రహస్యంగా రెండో పెళ్ళి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు.. విషయం తెలిసి మొదటి భార్య కోర్టును ఆశ్రయిస్తే జరిగిందిదీ.
ABN , First Publish Date - 2023-03-14T17:53:40+05:30 IST
తనకు తన కొడుకుకు భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేయాలని అనుకుందామె. అయితే ఆ తరువాత జరిగిన నిర్ణయాలన్నీ చాలా షాకింగ్ గా..
వారిద్దరిదీ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. ఎప్పుడూ ఎలాంటి గొడవా జరగలేదు. ఒకరిని మరొకరు బాధపెట్టుకోలేదు. కానీ ఒకే ఒక్క సంఘటన వారిద్దరి జీవితాన్ని మార్చేసింది. నా భర్త శ్రీరామ చంద్రుడు అని మురిసిపోయిన ఆమె తన నోటితోనే రాముడు కాదు రాక్షసుడు అనే పరిస్థితి తెచ్చింది. రహస్యంగా రెండవ పెళ్ళిచేసుకుని పిల్లలను కూడా కన్నాడని తెలిసి ఆ మహిళ రగిలిపోయింది. నా భర్త ఇలా చేశాడంటూ కోర్టును ఆశ్రయించింది. చివరికి ఎవరూ ఊహించని నిర్ణయాలు జరిగాయి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం గ్వాలియర్(Gwalior) కు చెందిన ఓ మహిళకు 2018లో హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్(Software engineer) తో పెళ్ళిజరిగింది. వీరిద్దరూ రెండు సంవత్సరాల పాటు ఏ చీకూచింతా లేకుండా ఉన్నారు. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఈ క్రమంలో దేశం మొత్తం కరోనా విలయం సృష్టించింది. అప్పుడే అతను తన భార్యను గ్వాలియర్ కు తీసుకెళ్ళి ఆమె పుట్టింట్లో వదిలి గురుగ్రామ్ కు తిరిగొచ్చాడు. కరోనా లాక్ డౌన్(Corona Lock Down) కారణంగా వీరిద్దరూ సుమారు సంవత్సరం పైగా దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో ఒంటరితనంలో ఉన్న అతనికి తను పనిచేసే కంపెనీలో ఒకమ్మాయితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ప్రేమ పెరిగి పెళ్లికి దారితీసింది. అతను రెండవ పెళ్ళి చేసుకున్నట్టు ఎవరికీ చెప్పలేదు. రెండవ భార్యకు కూడా ఓ పాప పుట్టింది. సంవత్సరం దాటినా తన భర్త తనను తీసుకెళ్ళడానికి రాకపోవడంతో మొదటి భార్య గ్వాలియర్ నుండి గురుగ్రామ్ కు చేరుకుంది. అక్కడ కొందరి ద్వారా అతను రెండవ పెళ్ళి చేసుకున్న విషయం తెలుసుకుని కోపంతో రగిలిపోయింది. గ్వాలియర్ లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి తన భర్త చేసిన పని చెప్పింది. తనకు తన కొడుకుకు భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేయాలని అనుకుందామె. అయితే ఆ తరువాత జరిగిన నిర్ణయాలన్నీ చాలా షాకింగ్ గా ఉన్నాయి.
ఆమె భర్తకు వస్తున్న సంపాదన పరంగా చూస్తే ఆమెకు నెలకు 7నుండి 8వేల రూపాయలు మాత్రమే భరణంగా లభిస్తాయని కౌన్సెలర్ చెప్పాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వారితో రాజీ కుదుర్చుకుని కొన్ని సెటిల్మెంట్లు చేసుకుంటే మంచిదని ఆమెకు వివరించాడు. దీని ప్రకారం భర్త ఇద్దరు భార్యలను వేరు వేరు ఇళ్ళలో ఉంచాలని నిర్ణయించారు. ఇద్దరి దగ్గర చెరొక మూడు రోజులు ఉంటాడు. మిగిలిన ఒకరోజు ఆదివారం అతనికి నచ్చిన చోట ఉండచ్చు. దీని వల్ల కేవలం మొదటి భార్యకే కాకుండా మిగిలిన ఇద్దరికీ కూడా ప్రయోజనమని కౌన్సెలర్ చెప్పుకొచ్చారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా చేసుకునే పెళ్లి చెల్లదు. మొదటి భార్య, భర్త మీద కేసు వేస్తే అతను కొన్నేళ్ళ పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. భార్య భర్త మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే భర్త ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇన్ని కారణాలు వివరించేసరికి భర్త కూడా అక్కడ మూడు రోజులు, ఇక్కడ మూడు రోజులు ఉండటానికే మొగ్గు చూపాడు. ఈ నిర్ణయం విన్నవాళ్ళు ఇదేం విచిత్రమంటూ ఆశ్చర్యపోయారు. అందరి జీవితాలు బాగుండాలంటే కొన్ని నిర్ణయాలు ఇలా చేసుకోకతప్పదని మరికొందరు అంటున్నారు.
Read also: Mango man: ఒక్క మామిడిచెట్టుకు 300రకాల పండ్లు.. 7వతరగతి ఫెయిలైన ఈ తాత అద్బుతమే చేశాడు..