Brain: ఒక్క రాత్రి నిద్రలేకుంటే బ్రెయిన్‌లో నమ్మశక్యంకాని మార్పు.. అలాంటి కుర్రాళ్లకు వణుకుపుట్టించే అధ్యయనం..
ABN , First Publish Date - 2023-03-12T20:06:39+05:30 IST
యువతలో చాలామంది రాత్రిపూట సరిగా నిద్రపోరు. స్నేహితులు లేదా సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరైతే రాత్రంతా మేల్కోని తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటారు. అలాంటి వారికి మెదళ్లు...
యువతలో చాలామంది రాత్రిపూట సరిగా నిద్రపోరు. స్నేహితులు లేదా సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరైతే రాత్రంతా మేల్కోని తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటుంటారు. అరకొర నిద్రతోనే సరిపుచ్చుకుంటుంటారు. ఇక ఉద్యోగాల కారణంగా రాత్రిపూట నిద్రను త్యాగం చేసేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ విధంగా రాత్రిపూట సరిగా నిద్రలేకపోతే మెదడులో జరిగే మార్పులపై చేపట్టిన అధ్యయనంలో విస్తుపోయే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. అవేంటో పరిశీలిద్దాం...
ఒక్క రాత్రి నిద్రలేమి (sleep deprivation) వ్యక్తుల మెదడు వయసు రెండేళ్లు పెరిగిపోయినంత ప్రభావం చూపగలదని నూతన అధ్యయనం హెచ్చరించింది. అయితే నిద్రలేమి కారణంగా మెదడులో సంభవించే ఈ మార్పును ఒక రాత్రి చక్కటి నిద్ర ద్వారా నష్టనివారణ చేయవచ్చునని సూచించింది. ఈ మేరకు ‘ది జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో (The Journal of Neuroscience) ఆసక్తికరమైన అధ్యయనం ప్రచురితమైంది. 19 - 39 ఏళ్ల వయసున్న 134 మంది వ్యక్తుల మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్స్ తీసి.. మెషిన్ లెర్నింగ్ ద్వారా మెదడు వయసులను (Brain Age) లెక్కగట్టినట్టు అధ్యయనకారులు వివరించారు. రీసెర్చ్‌లో పాల్గొన్న భాగస్వాములు రాత్రిపూట 3 గంటలు నిద్రలేనప్పుడు... రాత్రిపూట అసలు నిద్రలేనప్పుడు ఇలా రెండు సందర్భాల్లో మెదడుల ఎంఆర్ఐ స్కానింగ్‌లు తీసి వాటిని పరిశీలించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్టు అధ్యయనకారులు వివరించారు.
జర్మనీలోని ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆచెన్ యూనివర్సిటీకి చెందిన ఇవా-మారియా ఎల్మెన్‌హోస్ట్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. నిద్రలేమి మొత్తం మెదడుపై ప్రభావం చూపుతుందనేందుకు తమ అధ్యయనం తాజా ఆధారమని ఆమె పేర్కొన్నారు. తక్కువసేపు నిద్రలేమి అంతగా ప్రభావం చూపబోదన్నారు. ముఖ్యంగా కనీసం 5 గంటలైనా నిద్రపోయేవారి మెదడులో మార్పులు పెద్దగా కనిపించలేదన్నారు.
కాగా మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమని అధ్యయనకారులు హెచ్చరించారు. ఆలోచనా విధానం, జ్ఞాపక శక్తికి (మెమొరీ) నిద్ర అతిముఖ్యమని, లేదంటే శరీర భాగాల పనితీరుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ అధ్యయనం నిద్రపై అవగాహన పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.