Jounalist Conned By Tea vendor: ఐఆర్‌సీటీసీ తక్షణ చర్యతో కథ సుఖాంతం

ABN , First Publish Date - 2023-01-14T18:16:26+05:30 IST

రైళ్లలో ప్రయాణించేటప్పుడు సహజంగానే వేడివేడిగా కడుపులో టీ పడితే బాగుంటుందని అనుకోని వాళ్లుండరు. సీటు దగ్గరకే వచ్చే ఐర్‌సీటీసీ టీ వెండర్‌ను..

Jounalist Conned By Tea vendor: ఐఆర్‌సీటీసీ తక్షణ చర్యతో కథ సుఖాంతం

ఘజియాబాద్: రైళ్లలో ప్రయాణించేటప్పుడు సహజంగానే వేడివేడిగా కడుపులో టీ పడితే బాగుంటుందని అనుకోని వాళ్లుండరు. సీటు దగ్గరకే వచ్చే ఐర్‌సీటీసీ (IRCTC) టీ వెండర్‌ (Tea vendor)ను పిలిచి టీ తాగుతుంటారు. ఒక్కోసారి చిల్లర లేకపోవడంతో పెద్ద నోటు ఇవ్వడం, చిల్లర మార్చి ఇస్తానంటూ అట్నించి అటే టీ వెండర్ వెళ్లిపోవడం పరిపాటి. చిల్లరి డబ్బులే కదా పోనీలే అని వదిలేసే వాళ్లూ ఉంటారు. నిస్సహాయంగా నిట్టూర్చే వాళ్లూ ఉంటారు. ఘజియాబాద్ నుంచి హౌరాకు రైలులో వెళ్తున్న ఓ జర్నలిస్టుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే, బాధ్యత కలిగిన ఓ ప్రయాణికుడిగా, వృత్తి నిబద్ధత కలిగిన పాత్రికేయుడుగా ఆయన వెంటనే స్పందించాడు. ఐఆర్‌సీటీసి క్షణాల్లో ఆ సమాచారం చేరవేశాడు. అతని ఫిర్యాదుపై అధికారులు సైతం అంతే వేగంగా స్పందించి, కన్నుగప్పి మాయమైన టీ వెండర్ నుంచి ముక్కు పిండి ఆ డబ్బులు ఫిర్యాదుదారుకు ఇప్పించారు.

వివరాల్లోకి వెళ్తే...

ప్రీతం సాహా అనే జర్నలిస్టు రైలు నెంబర్ 12312 నేతాజా ఎక్స్‌ప్రెస్‌లో ఘజియాబాద్ నుంచి హౌరా బయలుదేరాడు. మరి కాసేపట్లో ప్రయాగ్‌రాజ్ జంక్షన్ రాబోతుండగా టీ అమ్మే అతను రావడంతో టీ తీసుకున్నారు. కప్పు టీ ధర రూ.10 కావడంతో రూ.20 నోటు ఇచ్చాడు. చిల్లర లేదని, క్షణంలో తక్కిన రూ.10 ఇస్తానంటూ అతను చెప్పి ముందుకు కదిలాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేశాడు. దాంతో ఆ టీ వెండర్‌‌ను ప్రీతం సాహ వెంబడించాడు. తోటి టీ వెండర్లకు ఆ విషయం చెప్పడంతో...ఆ మనిషికి అది మామూలేనని, ఎవరో ఒకరు గట్టిగా తగులుకుంటే కానీ బుద్ధి రాదని చెప్పారు. ఆర్‌పీఎఫ్‌కు పట్టివ్వమని, ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశామని వారు సలహా ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని వివరిస్తూ ప్రీతం సహా ఓ ట్వీట్ చేశాడు. ''డబ్బులు రాబట్టుకోవడం ఇక్కడ విషయం కాదు. పదేసి రూపాయలు చొప్పున ఎందరి సొమ్ము అతని జేబుల్లోకి పోతోందనేదే నా ప్రశ్న. టీ అమ్ముకునేవాళ్ల నిజాయితీ ప్రశ్నార్థకంగా కాకూడదు. ఐఆర్‌సీటీసీ టీ వెండర్లు ప్రజల సొమ్ము లూఠీ చేస్తారా?'' అని ప్రశ్నించారు. పలువురు ప్రయాణికులను కూడా ఆ వ్యక్తి గతంలో మోసం చేశాడని, ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని కొందరు టీవెండర్లు చెప్పడంతో తాను ఈ ట్వీట్ చేశానని ప్రీతం సాహా చెప్పాడు. తన ట్వీట్‌ను ఆర్‌సీటీసీకి కూడా ఆయన షేర్ చేశాడు.

ఐఆర్‌సీటీసీ తక్షణ చర్యలు

ప్రీతం సాహా ఫిర్యాదుపై ఐఆర్‌సీటీసీ అధికారులు వెంటనే స్పందించారు. సాహా మొబైల్ నెంబర్, పీఎన్ఆర్ వివరాలు అడగడంతో ఆ వివరాలను ఆయన షేర్ చేశాడు. కొద్ది నిమిషాల్లోనే ప్రీతం సాహాకు రావాల్సిన రూ.10 అతనికి పంపారు. అంతేకాదు, నేరుగా ప్రీతం సాహా సీటు వద్దకే ఐఆర్‌సీటీసీ మేనేజర్ వచ్చి కలుసుకున్నారు. టీ వెంటర్లను పిలిపించి, మోసం చేసిన టీవెండర్‌ను గుర్తించమని సాహాను కోరారు. సాహా ఆ వ్యక్తిని గుర్తించడంతో సదరు టీవెంటర్ తన తప్పు ఒప్పుకున్నాడు. ప్రయాగ్ రాజ్ జంక్షన్‌లో టీవెండర్‌ను ఆర్‌పీఎఫ్ పోలీసులు దించేయడంతో ఈ వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణిగింది.

Updated Date - 2023-01-14T18:16:27+05:30 IST