Share News

Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!

ABN , First Publish Date - 2023-11-11T10:12:44+05:30 IST

సాధారణంగా చాలా మంది చేతికి ఆభరణంగా ఉంగరాన్ని ధరించడం మనం చూసే ఉంటాం. ఇక పెళ్లిలో వధూవరులు మొదట ఉంగరాలు మార్చుకోవడం కామన్. ఇలా మనకు ఓ ఫ్యాషన్ వస్తువుగా పరిచయమైన ఉంగరం.. ఇప్పుడు స్మార్ట్ సాధనంగా మారింది.

Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!

Ring Payments: సాధారణంగా చాలా మంది చేతికి ఆభరణంగా ఉంగరాన్ని ధరించడం మనం చూసే ఉంటాం. ఇక పెళ్లిలో వధూవరులు మొదట ఉంగరాలు మార్చుకోవడం కామన్. ఇలా మనకు ఓ ఫ్యాషన్ వస్తువుగా పరిచయమైన ఉంగరం.. ఇప్పుడు స్మార్ట్ సాధనంగా మారింది. ఏకంగా చేతి ఉంగరంతోనే నగదు రహిత చెల్లింపులు (Cashless payments) చేసుకోవచ్చు. హాంగ్ కాంగ్‌కు చెందిన 'టాప్పీ' అనే సంస్థ మొట్ట మొదట అలాంటి స్మార్ట్ రింగును అభివృద్ధి చేసింది. ఆ రింగు మన చేతి వెలికి ఉంటే చాలు. ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డులతో పనుండదు. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు. చేతి వేలికి ఉండే రింగుతోనే సులువుగా క్యాష్‌లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు.

వైర్ లెస్ పేమెంట్ చిప్‌లను కలిగి ఉండే ఈ రింగ్ స్మార్ట్ ఫోన్ యాప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. సదరు యాప్ నుంచి బ్యాకు ఖాతాలకు అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఏ స్టోర్‌లోనైనా పేమెంట్ మిషన్ దగ్గర ఈ రింగును చూపించి సులువుగా చెల్లింపులు చేయవచ్చు. పైగా ఈ రింగ్‌ను చార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదట. ఈ రింగ్‌కు సంబంధించిన సాంకేతికతను జ్యుయలరీ కంపెనీలకు అందించడం ద్వారా వెండి, బంగారం.. రెండింటితోనూ ఈ స్మార్ట్ రింగ్‌లను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Shocking: ఓ నిండు గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైన డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే..!


ఇప్పుడు ఈ స్మార్ట్ రింగ్ మన దగ్గర కూడా వచ్చేసింది. స్వదేశీ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ 'సెవెన్' బుధవారం '7 రింగ్' (7 Ring) పేరిట కాంటాక్ట్‌లెస్ చెల్లింపు (Contactless payment) కోసం ఈ స్మార్ట్ వేరబుల్ రింగ్‌ను లాంచ్ చేసింది. ఈ రింగ్‌ను ఎన్‌పీసీఐ (NPCI) సహకారంతో భారతీయ బ్రాండ్ 7 అభివృద్ధి చేసింది. కాగా, ఈ రింగ్‌ను ప్రీమియం జిర్కోనియా సిరామిక్ మెటీరియల్‌తో రూపొందించడం జరిగింది. ఇది రింగ్‌కు ప్రీమియం లుక్‌తో పాటు మంచి మన్నికను ఇస్తుంది. ఇక '7 రింగ్' ఏడు వేర్వేరు సైజులలో వస్తుంది. తద్వారా అది వినియోగదారులకు సౌకర్యవంతమైన అమరికను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ రింగ్ ద్వారా వినియోగదారులు తమ ఉదయం కాఫీ నుండి సాయంత్రం కాక్‌టెయిల్ వరకు అవాంతరాలు లేని చెల్లింపు సాంకేతికతతో చాలా సులభంగా లావాదేవీలు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ రింగ్ భారత మార్కెట్‌లో ఒక సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుందని సెవెన్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ ఖుబ్‌చందానీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకమైన డిజైన్, మన్నిక, అనుకూలమైన చెల్లింపు సామర్థ్యాలతో '7 రింగ్' అనేది ఆధునిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా శైలి, సాంకేతికత యొక్క సంపూర్ణ సమ్మేళనం అని ఆయన చెప్పుకొచ్చారు.

Muskan Agrawal: ఎవరీ ముస్కాన్ అగర్వాల్..? ఏకంగా రూ.60 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆమెకు ఎలా వచ్చిందంటే..!

రింగ్ ఫీచర్లు..

కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. '7 రింగ్' సరికొత్త ఎన్‌ఎఫ్‌సీ (NFC) సాంకేతికతతో రూపొందించబడింది. ఈ రింగ్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపు ఫీచర్ వినియోగదారులను వాలెట్, ఫోన్, యాప్, పిన్, ఓటీపీ (OTP) అవసరం లేకుండా సురక్షిత చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది డస్ట్‌ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ ఫీచర్‌లను కలిగి ఉండడం వల్ల రోజువారీ ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉంగరాన్ని దీర్ఘకాలం పాటు అందంగా ఉంచుతుంది. ఉపయోగించడానికి సులభమైన యాప్ ద్వారా ఇది పని చేస్తుంది. దాంతో వినియోగదారులు సురక్షితమైన లావాదేవీలు చేసుకోవచ్చు.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

Updated Date - 2023-11-11T10:14:08+05:30 IST