Uyyalawada Narasimha Reddy: ‘సైరా’ సినిమాలో చూపించిందంతా నిజమో.. కాదో.. పక్కనపెడితే..
ABN , First Publish Date - 2023-02-22T11:42:39+05:30 IST
జుర్రేరు ఒడ్డున ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా నరసింహారెడ్డిని ఉరితీశారు.
చరిత్ర తిరగవేస్తే, తవ్వితే, తొలుచుకుంటూ బయటపడే వీరగాథలెన్నో.. వీరుల మరణాల మీద వారి ప్రాణ త్యాగాల మీద నిలబడి నిత్య యవ్వనంతో పులకిస్తున్న వేద భూమి ఇది. ఈనాడంతా స్వార్థాన్నే పరమావిధిగా చేసుకుని బ్రతుకుతుంటే.., ఓనాడు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి, త్వాగధనులుగా నిలిచిన వీరులెందరో.. అందులో రాయలసీమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం చెందిన రోజు ఇది. అతనిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు.
ఆరోజుల్లో అతని కథ తెలియని గడపలేదు..
ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 24 నవంబర్, 1806 వ సంవత్సరంలో నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం, రూపనగుడి గ్రామంలో జన్మించాడు. 1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కోసం అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపినపుడు, అక్కడి తాహసిల్దార్ అతనిని అవమానించి పంపేస్తూ, నరసింహారెడ్డి వస్తేనే పైకం ఇస్తానని చెప్పిన కారణంగా రెడ్ల పోరు మొదలైంది. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించటంతో పాలెగాళ్ళు బ్రిటిష్ అధికారంలోకి వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేశారు. బదులుగా వారికి నెలవారీ జీతం ఇవ్వటం మొదలుపెట్టారు. తాతలకాలం నుంచి నెలకు 11 రూపాయలు భరణం ఇచ్చేలా ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అది సమయానికి ఇవ్వకపోగా నరసింహారెడ్డిని దుర్భాషలాడాడు తాహసిల్దార్. ఆంగ్లేయుల చేతిలో అంతటి అవమానం భరించలేని నరసింహారెడ్డి మాన్యాలను పోగొట్టుకున్న మరికొందరిని కూడగట్టుకుని పెద్ద సైన్యంలా ఆంగ్లేయుల మీదకు దండెత్తాడు.
అక్కడితో ఈకథ ఆగిపోయుండి ఉంటే..
పోరుబాట పట్టిన భూస్వాములంతా కోయిలకుంట్ల పట్టణం మీద దండెత్తి తహసీల్దారుని పట్టుకుని తల నరికి, నయనాలప్ప కొండలో శివాలయం గుహలో దాచాడు. ఉద్యమకారుడిగా, పాలెగాళ్ల నాయకుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం బ్రీటిష్ వాళ్ళను ఎదిరించి నిలిచేలా చేసింది. ఉయ్యాల వాడ చరిత్ర 150 ఏళ్ళ క్రితం జరిగిపోయిన కథే కావచ్చు. 18వ శతాబ్దంలో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ అమలులో ఉన్నప్పటి మాట. పాలెగాళ్ళకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసి బ్రిటీష్ ప్రభుత్వం చేసిన దుర్ఛర్యకు పాలెగాళ్ళను ఉద్యమించేలా చేసింది. తాహిసీల్దార్ తల నరికిన సైన్యాన్ని 1846లో నల్లమల కొండల్లో ఉన్న జగన్నాథ ఆలయంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఉండగా బ్రిటీష్ సైన్యం అతడిని బంధించింది. అతనితో పాటు కొన్ని వందల మందిని పట్టుకుని ఒక్కొక్కరినీ ఒక్కోలా శిక్షించింది. వేలమందిలో ఉద్యమ స్పూర్తిని నింపిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై బందిపోటు దొంగగా ముద్ర వేసింది. హత్యలకు, దోపిడీలకూ పాల్పడ్డాడని దోపిడి దొంగంటూ తీర్పునిచ్చింది. అతనికి ఉరిశిక్ష విధించాలని తీర్మానించింది.
ఉరికంబానికి వేలాడిన ఉయ్యాలవాడ నరసింహుని తల...
1847 ఫిబ్రవరి 22 ఉదయాన ఏడు గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో కోవెలకుంట్ల సమీపంలో ఉన్న జుర్రేరు ఒడ్డున ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా నరసింహారెడ్డిని ఉరితీశారు. 1877దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. నరసింహారెడ్డితోపాటు ఉద్యమంలో పాల్గొన్న వందలమందిపై కేసులు పెట్టారు. వీరిలో కొంతమందికి జైలు శిక్ష వేయగా.. మరికొందరికి ద్వీపాంతర శిక్ష పడింది.
సిపాయి తిరుగుబాటుకు బాసటగా నిలిచిన పోరు..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదలుపెట్టిన ఉద్యమం ఒంటరి పోరాటంలో వందలకొద్దీ సైన్యాన్ని సమకూర్చి, బ్రిటీషు సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొనలేకపోయినా కూడా ఈ పోరాటం ఏడాదికాలం కంటే ఎక్కువ సమయం జరిగి ఉండకపోవచ్చు కానీ దాని ఫలితం ఎన్నో ఏళ్లపాటు కనిపించింది. నరసింహారెడ్డి చూపిన తెగువ, ధైర్యం ఆతరువాత జరిగిన సిపాయిల తిరుగుబాటుకి కేంద్ర బిందువుగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. 1857కు సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ళ ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగాళ్ళ ఉద్యమం జరిగింది. ఇది అప్పటి ప్రజల్లో బ్రిటీష్ ప్రభుత్వంపై ఎర్రజండాను ఎత్తే ధైర్యాన్ని నింపిండి. తిరుగుబాటు తనాన్ని నేర్పింది.
అందుకే బ్రిటీష్ వారిని ఎదురించిన తొలి స్వాతంత్ర పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. 170వ వర్థంతి సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుతో 2017లో ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. 2019లో ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సైరా అనే చిత్రం విడుదలైంది. దాని తరువాత మళ్ళీ మరోసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రతినోటా వినిపించింది. సైరా సినిమాలో చూపించిందంతా నిజమో కాదో పక్కన పెడితే, ఉయ్యాలవాడ పోరాటం నిజం. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరుసలిపిన ఆయన తెగువ నిజం. ఉరికొయ్యలకు వేలాడి, అసువులు బాసిన ఆయన చరిత్ర నిజం. ఎందరికో స్పూర్తిగా నిలిచి ఉరికంబం ఎక్కిన వీరుడి అడుగుజాడల్లో వేలమంది స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులై అడుగులు వేసేలా చేసిన అమరవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరస్మరణీయుడు.