Rio Carnival: నాలుగున్నర కోట్ల మంది పాల్గొనే ప్రపంచంలోనే అతిపెద్ద జాతర.. రూ.8వేల కోట్లతో గ్రాండ్ పార్టీ.. నగరమంతా సందడి..!
ABN , First Publish Date - 2023-02-22T13:48:19+05:30 IST
ఏకంగా నాలుగున్నర కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని అంచనా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జాతర రియో కార్నివాల్ ఫెస్టివల్ 2023 (Rio Carnival Festival 2023) ఈ నెల 17న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఏకంగా నాలుగున్నర కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని అంచనా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జాతర రియో కార్నివాల్ ఫెస్టివల్ 2023 (Rio Carnival Festival 2023) ఈ నెల 17న ప్రారంభమైన విషయం తెలిసిందే. మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ లైట్లు.. కళ్లు చెదిరే అద్దాల కాస్ట్యూమ్స్.. వీధుల నిండా ప్రజలు తెల్లవార్లూ రోడ్లపైనే రోమింగ్ పార్టీలు.. సాంబా డ్యాన్సులు.. బ్రెజిల్‌లోని రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న కార్నివాల్‌లో వారం రోజుల పాటు నిత్యం కనిపించే దృశ్యాలు. కార్నివాల్‌లో పాల్గొనే ప్రజలు భిన్నమైన కాస్ట్యూమ్‌లు, భారీ శకటాలతో వీధుల్లో ప్రదర్శన ఇస్తుంటారు. ఇక డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ పరేడ్ చేసే 'సాంబా స్కూల్స్' ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఈ సాంబా స్కూళ్ల మధ్య పోటీలు సైతం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నగరంలోని 12 సాంబ స్కూళ్లు పరేడ్ ఛాంపియన్‌షిప్ కోసం పోటీలో ఉన్నాయి. ఈ సాంబా స్కూళ్ల పరేడ్‌ను చూసేంందుకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. రాణులు, రాజుల వేషధారణలో పరేడ్‌కు హాజరవుతుంటారు.
ఈ ఏడాది కార్నివాల్‌కు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. రియోలోని హోటళ్లన్నీ ఇప్పటికే 85శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అక్కడివారు చెబుతున్నారు. సాంబడ్రోమ్ అనే భారీ మైదానంలో ఈ వార్షిక పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. ఇక కరోనా కారణంగా 2021లో వేడుకలు రద్దు చేశారు. గతేడాది మాత్రం రెండు నెలలు ఆలస్యంగా కార్నివాల్ నిర్వహించారు. అది కూడా కొద్ది మంది స్థానికులకే అనుమతి ఇచ్చారు. అంతేగాక చాలా వరకు కార్యక్రమాలను నిషేధించారు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న కార్నివాల్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వాణిజ్యపరంగానూ ఈ జాతర కోట్లు కురిపిస్తోంది. ఈ నెల 25వ తేదీ వరకు జరిగే ఈ కార్నివాల్ ద్వారా మొత్తంగా రూ.8వేల కోట్లకు పైగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!