు నాడు పీహెచ్‌సీల వద్ద మొక్కలు నాటడం, పండ్ల పంపిణీకి ఆదేశాలు ఇచ్చారనే వాదనలున్నాయి. కాగా డీహెచ్ శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ ఏమో తెలియదు గానీ.. ఇలాంటి చర్యల కారణంగా వివాదాల్లో చిక్కుకుంటూ అప్రతిష్టపాలవుతున్నారు.