Hyderabad Book Fair : అనువాదాలు ఉంటేనే వివిధ భాషలలో ఎలాంటి సాహిత్యం వస్తుందో తెలుస్తుంది..!

ABN , First Publish Date - 2023-01-01T11:11:39+05:30 IST

ఇది మా బతుకుతెరువు కాదు, సాహిత్యం మీద మా అభిరుచి అంతే..

 Hyderabad Book Fair : అనువాదాలు ఉంటేనే వివిధ భాషలలో ఎలాంటి సాహిత్యం వస్తుందో తెలుస్తుంది..!
Hyderabad Book Fair

సామాజిక కార్యకర్త, రచయిత్రి, కాలమిస్టు కాకర్ల సజయ. 2021లో అనువాద కేటగిరీలో 'అశుద్ధ భారత్' పేరుతో సజయ చేసిన అనువాదానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూనే, లిఖిత ప్రెస్ పేరుతో ప్రచురణ సంస్థను స్థాపించి నడిపిస్తున్నారు. బుక్ ఫెయిర్ సందర్భంగా సజయతో ఆంధ్రజ్యోతి వెబ్ ఆత్మీయ సంభాషణ.

1. ఒకప్పటితో పోల్చితే ఇప్పటి కాలంలో తెలుగు చదివేవారు తగ్గారా? మీరేమంటారు.

పుస్తకాలు ఎక్కువ ప్రచురణ అవుతున్నాయంటేనే చదివే వాళ్లు కూడా అదే స్థాయిలో వున్నారనేది అర్థం చేసుకోవాలి. అయితే చదివే వాళ్లు తగ్గారు కదా అంటే ఏఏ అంశాల మీద చదివే వాళ్లు తగ్గారనేది పరిశీలించుకోవాలి. చదివే వాళ్లు తగ్గారని నేను అనుకోను. కానీ నిజంగా చదివే వాళ్ల దగ్గరికి వారికి అవసరమైన పుస్తకాలు వెళ్ళటం లేదు అని నా అభిప్రాయం. ఏ పుస్తకానికైనా లక్షల మంది పాఠకులు వుండరు. ఆ పరిమితిని మనం అర్థం చేసుకోవాలి.

2. ఇంగ్లీష్ అనువాదాలతో తెలుగు పుస్తకాలకు ఉన్న చోటును ఆక్రమిస్తున్నాయంటారా?

అలాంటిదేమీ లేదని నేను అనుకుంటున్నాను. నేరుగా తెలుగులోనే వస్తున్న పుస్తకాలు చాలా వున్నాయి. అనువాదాలు కూడా వున్నాయి. అనువాదాలు ఉంటేనే వివిధ భాషలలో ఎలాంటి సాహిత్యం వస్తుందో తెలుస్తుంది. నేరుగా ఆయా బాషల నుంచీ అనువాదం జరిగితే మరింత ప్రభావవంతంగా వుంటుంది. కానీ మనకు ఆ వెసులుబాటు తక్కువగా వుంది. ఇతర భారతీయ భాషలను నేర్చుకోవటం అనేది మన విద్యావ్యవస్థలో భాగం కాలేదు. ఎవరైనా స్వంతంగా నేర్చుకోవాల్సిందే. హిందీ మూడో భాషగా వుంటుంది కానీ, అది కూడా బలవంతాన పిల్లలు ముక్కున పెట్టి బట్టీకొట్టేదిగా ఉండటమే కాదు, ఆ భాషతో ముడిపడి వున్న ఆధిపత్య రాజకీయ స్వభావం కూడా దాని పట్ల ఒక విముఖత పెంచుతుంది. వివిధ సంస్కృతులతో, పలుకుబడులతో, మాండలికాలతో వున్న భారతీయ భాషల సౌందర్యాన్ని అనువాదాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. భాషాభివృద్ధి కేవలం వ్యక్తులతో మాత్రమే ముడిపడి వున్న విషయం కాదు. అది ప్రభుత్వాలు తీసుకోవలసిన ఒక సుదీర్ఘమైన కార్యాచరణ.

3. పుస్తకాలను ముద్రించాకా, మార్కెట్ లేని పుస్తకాల ముద్రణ తలెకెత్తుకున్నామని బాధపడిన సందర్భాలున్నాయా?

