Share News

Chandra Mohan : చంద్రమోహన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!?

ABN , First Publish Date - 2023-11-11T13:20:36+05:30 IST

Chandra Mohan Passed Away : సీనియర్ నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

Chandra Mohan : చంద్రమోహన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!?

చంద్రమోహన్‌గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు! కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు.

Chandramohan-4.jpg

అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసుకు వెళ్లారు. ‘రంగులరాట్నం’ (1966) చిత్రంతో హీరోగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత ఆయన చేసిన ‘సుఖదుఖాలు’, ‘బాంధవ్యాలు’ చంద్రమోహన్‌కు చాలా పేరు తెచ్చిపెట్టాయి. 1978లో రిలీజైన ‘ప‌ద‌హారేళ్ల వ‌య‌సు’ చిత్రం అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

Chandramohan.jpg


హీరోగానే కాదు.. సహ నటుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించారు. చనిపోయే ముందు వరకూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. నటనలో అద్భుతమైన ఈజ్ ఉన్న నటుడు దొరికాడని ఇండస్ట్రీ మురిసిపోయింది.

Chandramohan-8.jpg

ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటులలో చంద్రమోహన్ ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ‘రంగుల రాట్నం’లో చూసిన మహానటులు ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు.. ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మహానటుడు ఎన్టీఆర్‌ ప్రశంసించిన సందర్భాలున్నాయి. అంతేకాదు తన ‘బాంధవ్యాలు’ సినిమాలో దాదాపు హీరో పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు.

Chandramohan-5.jpg

దర్శకుడి ఊహలో రూపుదిద్దుకున్న పాత్రకు తెర మీద ప్రాణ ప్రతిష్ట చేయడంలో చంద్రమోహన్‌కు తిరుగులేదని అలనాటి నటీనటులు చెబుతుంటారు. ఎందుకంటే.. తెర మీద ఆయన కనిపించరు కానీ పాత్ర మాత్రమే కనబడేలా చేయగలగడం ఆయన గొప్పతనం.

Chandramohan-12.jpg

80వ దశకంలో చిరంజీవి లాంటి హీరోలు వచ్చేసిన తర్వాత కూడా చంద్రమోహన్ హీరోగా చేస్తూనే వచ్చారు. విశ్వనాథ్, బాపు లాంటి కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చిన దర్శకులకు చంద్రమోహన్ ఒక వరంగా కనిపించేవారు. దర్శకుడు విశ్వనాథ్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో చంద్రమోహన్‌కు బంధుత్వం ఉంది. విశ్వనాథ్ తీసిన అనేక చిత్రాల్లో చంద్రమోహన్ కీలక పాత్ర పోషించడం వెనుక ఉన్న విషయం అదే. దర్శకుడి అంతరంగాన్ని ఎరిగి నటించే నటుడని ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు.

Chandramohan-7.jpg


చంద్రమోహన్ సరసన నటించే కొత్త హీరోయిన్ ఎవరైనా ఇండస్ట్రీని దున్నేస్తారనే సెంటిమెంట్ ఆ రోజుల్లో బలంగా ఉండేది. హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలకు చాలా తేలిగ్గా షిఫ్ట్ అయిన చంద్రమోహన్ అక్కడా తనదైన ప్రత్యేకత చాటారు. తనతో సహ కథానాయకుడుగా నటించిన చిరంజీవికి తండ్రిగా కూడా చేసి తన నట వైదుష్యాన్ని నిరూపించుకున్నారు.

Chandramohan-11.jpg

1978లో ‘ప‌ద‌హారేళ్ల వ‌య‌సు’ సినిమాలో చంద్రమోహ‌న్-శ్రీ‌దేవి జంట‌గా న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక త‌ర్వాత శ్రీ‌దేవి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకిలేచింది. ‘వేట‌గాడు’, ‘కొండ‌వీటి సింహం’,‘ జ‌స్టిస్ చౌద‌రి’.. త‌దిత‌ర స్టార్ హీరోల సినిమాల్లో న‌టించింది శ్రీ‌దేవి. అదే ఏడాది.. జ‌య‌సుధతో కలిసి ‘ప్రాణం ఖ‌రీదు’ నటించగా.. ఆమె కూడా తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘పెళ్లి చూపులు’ సినిమాలో చంద్రమోహ‌న్ -విజ‌య‌శాంతి క‌లిసి న‌టించగా.. ఆ తర్వాత శోభ‌న్‌బాబు, నాగేశ్వర‌రావు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల‌తో అవకాశం రాములమ్మకు దక్కింది. అందుకే చంద్రమోహన్ ది..లక్కీ హ్యాండ్ అని అంటుంటారు.

Chandramohan-13.jpg

ఒక రకంగా తమిళ సినిమా రంగంలో కమల్ హసన్ ఏ తరహా మార్పుకు నాంది పలికారో.. తెలుగు పరిశ్రమలో చంద్రమోహన్ కూడా అలాంటి పాత్రనే నిర్వహించారని అలనాటి నటీనటులు చెబుతుంటారు. నట దర్శకురాలు విజయనిర్మల దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ చంద్రమోహన్ కీలక పాత్రలు చేశారు. శ్రీదేవి, మోహ‌న్‌బాబుతో క‌లిసి చంద్రమోహ‌న్ న‌టించారు.

Chandramohan-1.jpg

‘శుభోదయం’లో పనిదొంగగా, బద్దకానికి నిలువెత్తు నిర్వచనంలా కనిపించే పాత్రల్లో చంద్రమోహన్ నటన అద్భుతంగా పేలింది. ‘బంగారు పిచ్చిక’లో చంద్రమోహన్ చేసిన బంగార్రాజు పాత్ర అప్పటి కుర్రహీరోలకే కాదు.. ప్పటివారికీ ఛాలెంజే. చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో.. ఒక మూగ చెవిటి పనివాడిగా చంద్రమోహన్ నటన ఉన్నత శిఖరాలకు ఎక్కింది.

Chandramohan-10.jpg

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. కానీ చంద్రమోహన్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. చంద్రమోహన్‌కు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ చూడడానికి చక్కగా అందంగా ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా పిల్లలను పరిచయం చేద్దామని ఆయన భార్య అడిగినప్పటికీ వద్దని సున్నితంగా తిరస్కరించినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపారు.

Chandramohan-6.jpg

చంద్రమోహ‌న్ న‌టించిన 900 పైచిలుకు సినిమాల్లో 175పైగా సినిమాల్లో హీరోగా నటించారు. 108 సినిమాల గురించి, ఆయ‌న న‌ట‌నా ప్రతిభ గురించీ అభిమానులు, సినీ ప్రియులు చెప్పుకుంటారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విదేశాల నుంచి కుమార్తెలు రావాల్సి ఉండటంతో సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Chandramohan-9.jpg

Updated Date - 2023-11-11T14:23:37+05:30 IST