Zero Shadow Day: హైదరాబాద్ నగరంలో రెండు నిమిషాలపాటు అద్భుతం ఆవిష్కృతం.. ఆసక్తిగా తిలకించిన నగర ప్రజలు
ABN , First Publish Date - 2023-05-09T12:46:04+05:30 IST
హైదరాబాద్(Hyderabad) నగరంలో రెండు నిమిషాలపాటు అద్భుతం ఆవిష్కృతం అయింది...
హైదరాబాద్(Hyderabad) నగరంలో రెండు నిమిషాలపాటు అద్భుతం ఆవిష్కృతం అయింది. మధ్యాహ్నాం 12.12 నుంచి 12.14వరకు నీడ మాయమైంది. నిట్టనిలువుగా సూర్యకిరణాలుపడటంతో నీడ మాయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయంటున్నారు. మరోసారి ఆగస్టు నెలలో హైదరాబాద్ ప్రజలు ఇలాంటి అద్భుతాన్ని చూసే అవకాశం ఉంది.
ఇది అరుదుగా జరిగే సంఘటన. సూర్యుడు ఉత్తరాయణం, దక్షిణాయణం సందర్భంలో ఇలాంటి మార్పులు కనపడటం ఒక భాగం అంటున్నారు. భూమి ఏటవాలుగా తిరుగడంగానీ, దీర్ఘవృత్తాకారంగా సూర్యుడి చుట్టూ తిరగడం వంటి మార్పులు వల్ల షాడో కనిపించకపోవడం వంటి అరుదైన ఖగోళ అద్భుతాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరంలోని బిర్లాటెంపుల్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో శాస్త్రవేత్తలు జీరో షాడో డే సందర్భంగా ఖగోళ అద్భుతంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అయితే నీడ మాయమవడం వెనక అతీత శక్తులు ఉన్నాయంటూ కొందరు నమ్ముతుంటారు. అలాంటి వారి సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కేవలం సూర్యుని చుట్టూ భూభ్రమణంలో భాగంగా కలిగే మార్పులే నీడ మాయమవడం వంటి అద్భుతాలు జరుతుతుంటాయని అంటున్నారు. అయితే జీరో షాడో డే అనేది ఖగోళ శాస్త్రవేత్తలు, ఫోటోగ్రాఫర్‌లకు ఒక ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే ఇది అద్భుతమైన ఛాయాచిత్రాలను తీయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.