Viral: చనిపోయింది ఒక్కరే.. కానీ రెండు సార్లు అంత్యక్రియలు.. ఆ కుటుంబానికి ఈ వింత పరిస్థితి రావడం వెనుక..!
ABN , First Publish Date - 2023-12-11T14:43:08+05:30 IST
ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయారు. తమ కుటుంబ సభ్యుడు ఇక లేడు అన్న బాధను మర్చిపోయి మామూలు పరిస్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సరిగ్గా మూడు వారాల తర్వాత వారికి ఓ షాకింగ్ నిజం తెలిసింది.
ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయారు. గుండె నిండా బాధతోనే ఆ కుటుంబ సభ్యులంతా చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అతడి పేరిట సంస్మరణ కార్యక్రమాలను కూడా చేశారు. తమ కుటుంబ సభ్యుడు ఇక లేడు అన్న బాధను మర్చిపోయి మామూలు పరిస్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సరిగ్గా మూడు వారాల తర్వాత వారికి ఓ షాకింగ్ నిజం తెలిసింది. ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి వచ్చారు. ‘మీరు మూడు వారాల క్రితం అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు కాదు.. మీ కుటుంబ సభ్యుడి మృతదేహం ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. వచ్చి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోండి’.. అంటూ అతడు చెబుతున్న మాటలను విని కుటుంబ సభ్యులంతా అవాక్కయ్యారు. దీంతో వెంటనే వెళ్లి మృతదేహాన్ని తీసుకుని మళ్లీ మరోసారి ఆ కుటుంబ సభ్యులంతా కలిసి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. యూకేలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూకేలోని సౌత్ వేల్స్ లో క్వంబ్రాన్ లోని ది జార్జ్ యూనివర్శిటీ ఆసుపత్రిలో నాలుగు వారాల క్రితం ఓ వ్యక్తిని చేర్చారు. చికిత్స పొందుతూనే వారం రోజుల తర్వాత అతడు మరణించారు. ఆస్పత్రి వర్గాలు అప్పగించిన మృతదేహానికి సిర్హోయ్ వాలీ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంతక్రియలు నిర్వహించారు. కుటుంబంలో ఓ వ్యక్తి ఇక లేరన్న బాధ నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న తరుణంలో.. మూడు వారాల తర్వాత ఆ కుటుంబ సభ్యులకు జార్జి యూనివర్శిటీ ఆస్పత్రి సిబ్బంది ఊహించని షాకిచ్చారు.
‘సర్, పొరపాటు జరిగింది. అనుకోకుండా వేరే వ్యక్తి మృతదేహాన్ని మీకు అప్పగించాము. మీరు కూడా అంత్యక్రియలు చేశారు. జరిగిన తప్పునకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మీ కుటుంబ సభ్యుడి మృతదేహం ఇంకా ఆస్పత్రిలోని మార్చురీలోనే ఉంది. వచ్చి తీసుకెళ్లగలరు’ అంటూ ఆస్పత్రి సిబ్బంది బాంబు పేల్చారు.
దీంతో వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. మరోసారి బంధుమిత్రుల మధ్య అంత్యక్రియలను నిర్వహించుకున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆస్పత్రి వర్గాల వైఫల్యం కారణంగానే తాము మానసిక వేధనకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై జార్జ్ యూనివర్శిటీ ఆస్పత్రి అధికారిక ప్రతినిధి అనేయురిన్ బెవన్ స్పందించారు. ‘ఆ కుటుంబానికి ఎదురైన పరిస్థితిని తలచుకుంటేనే బాధగా ఉంది. ఈ ఘటనకు మేము పూర్తి బాధ్యత వహిస్తున్నాము. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాము. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వము’ అంటూ బెవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ కుటుంబ సభ్యులు మొదటగా అంత్యక్రియలు చేసింది ఎవరి మృతదేహానికో కూడా తెలియదని ఆస్పత్రి వర్గాలు పేర్కొనడం మరింత శోచనీయం.