Viral Video: బారీకేడ్స్ రంధ్రాల్లోంచి వేళ్లు పెడుతూ ఎకసెక్కాలు.. చివరకు మనోడి పరిస్థితి ఏంటో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-03-09T12:03:22+05:30 IST

బయట ఉంటేనే నీ పవర్ అంతా.. ఇలా లోపలుంటే పిల్లిలా గమ్మునుండాల్సిందే అనుకున్నాడేమో..

Viral Video: బారీకేడ్స్ రంధ్రాల్లోంచి వేళ్లు పెడుతూ ఎకసెక్కాలు.. చివరకు మనోడి పరిస్థితి ఏంటో మీరే చూడండి..!

మనిషి పైత్యం పరాకాష్టకు చేరినప్పుడు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ఆ మనిషికి సరదానే అయినా అవతలి వారికి మాత్రం ఇబ్బందిగానూ బాధగానూ ఉంటుంది. మరీ ముఖ్యంగా నోరులేని జీవుల దగ్గర చిలిపితనం పేరుతో పరిధులు దాటిపోతారు. బంధీగా ఉన్న ఓ మృగరాజు దగ్గర ఓ వ్యక్తి ఎకసెక్కాలకు దారుణమైన ఫలితం అనుభవించాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి తెలుసుకుంటే..

వీకెండ్ వచ్చిందంటే చాలా మంది సరదాగా సినిమాలకు, షాపింగ్ లకు వెళుతుంటారు. మరికొందరు జూ పార్క్ లకు వెళతారు. ఓ వ్యక్తి అలాగే జూ పార్క్ కు వెళ్ళాడు. జంతువులను చూసుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళగానే అతనిలో పైశాచికం ఏదో నిద్రలేచింది. సింహం లోపల ఉంటే దాని బారికేడ్ వద్దకెళ్ళి చూశాడు. సింహం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. 'బయట ఉంటేనే నీ పవర్ అంతా.. ఇలా లోపలుంటే పిల్లిలా గమ్మునుండాల్సిందే' అనుకున్నాడేమో.. సింహాన్ని తన చేష్టలతో కవ్వించడం మొదలుపెట్టాడు. బారికేడ్ రంధ్రాలలో నుండి చేతివేళ్ళు దూర్చి సింహాన్ని తన వేపు ఆకర్షిస్తున్నాడు. సింహం బారికేడ్ దగ్గరకు వచ్చి వ్యక్తి వైపు కోపంగా చూసి 'నాతో ఏంటి నీ ఆట.. పో అవతలికి' అని హెచ్చరిస్తున్నట్టే గర్జించింది. కానీ అతను మాత్రం తన పైత్యాన్ని వదలకుండా బారికేడ్ రంధ్రాలలో వేళ్ళు దూర్చి సింహాన్ని వేళ్ళతో పొడుస్తున్నాడు.

Read also: Viral Video: ఓ చిన్న బాతు.. పులితోనే ఓ ఆటాడుకుందిగా.. చంపి తినేందుకు వస్తే.. పులికే చుక్కలు చూపించిన బాతు..!


'లోపలున్నానని ఎక్కువ చేస్తున్నావ్ చెబుతా నీ సంగతి' అనుకుని అదను చూసి ఆ వ్యక్తి చేతివేళ్ళను నోటికందుకుంది సింహం. అతను సింహం నోట్లో ఇరుక్కున్న తన చేతివేళ్ళను బయటకు లాక్కోడానికి నానా అవస్థలు పడ్డాడు. బారికేడ్లను కాళ్ళతో తంతూ తన బలమంతా ఉపయోగించి తన చేతిని వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతనెంత ప్రయత్నం చేసినా పులి నోట్లో నుండి తన వేళ్ళను తప్పించలేకపోయాడు. ఫలితంగా అతని వేళ్ళను పులి కొరికేసింది. అతని వేళ్ళు పులి నోట్లోకి వెళ్ళిపోగానే అతను వేగంగా వెనక్కు వచ్చి పడ్డాడు. పులి మనిషి రక్తం టేస్ట్ చెయ్యాల్సి వచ్చింది ఈ రోజు అన్నట్టు నాలుకతో మూతి తుడుచుకుంటూ పక్కకెళ్ళింది. ఈ వీడియోను Hasna Zaroori Hai అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. 'ఇతను ఇలా చేయడం సరికాదు, జూ పార్క్ లో జంతువుల ముందు ఆ వేషాలేంటి?' అని ఈ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. వీడియోలో ఆ వ్యక్తి వేళ్ళు సింహం నోట్లో ఇరుక్కుపోయి అతను కొట్టుమిట్టాడుతుంటే, అతని చుట్టూ ఉన్నవాళ్ళు వీడియో తీయడానికే ప్రాధ్యాన్యత ఇచ్చారు తప్ప అతనికి ఏదైనా సహాయం చేద్దామని, సింహం నుండి అతన్ని తప్పిద్దామని ఎవరూ అనుకోలేదు, ముందుకురాలేదు. ఈ పాయింట్ ను ఎత్తిచూపుతూ జనాల నుండి ఇంతకంటే ఏమీ ఆశించలేం అంటున్నారు కొందరు.

Updated Date - 2023-03-09T12:05:57+05:30 IST