Deepika Kothari: నిన్న ఆమె.. నేడు అతడు.. తెరవెనుక షాకింగ్ స్టోరీ

ABN , First Publish Date - 2023-08-15T21:08:17+05:30 IST

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. స్వలింగ సంపర్కుల్ని స్వాగతించే పరిస్థితుల దగ్గర నుంచి లింగ మార్పిడి చేయించుకునే దాకా.. ఈ ఆధునిక యుగంలో ఎన్నో మార్పులొచ్చాయి..

Deepika Kothari: నిన్న ఆమె.. నేడు అతడు.. తెరవెనుక షాకింగ్ స్టోరీ

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. స్వలింగ సంపర్కుల్ని స్వాగతించే పరిస్థితుల దగ్గర నుంచి లింగ మార్పిడి చేయించుకునే దాకా.. ఈ ఆధునిక యుగంలో ఎన్నో మార్పులొచ్చాయి. అందుకే.. ఒకప్పుడు తమ భావాల్ని వ్యక్తపరచడానికి కూడా భయపడే వాళ్లు, ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా లింగ మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఓ మహిళా పోలీస్ అధికారి కూడా అదే పని చేసింది. నిన్నటిదాకా మహిళగా ఉన్న ఆమె, ఇప్పుడు కాస్త అతడుగా మారబోతోంది. ఇందుకు సంబంధించి హోం శాఖ నుంచి అనుమతి కూడా పొందింది.

ఆమె పేరు దీపికా కొఠారి. మధ్యప్రదేశ్‌లోనే రత్లాం జిల్లాలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. అయితే.. ఈమెకు చిన్నప్పటి నుంచి ‘జెండర్ ఐడెంటిటీ డిజార్డర్’ అనే సమస్య ఉంది. అంటే.. తానొక మహిళ అయినప్పటికీ, తనని తాను పురుషుడిగా దీపికా భావించేది. శరీరం మహిళది అయినా, పురుషుడి లక్షణాలు ఉన్నాయి. కానీ.. చిన్నతనంలో తనకున్న ఈ సమస్యని ఎవ్వరితోనూ పంచుకోలేదు. తనని హేళన చేస్తారేమోనన్న భయంతో.. పురుషుడి లక్షణాలున్నా మహిళగానే ఉండటానికి ప్రయత్నించింది. ఇదే క్రమంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం కూడా సంపాదించింది. అయితే.. తనలో ఉన్న ఆ సమస్యని అధిగమించలేకపోయింది.


ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకోవడం కోసం ఢిల్లీలోని ఓ వైద్యుడిని దీపికా కొఠారి సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు.. లింగ మార్పిడి చేయించుకోవడమే ఈ సమస్యకి పరిష్కారమని తేల్చి చెప్పాడు. మొదట్లో ఈ మాట విని ఆమె కాస్త అయోమయానికి గురైనా.. చివరికి డాక్టర్ సలహా మేరకు లింగ మార్పిడికి సిద్ధమైంది. అయితే.. తానో కానిస్టేబుల్ కాబట్టి, లింగ మార్పిడి కోసం సంబంధిత శాఖ నుంచి తప్పకుండా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీపికా ఈ ఏడాది జనవరిలో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసి, ప్రభుత్వం నుంచి లింగ మార్పిడి కోసం అనుమతి కోరింది.

ఈ అనుమతి పొందడం కోసం దీపిక కొన్ని విధానాల్ని అనుసరించాల్సి వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీన డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఆమెని పరీక్షించింది. ఆమెలో ఉన్న సమస్యని గుర్తించి, తన నివేదికని సివిల్ సర్జన్‌కు సమర్పించింది. ఈ నివేదికని పరిశీలించాక.. సోమవారం లింగ మార్పిడికి దీపికాకి అనుమతి లభించింది. న్యాయశాఖ అభిప్రాయాన్ని, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసులో ఆమెకు అనుమతి మంజూరు చేయబడిందని అధికారులు తెలిపారు. అయితే.. లింగ మార్పిడి తర్వాత ఉద్యోగంలో మహిళలకు సంబంధించిన ప్రత్యేక సేవలు ఇకపై ఉండవని ఆ శాఖ ఆమెకు తేల్చి చెప్పింది.

మరో విషయం ఏమిటంటే.. ఇలా లింగ మార్పిడికి అనుమతి పొందింది ఒక్క దీపికా కొఠారినే కాదు, గతంలోనూ ఒక మహిళ ఇందుకు అనుమతి తీసుకుంది. ఆమె పేరు ఆర్తి యాదవ్. ఈమెకు కూడా జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉండటంతో.. ప్రభుత్వం అనుమతితో లింగ మార్పిడి చేయించుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లింగ మార్పిడికి అనుమతి పొందిన రెండో మహిళా కానిస్టేబుల్‌గా దీపికా కొఠారి నిలిచింది.

Updated Date - 2023-08-15T21:39:04+05:30 IST