Health Tips: పాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ ఆహారాలతో కలిపి తీసుకుంటే అంతే సంగతులు..
ABN , First Publish Date - 2023-09-10T10:49:48+05:30 IST
పాలను పాలలా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఈ ఆహారాల కాంబినేషన్లో తీసుకుంటే మాత్రం పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పాలు గొప్ప పోషకాహారం. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్దుల వరకు పాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆహారనిపుణులు చెబుతారు. అయితే పాలను పాలలా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. కానీ వివిధ ఆహారాల కాంబినేషన్లో తీసుకుంటే మాత్రం పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాలను ఏయే ఆహారాలతో తీసుకోకూడదు? ఒకవేళ తీసుకుంటే జరిగే నష్టమేంటి? తెలుసుకుంటే..
ఉదయాన్నే ప్రతి ఇంట్లో తయారయ్యే కాఫీ, టీ లకు పాల వాడకం తప్పనిసరి. కానీ షాకింగ్ నిజమేంటంటే టీ ని ఎప్పుడూ పాలతో తయారుచేయకూడదట. టీ ని కేవలం డికాక్షన్ లా తాగుతుంటారు చాలామంది. టీ తీసుకోవడానికి అదే సరైన మార్గమట. ఒకవేళ పాలతో టీ తయారుచేసుకుని తాగితే టీలో ఉండే కెఫిన్, రసాయనాలు పాలలోని పోషకాలను గ్రహించడంలోనూ, శరీరం యాంటీఆక్సిడెంట్లను శోషించుకోవడంలోనూ ఆటంకం కలిగిస్తుంది. అందుకే చాలామంది టీని కేవలం నీరు, టీ పొడి, కొన్ని సుగంద ద్రవ్యాల సహాయంతో తయారుచేసుకుని తాగుతారు.
పాలలో నిమ్మకాయ పడితే ఏమవుతుంది? పాలు విరిగిపోతాయి. అదేవిధంగానే పాల కాంబినేషన్లో నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఈ సిట్రస్ పండ్లలోని ఆమ్లత్వం కారణంగా పాలు విరగడం, కడుపులో వికారం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇది తీవ్రమైన జీర్ణసమస్యలను కలిగిస్తుంది.
పైనాపిల్ తో చాలామంది మిల్క్ షేక్ చేసుకుని వాడుతుంటారు. అయితే పైనాపిల్ లో చాలా ఎంజైమ్ లు ఉంటాయి. ఇవన్నీ సిట్రస్ పండ్లలోని ఎంజైమ్ లను పోలి ఉంటాయి. ఈ కారణంగా పైనాపిల్ ను పాల కాంబినేషన్లో తీసుకుంటే కడుపులోకి చేరిన తరువాత పాలు విరుగుతాయి.
Viral News: కామన్ మ్యాన్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ.200 కోట్లు.. ఊళ్లో అందరికీ మెసేజ్ చూపించి మరీ ఏం చేశారంటే..!
పాలు, టీ, కాఫీ తాగుతూ చాలామందికి బిస్కెట్లు, కారప్పూస, ఉప్పు బిస్కెట్లు, కుర్కురే, చిప్స్ వంటివి తినడం అలవాటుగా ఉంటుంది. ఈ స్నాక్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. ఈ కారణం వల్ల శరీరంలో సోడియం లెవల్స్ పెరిగి రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది. పైపెచ్చు వీటిలో ఉపయోగించే శుద్దిచేసిన పిండి పాలతో కలిస్తే కడుపులో పెద్ద రచ్చకు తెరతీసినట్టే.
వేడివేడిగా కాఫీ, టీ, పాలు తాగుతూ కారం కారంగా సమోసా, మిర్చి బజ్జీలు, నూడిల్స్, మంచూరియా లాంటి ఆహారాలు తీసుకోవడం చాలా ప్రమాదం. ఇది అసిడిటీ, గుండెల్లో మంట ప్రమాదాన్ని వెంటబెట్టుకొస్తుంది. జీర్ణాశయాన్ని ఇబ్బందికి గురిచేస్తుంది.
చేపలు, పాలలో వేర్వేరు పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తింటే జీర్ణాశయాన్ని డేంజర్ జోన్ లోకి తీసుకెళ్ళినట్టే. ఒక్కోసారి జీర్ణవ్యవస్థ స్థంబించిపోయే అవకాశం కూడా ఉంటుంది.
పాలను తోడు పెడితే పెరుగు తయారవుతుంది. కానీ పాలు తీసుకున్న వెంటనే పెరుగు తీసుకోవడం విరుద్దం. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతుంది.
గోరువెచ్చని పాలతో మందులు వేసుకోవడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ కొన్నిరకాల మందులు పాలతో చర్య జరుపుతాయి. ఈ క్రమంలో మందులలో పవర్ తగ్గడం లేదా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. డాక్టర్ల సలహా లేకుండా మందులు పాలతో తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
టమోటా, వెజిటెబుల్, కార్న్ వంటి కాంబినేషన్లో సూప్ లు తయారు చేసుకుని తాగుతుంటారు. వీటని తీసుకున్న తరువాత పాలు తాగడం లేదా పాలు తాగిన తరువాత వీటిని తీసుకోవడం చేయకూడదు. ఈ సూప్ లేదా సాస్ లలో ఉండే ఆమ్ల గుణాలు కడుపులో చేరిన వెంటనే పాలను పాడుచేస్తాయి.