Joshimath: జోషిమఠ్‌‌కు ఆ పేరు ఎలా వచ్చింది?... విష్ణువు తన నరసింహావతారాన్ని ఇక్కడే దర్శింపజేసి...

ABN , First Publish Date - 2023-01-09T09:44:24+05:30 IST

జోషిమఠ్‌ను గేట్‌వే ఆఫ్ హిమాలయ అని కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గంలో ఇది చాలా ముఖ్యమైన మజిలీ. ఉత్తరాఖండ్‌లోని పురాతన చారిత్రక, పౌరాణిక ప్రదేశాలలో ఒకటైన జోషిమఠ్‌ను జ్యోతిర్మఠ్ అని కూడా అంటారు.

Joshimath: జోషిమఠ్‌‌కు ఆ పేరు ఎలా వచ్చింది?... విష్ణువు తన నరసింహావతారాన్ని ఇక్కడే దర్శింపజేసి...

జోషిమఠ్‌ (Joshimath)ను గేట్‌వే ఆఫ్ హిమాలయ అని కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గంలో ఇది చాలా ముఖ్యమైన మజిలీ. ఉత్తరాఖండ్‌లోని పురాతన చారిత్రక, పౌరాణిక ప్రదేశాలలో ఒకటైన జోషిమఠ్‌ను జ్యోతిర్మఠ్ (Jyotirmath) అని కూడా అంటారు. జ్యోతిష్మఠం పేరు జోషిమఠంగా మారిందని చెబుతారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్-బద్రీనాథ్ రహదారిలో నిర్మితమైన జోషిమఠ్ కొన్ని వేల సంవత్సరాల క్రితం శంకరాచార్యులు స్థాపించారు. మత గ్రంథాలలోని వివరాల ప్రకారం శంకరాచార్య ఇక్కడ జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. ఆదిగురు శంకరాచార్యులు (Shankaracharya) ఈ స్థల పర్యవేక్షణ బాధ్యతను తన ప్రియ శిష్యుడైన తోటకకు అప్పగించారు.

ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కాంప్రయాగ్ ప్రాంతంలో ఉంది. అలకనంద, ధౌలిగంగ నది సంగమం ఇక్కడే కనిపిస్తుంది. జోషిమఠానికి ఘనమైన పౌరాణిక చరిత్ర కూడా ఉంది. పూర్వకాలంలో జోషిమఠ్ సముద్ర ప్రాంతం అని చెబుతారు. ఇక్కడ హిమాలయ పర్వతాలు విస్ఫోటనం చెందడంతో మార్పులు చోటుచేసుకున్నాయి. నరసింహ రూపంలో విష్ణువు తపస్సు చేసిన భూమిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దైత్య వంశానికి చెందిన రాజు హిరణ్యకశపుడు, కుమారుడు ప్రహ్లాదుడు ఈ ప్రాంతానికి సంబంధించినవారని చెబుతారు. హిరణ్యకశ్యపుడు.. తనను ఏ పురుషుడు లేదా స్త్రీ, పగలు లేదా రాత్రి, ఇంటి లోపల లేదా వెలుపల లేదా ఏ ఆయుధం దాడితోనైనా చంపలేని విధంగా విష్ణువు నుండి వరం పొందాడు. ఈ గర్వంతో తనను తాను దేవుడిగా భావించడం ప్రారంభించాడు.

తాను పాలిస్తున్న ప్రాంతంలో విష్ణువు ఆరాధనను నిషేధించాడు. దైవభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి హింసించినా నిరంతరం విష్ణుపూజలో నిమగ్నమై ఉండేవాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశ్యపుడు తన సోదరి హోలికతో.. ప్రహ్లాదుని ఒడిలోకి తీసుకుని మండుతున్న అగ్నిలో కూర్చోమని ఆదేశించాడు. హోలికకు అగ్నిలో ఆహుతి కాదనే వరం ఉంది. అయితే విష్ణు భక్తుడైన ప్రహ్లాదునికి ఏమీ జరగలేదు. హోలిక మాత్రం బూడిదగా మారింది.

రాక్షసరాజుపై విష్ణువుకు ఆగ్రహం కలిగింది. నరసింహ (సగం మనిషి సగం సింహం) రూపంలో విష్ణువు స్తంభాలను బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. సంధ్యా సమయంలో హిరణ్యకశ్యపుడిని తొడపై ఉంచుకుని, తన గోళ్ళతో హిరణ్యకశిపుని కడుపుని చీల్చాడు. హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత కూడా విష్ణువు చాలా రోజులు కోపంతో మండుతూనే ఉన్నాడు. దీంతో లక్ష్మిదేవి భక్తుడైన ప్రహ్లాదుని సహాయం కోరింది. అతను విష్ణువుని ప్రశాంత పరిచేందుకు మంత్రం జపిస్తూనే ఉన్నాడు. శ్రీమహావిష్ణువు కోపం చల్లారిన ప్రదేశం ఇదేనని చెబుతారు. విష్ణువు ప్రశాత రూపాన్ని జోషిమఠ్‌లోని విష్ణువు ఆలయంలో చూడవచ్చు. ఈ నరసింహ ఆలయ వర్ణన స్కంద పురాణంలోని కేదార్‌ఖండంలో కనిపిస్తుంది.

Updated Date - 2023-01-09T10:34:21+05:30 IST