Husband: రాత్రి 3 గంటలు.. రోడ్డుపక్కన కారును ఆపమన్న భార్య.. మూత్ర విసర్జనకు వెళ్లి తిరిగొచ్చే లోపే మర్చిపోయి వెళ్లిపోయిన భర్త..!
ABN , First Publish Date - 2023-04-16T13:18:34+05:30 IST
చీకటి సమయంలో కారుదిగి మూత్రవిసర్జనకు వెళ్ళివచ్చి చూడగా ఆమె షాకయ్యింది.
పెళ్ళి రోజును, పుట్టిన రోజును మర్చిపోయి భార్యల ఆగ్రహానికి గురయ్యే మగమహారాజులు చాలామందే ఉంటారు. కానీ ఈయన మాత్రం ఏకంగా భార్యనే మరిచిపోయాడు(husband forgot his wife). వినడానికి వింతగానూ.. షాకింగ్ గానూ అనిపిస్తుందేమో కానీ ఇది నిజమండోయ్.. ఓ జంట రాత్రి 3గంటల సమయంలో కారు ప్రయాణం చేస్తోంది. అప్పుడే భార్యకు మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఆమె తన భర్తను కారు ఆపమని చెప్పింది. ఆ చీకటి సమయంలో కారుదిగి మూత్రవిసర్జనకు వెళ్ళివచ్చి చూడగా ఆమె షాకయ్యింది. రోడ్డు మీద ఉండాల్సిన భర్త లేడు, కారు లేదు. సదరు మహిళలనే కాదు.. విషయం విన్న ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేసే ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
థాయిలాండ్(Thailand) దేశంలో బూన్తోమ్ చైమూన్, అమ్నుయ్ చైమూన్ అనే భార్యాభర్తలు ఉన్నారు. వీరు నిన్నా మొన్నా పెళ్ళయిన జంటేమీ కాదు. వీరికి పెళ్ళయ్యి 27సంవత్సరాలు అవుతోంది. బూన్తోమ్ వయసు 55సంవత్సరాలు కాగా అమ్నూయ్ వయసు 49ఏళ్ళు. వీరిద్దరూ తాము పెద్దైపోతున్నామనే ఫీలింగ్ కొంచెం కూడా పెట్టుకోకుండా ఎంచక్కా థాయిలాండ్ లో ఎంతో ఫేమస్ అయిన మహా సరాఖం ప్రావిన్స్(Maha Sarakham Province) కి రోడ్ ట్రిప్(Road trip in car) వెళ్ళారు. అది కూడా ఎంచక్కా తమ కారులో వారిద్దరే వెళ్ళారు. బూన్తోమ్ డ్రైవ్ చేస్తుండగా పక్కనే ఆయన భార్య కూర్చుని వృద్దాప్యానికి దగ్గరవుతున్నా చిలకాగోరింకల్లా చక్కగా వెళుతున్నారు. ఈ క్రమంలో రాత్రి 3గంటల సమయంలో(night 3a.m) అమ్నూయ్ మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ విషయం భర్తకు చెప్పింది. వారు ప్రయాణిస్తున్నది అడవిదారి కావడంతో ఎక్కడా హోటల్స్, పబ్లిక్ టాయ్ లెట్స్ లేవు. దీంతో బూన్తోమ్ రహదారికి ఒకవైపు కారును ఆపాడు . రహదారికి ఆనుకుని అంతా అడవే కావడంతో దగ్గరలోనే చెట్ల పొదలు ఉన్నాయి. ఈ పూటకు ఏదోలా తప్పదు అనుకుని అమ్నూయ్ చెట్ల పొదల్లోకి మూత్రవిసర్జనకు వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి తన భర్త లేడు, కారు కూడా లేదు. ఏమయ్యిందో ఆమెకు అర్థం కాలేదు. కనీసం ఫోన్ చేద్దామన్నా తన పోన్ కారులోనే ఉండిపోయింది. ముందుకు నడవడం తప్ప ఆమెకు మరొగతి లేదు. ఆ చీకట్లోనే నడక సాగించింది. సుమారు 20కిలోమీటర్లు నడిచి కబిన్ బురి జిల్లాకు(Kabin Buri District) చేరుకుని అక్కడ కనిపించిన పోలీసులకు(police) తన పరిస్థితి చెప్పింది. వారు ఆమె భర్త నెంబర్ కు ఫోన్ చేయమని మొబైల్ ఇచ్చారు. కానీ ఆమెకు తన భర్త మొబైల్ నెంబర్ గుర్తులేకపోవడంతో కారులో ఉన్న తన మొబైల్ కు 20సార్లు ఫోన్ చేసింది. అన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
Viral News: మీ తెలివికి ఓ చిన్న పరీక్ష.. ఈ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టగలరా..? సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు..!
పోలీసులు కష్టపడి అతను ప్రయాణం చేస్తున్న ప్రాంతం తెలుసుకున్నారు. అతను అప్పటికే 160కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడట. పోలీసులు అతడిని ట్రేస్ చేసి జరిగిన విషయం వివరించగా అతను కారును రిటర్న్ చేసి తిరిగి భార్య దగ్గరకు వెళ్ళాడు. ఆమెను అలా ఎందుకు వదిలి వెళ్ళిపోయారని పోలీసులు అడగగా ఆమె కారు వెనుక సీట్లో నిద్రపోతోందని(sleeping in back seat) తను భావించినట్టు అతను చెప్పాడు. అంతేకాదు వారికి ఒకరి మొబైల్ మరొకరు ముట్టే అలవాటు లేకపోవడంతో అతను ఆమె మొబైల్ కు అన్ని కాల్స్ వచ్చినా లిఫ్ట్ చెయ్యలేదట. తిరిగి భార్య దగ్గకు చేరుకున్న తరువాత అతను పదేపదే తన భార్యకు క్షమాపణ చెప్పాడు, కానీ ఆమె మాత్రం అతనితో మాట్లడలేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'పెళ్ళయిన 27ఏళ్ళ తరువాత ఏంటి ఇలా జరిగింది? అని అంటున్నారు. మరికొందరు ఏమో 'ఆ అంకుల్ కు మతిమరుపు అంతగా వచ్చిందా?' అని సెటైర్లు వేస్తున్నారు. 'ఆమె కారు ఎక్కి వెనుక సీట్లో నిద్రపోతోందని పొరపడి ఆయన వెళ్లిపోయి ఉంటారు, పైగా రాత్రి సమయం కదా గమనించుకోలేదేమో' అని మరికొందరు ఆయనకు కాస్త సపోర్ట్ ఇచ్చారు.