అన్ని పుస్తకాలూ పూర్తిగా మార్కెట్ అవుతాయని ఆశించకూడదు. పుస్తక ప్రచురణ ఒకదానికొకటి అనుసంధానమైన ప్రక్రియ. ఏ పుస్తకం వేయాలనే దాని నుంచీ అది చదువరులకు అందించడం వరకూ అనేక అంశాలు వుంటాయి. అన్నిటిలోనూ పట్టు వుండటం మాలాంటి చిన్న ప్రచురణకర్తలకు చాలా అవసరం. అమ్మకాల దగ్గరకొచ్చేసరికి చదువరులు వుండే తావుల్లోకి వెళ్ళలేకపోవటం తప్పించి ప్రచురణకు సంబంధించిన ఇతర అంశాల్లో నేను ఒక స్త్రీగా ఇబ్బందిపడిన సందర్భం లేదు. జిల్లాలలో గానీ, ప్రధాన నగరాలలో గానీ పుస్తక ప్రదర్శనలు జరిగినప్పుడు వచ్చే మొదటి సమస్య ఎక్కడ ఉండాలనేది? తెలిసిన స్నేహితులు, బంధువులూ వుంటే కొంత వెసులుబాటు వుంటుంది. అది కూడా అన్నిసార్లూ కుదరకపోవచ్చు. బయట హోటల్స్ లో వుండటం ఆర్థికభారం రీత్యా సాధ్యం కాదు. ఎంతవరకూ అవి అనుకూలంగా, రక్షణగా ఉంటాయో కూడా తెలియదు, ముఖ్యంగా చిన్న పట్టణాలలో. కొన్నిసార్లు టాయిలెట్ సౌకర్యాలు కూడా వుండవు ప్రదర్శన స్థలాల్లో. పుస్తక ప్రదర్శనలు నిర్వహించేటప్పుడు నిర్వాహకులు, ప్రభుత్వాలు ఈ అంశం గురించి ఆలోచించి అనుకూలమైన వసతి ఏర్పాట్లు చేయగలిగితే చాలా మందికి ఉపయోగంగా వుంటుంది. స్త్రీలకే కాదు, పురుషులకి కూడా.

Untitled-1.gif

4. పుస్తకప్రచురణ రంగంలో కొనసాగడం అనేది సమస్యగా అనిపించాయా?

ఏ పుస్తకాలు వేయాలి అనే దాంట్లో ఎవరి అభిరుచులు వారికి వుంటాయి కాబట్టి అందులో సాధారణంగా సమస్య వుండదు. అయితే పైన చెప్పినట్లు అమ్మకాల దగ్గరికి వచ్చేసరికి ప్రయాణ పరిమితులు వుంటాయి. ఇంకొకటి, పుస్తకాలు ముద్రణ పూర్తి అయ్యేవరకూ మేధోపరమైన పని నడుస్తుంది. ప్రచురణ పూర్తి అయ్యి మన చేతికి వచ్చిన తర్వాత నుంచీ పని చాలా శారీరకంగా అలసటతో వుంటుంది. కొన్నిసార్లు సమయానికి ఎవరూ అందుబాటులో లేకపోతే వాటిని మనమే మోయాల్సి వుంటుంది. కొంతవరకూ వోపిక పట్టగలను గానీ, ఆరోగ్య రీత్యా అది మాత్రం చాలా కష్టం నాకైతే.

5. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ పుస్తకాలను మార్కెట్ లోకి తెస్తుంటే వాటిని చదివేవారు కొనేవారు, తగ్గడం ఎలా అనిపిస్తుంది.

పుస్తకాల అమ్మకాలు పెరిగితే ముందుగా సంతోషించేది ప్రచురణకర్తలే. మాలాంటి చిన్న ప్రచురణకర్తలకి తర్వాతి పుస్తకానికి పెట్టుబడి వస్తుంది అని సంతోషపడతాం. మేము ఇప్పటికీ కేవలం వో పాతిక పుస్తకాలు వేసి ఉంటాము అంతే. ఇది మా బతుకుతెరువు కాదు, సాహిత్యం మీద మా అభిరుచి అంతే. వేసిన వాటిల్లో అస్సలు అమ్మకాలు లేని పుస్తకాలు నాలుగైదు వుంటాయి. అందుకే, ఇప్పుడు కాపీలు తగ్గించి ప్రచురిస్తున్నాము. అవసరం అయినప్పుడు మళ్లీ ప్రచురిస్తున్నాము.

చదువరుల దగ్గరికి పుస్తకం వెళ్లే ఏర్పాటు గురించీ ఆలోచించకుండా ఉన్నంత కాలం పుస్తకాలు కొనేవారు లేరు అనే ఈ సమస్య వుంటుంది. చదువరులు ఎక్కడ వున్నారు? జిల్లాలలో, మండలాల్లో వున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్నారు. అక్కడివరకూ పుస్తకం ఎలా వెళ్ళాలి అని ఆలోచించడం అవసరం. అందరూ హైదరాబాద్ కో, విజయవాడకో వెళ్లి పుస్తకాలు కొనలేరు. జిల్లా కేంద్రాలలో సంవత్సరానికొకసారి నిర్వహించే పుస్తక ప్రదర్శనలు సరిపోవు. ప్రతి మారుమూల గ్రామానికీ మద్యాన్ని సరఫరా చేసే వ్యవస్థలని సృష్టించే ప్రభుత్వాలు, పుస్తకాల కోసం మాత్రం ఆలోచించవు. ప్రతి గ్రామానికీ గ్రంథాలయాలు వుండటం, వాటికి నిధులు సమకూర్చడం అవసరం అనుకోవు. ఏ జిల్లాకు ఆ జిల్లా పుస్తక ప్రదర్శనల కోసం సహకార సంఘాలుగా రచయితలు, చదువరులూ మొదలవ్వాలి. మార్పు అలా మొదలవ్వాలి.

