Jill Biden: కమలా హ్యారిస్ భర్త పెదాలపై ముద్దుపెట్టిన జో బిడెన్ భార్య!.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-02-08T14:19:19+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) ఉమ్మడిగా వార్తల్లో నిలవడం సర్వసాధారణం. కానీ ఓ షాకింగ్ పరిణామం జరిగింది..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) ఉమ్మడిగా వార్తల్లో నిలవడం సర్వసాధారణం. ప్రభుత్వ బాధ్యతల దృష్ట్యా ఇద్దరూ కలిసి అనేక వేదికలను పంచుకుంటుంటారు. అయితే ఈసారి వీరివురి భాగస్వాములు వార్తల్లో నిలిచారు. అధ్యక్షుడి సతీమణి, అమెరికా ప్రథమ మహిళ (first Lady) జిల్ బిడెన్ (Jill Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్ (Doug Emhoff) ఇద్దరూ ముద్దుపెట్టుకోవడమే ఇందుకు కారణమైంది.
మంగళవారం జో బిడెన్ ‘ స్టేట్ ఆఫ్ ది యూనియన్’ (State of the Union) ప్రసంగానికి ముందు ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బెన్నీ జాన్సన్ అనే జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియో ట్విటర్‌లో(Twitter) తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోకి ‘‘ కమలా హ్యారీస్ భర్త పెదవులపై జిల్ బిడెన్ ముద్దుపెట్టారా?’’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా 8 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో డౌగ్ ఎమ్‌హాఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్తున్నట్టుగా జిల్ బిడెన్ కనిపించారు. కానీ దగ్గరకు వెళ్లి పెదవులపై ముద్దుపెట్టి అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత ఎమ్‌హాఫ్ పక్కనే ఆమె కూర్చున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోకి ఇప్పటికే 8.50 లక్షల వ్యూస్ వచ్చాయి. ట్విటర్ యూజర్లు పెద్ద సంఖ్యలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే ముద్దుపెట్టుకునే సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసినవారెవరూ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అప్యాయత చూపించేందుకు ఇలా ముద్దుపెట్టడం సహజమే కావడంతో అందరూ చప్పట్లు కొట్టినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అమెరికా కోసం ఎంతటి తీవ్ర చర్యకైనా సిద్ధమే: బిడెన్
‘‘మన దేశాన్ని (అమెరికా) కాపాడేందుకు ఎంతటి తీవ్ర చర్యకైనా సిద్ధమే’’ అని డ్రాగన్ దేశం చైనాను అమెరికా అధ్యక్షుడు జో బిబెన్ (Joe Biden) తీవ్రంగా హెచ్చరించారు. నిఘా బెలూన్ వ్యవహారం నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ‘ స్టేట్ ఆఫ్ ది యూనియన్’ మంగళవారం ఆయన ప్రసంగించారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.