Viral: పురుగుల వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. మనుషులు చేయాల్సిందీ ఇదేనని సలహా.. నెట్టింట వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-06-20T22:05:07+05:30 IST
ఏపని ప్రారంభించే ముందైనా సరే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలంటూ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా షేర్ చేసే విషయాలు నెట్టింట్లో నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, ప్రతి సోమవారం ఆయన మరింత విశేషమైన అంశాలను పంచుకుంటూ ఉంటారు. మండే మోటివేషన్ పేరిట వీటిని షేర్ చేస్తుంటారు. ఇటీవల ఆయన ట్వీట్ చేసిన వీడియో కూడా నెటిజన్లను అమితంగా ఆకర్షి్స్తోంది.
ఏదైనా పని ప్రారంభించేందుకు ఎలా సన్నద్ధం కావాలో చెబుతూ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఓ పురుగుల వీడియోను షేర్ చేశారు. ప్రయాణం మొదలయ్యే ముందు విమానాలను రకరకాలుగా తనిఖీలు చేసి సన్నద్ధం చేస్తారు. విమానంలో అన్ని వ్యవస్థలూ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వీటినే ‘ప్రీ ఫ్లైట్ ప్రిపరేషన్స్’ అంటారు. ఈ ప్రీ ఫ్లైట్ ప్రిపరేషన్స్ విమానయాన రంగంలోనే కాదు ప్రకృతిలోనూ కనిపిస్తుందని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. పురుగులు ఎగిరేముందు అన్ని రకాలుగా తాము సిద్ధంగా ఉన్నామన్న నిర్ధారించుకున్నాకే ప్రయాణం ప్రారంభిస్తాయంటూ వీడియోను షేర్ చేశారు(Insect preflight preparations). ఇందులో, రకరకాల రెక్కల పురుగులు ముందుగా తమని తాము అన్ని కోణాల్లో పరిశీలించుకున్నాకే ఎగరడం చూడొచ్చు. అయితే, ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరైనా పూర్తిగా సన్నద్ధం కావాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. దీనికి ప్రత్యామ్నాయమే లేదని తేల్చి చెప్పారు. ఆయన సూచన జనాలకు స్ఫూర్తివంతంగా అనిపించడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.