6. మీ ప్రచురణ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం?

ప్రధానంగా, మరుగున పడిన అస్తిత్వ సాహిత్యాన్ని మా పరిమితిలో వెలికితీయాలనేది ప్రయత్నం.

7. ప్రచురణకర్తలుగా, జండర్ పరమైన ఇబ్బందులు ఈ సందర్భంగా చెపుతారా?

ఆడవాళ్ళు చదవటం రాయటం ఒకప్పుడు కష్టమైనా ఎంతో మంది అనేక అవరోధాల మధ్య తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు, చరిత్ర సృష్టించారు. వాళ్లు వేసిన ఆ దారుల్లోనుంచే మనమందరం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ప్రచురణకర్తలుగా సాంకేతిక, ఆర్థిక సమస్యలు అందరికీ వుంటాయి. అలానే మాకూ వున్నాయి. అయితే కొంచం ఎక్కువే వుండే సందర్భాలు కూడా వుంటాయి. అది పూర్తిగా జెండర్ పరమైనవి అని చెప్పలేము.

8. కోవిడ్ అనంతరం పుస్తక ప్రచురణ రంగంలో మీరు గమనించిన మార్పులేమిటి?

పేపర్ ధర, ప్రింటింగ్ ధరలు బాగా పెరిగాయి. అది మరింత భారం అవుతుంది. దానితో తక్కువ కాపీలు కేవలం ప్రింట్ ఆన్ డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి ఇది కూడా భారమే. కానీ తప్పదు.

9. కోవిడ్ తర్వాత,ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి?

అంచనాలు పెద్దగా ఏమీ లేవు. పోటీ పరీక్షలకి చదివే విద్యార్ధులు బాగా వస్తున్నారు. కొనగలిగిన వాళ్లు కొంటున్నారు. కొనలేనివాళ్ళు చూసి వెళుతున్నారు.

10. మారిన పాఠకుల స్పందనకు, మారిన ప్రచురణారంగానికి తగినట్టు రచయితల్లో ఎలాంటి మార్పు వస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు?

సమాజంలోని వివిధ అంశాల మీద, సామాజిక తారతమ్యాల మీద, రావాల్సిన మార్పుల మీద రచయిత తాను నమ్మినది, అనుభవంలో నుంచీ, పరిశీలన లోంచి, తాను అనుకున్నదే రాయాలి గానీ, ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాయకూడదనేది నా అభిప్రాయం. అప్పుడు వాళ్లు సహజసిద్ధమైన రచయితలు అవ్వరు.

11. ప్రచురణ సంస్థగా మీ భవిష్యత్తు ఆలోచనల గురించి చెప్పండి?

మా ప్రచురణ సంస్థ ‘లిఖిత ప్రెస్’. ఎప్పటిలానే మా నడక నెమ్మదిగా, స్థిరంగానే వుంటుంది. పరుగు వుండదు. అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక అంశాలకు మద్దతుగా మా ప్రచురణ కొనసాగుతుంది.

12. ఈ బుక్ ఫెయిర్ లో మీ ప్రచురణ సంస్థ తరపున ఏ ఏ పుస్తకాలు ఉండబోతున్నాయి.

నిజానికి ఈ సంవత్సరం విడిగా స్టాల్ పెట్టలనుకోలేదు. కానీ చివరి నిముషంలో మా మిత్రులు, ప్రజాతంత్ర సంపాదకులు అజోయ్ దేవులపల్లి గారు తమ స్టాల్ నెంబర్ 165లో మా ‘లిఖిత ప్రెస్’ కు ; కవిత్వం ప్రచురించే ‘ప్రేమ లేఖ’ ప్రచురణల వారికి కలిపి మా పుస్తకాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మూడు ప్రచురణ సంస్థల నుంచీ సామాజిక సాహిత్య విశ్లేషణలు, కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు అన్నీ కలిపి వందకు పైగానే పుస్తకాలను ప్రదర్శనలో పెట్టాము. స్పందన బాగుంది. స్టాల్ లోకి వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఆయా పుస్తకాల మీద తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రచురణ కర్తలకు, రచయితలకు, చదువరులకు ఇలాంటి ముఖాముఖీ సందర్భం ఇలాంటి ప్రదర్సనల్లో ఏర్పడటం చాల మంచి అనుభవం.

- శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2023-01-01T11:42:57+05:30 IST