BJP: బీజేపీ టార్గెట్ ఓల్డ్‌సిటీ..! మజ్లిస్‌ను ఓడించడం అయ్యేపనేనా?

ABN , First Publish Date - 2023-02-21T20:27:44+05:30 IST

తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇప్పుడు ఓల్డ్‌సిటీనే ఎందుకు టార్గెట్ చేసుకుంది? కార్నర్ మీటింగ్‌లతో మజ్లిస్ పార్టీతో ‘తాడో-పేడో’ తేల్చుకుంటామన్నట్లు ఎందుకు వ్యవహరిస్తోంది?.. ఈ ప్రశ్నలన్నింటికి బీజేపీ ఎత్తుగడలే సమా

BJP: బీజేపీ టార్గెట్ ఓల్డ్‌సిటీ..! మజ్లిస్‌ను ఓడించడం అయ్యేపనేనా?

తెలంగాణలో (Telangana) అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ (BJP).. ఇప్పుడు ఓల్డ్‌సిటీనే (Old City) ఎందుకు టార్గెట్ చేసుకుంది? కార్నర్ మీటింగ్‌లతో మజ్లిస్ పార్టీతో (AIMIM) ‘తాడో-పేడో’ తేల్చుకుంటామన్నట్లు ఎందుకు వ్యవహరిస్తోంది? మొన్నటికి మొన్న కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రమ్నాస్‌పురలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌ను (Corner meeting) స్థానిక మజ్లిస్ కార్పొరేటర్ అడ్డుకోవడంతో.. పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. నిజానికి సమావేశాన్ని కార్పొరేటర్ అడ్డుకున్న తర్వాత.. పోలీసుల రంగప్రవేశంతో తిరిగి కార్నర్ మీటింగ్‌ను నిర్వహించుకునే చాన్స్ ఉన్నా.. బీజేపీ ఎందుకు ఠాణా మెట్లెక్కింది? ఈ ప్రశ్నలకు బీజేపీ ప్రధాన లక్ష్యం మజ్లిస్ పార్టీ.. పాతనగరమేనని స్పష్టమవుతోంది.

భాగ్యలక్ష్మి ఆలయం నుంచే..

బీజేపీ ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నా.. చార్మినార్‌ను (Charminar) ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం (Bhagyalaxmi temple) నుంచే ప్రారంభిస్తోంది. బండిసంజయ్ పాదయాత్ర (Bandi Sanjay Padayatra) మొదలు.. భాగ్యలక్ష్మి ఆలయాన్నే కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌కు (Hyderabad) కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు.. చివరకు ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ వచ్చినా.. భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. అంతేకాదు.. పాతనగరంలో గతంలో తమకు పట్టున్న ప్రాంతాల్లో ఓటుబ్యాంకు తిరిగి పుంజుకునేలా చేస్తున్నారు. దీన్ని బట్టి.. బీజేపీ ప్రధాన టార్గెట్ ఓల్డ్ సిటీ అని స్పష్టమవుతోంది.

Untitled-78.jpg

కంచుకోటల తిరిగి స్వాధీనానికి..?

హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం (Hyderabad Parliament) పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. పాతనగరాన్ని నిజాం కాలం నుంచి అంధ్రూనీ హైదరాబాద్ (మూసీకి లోపలివైపు) పిలుస్తుంటారు. కొత్తనగరాన్ని బహరూనీ హైదరాబాద్(మూసీకి బయటి వైపు) అని అంటారు. కార్వాన్‌ కూడా మూసీకి ఆవల.. ఈవల ఉంటుంది. అలా మూసీకి దక్షిణం వైపు ఉండే కార్వాన్‌ను అంధ్రూనీ కార్వాన్ అని పిలుస్తారు. పాతనగరంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఒక్క గోషామహల్ మాత్రమే బీజేపీ ఖాతాలో ఉంది. 1999కి ముందు వరకు బీజేపీకి కార్వాన్ కంచుకోటగా ఉండేది. అదేవిధంగా.. మలక్‌పేటపై 2004 వరకు బీజేపీ తన పట్టును కొనసాగించింది. ఇప్పుడు గోషామహల్‌ సిటింగ్ స్థానాన్ని నిలుపుకొంటూనే.. మలక్‌పేట్, కార్వాన్‌లలో తిరిగి పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

కంచుకోటల్ని కోల్పోయారిలా..

కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉండేది. 1985 నంచి 1999 వరకు బీజేపీ నేత బద్ధం బాల్‌రెడ్డి మూడు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి.. ఓటుబ్యాంకును పెంచుకుంటూ వచ్చారు. 1999లో అప్పటికే ఐదు సార్లు హైదరాబాద్ సిటింగ్ ఎంపీ అయిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ(సాలార్)ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ బద్ధం బాల్‌రెడ్డిని లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికలోనూ సాలారే గెలిచారు. అయితే.. కార్వాన్ స్థానంలో అప్పటి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, యువకుడు అయిన జి.కిషన్‌రెడ్డిని నిలబెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బద్ధం బాల్‌రెడ్డి తన పరిధిలోని ఏడు నియోజకవర్గాలను చుట్టేసే పనిలో బిజీగా ఉండడం, ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన కిషన్‌రెడ్డి ప్రచారంలో కొంత వెనకబడడాన్ని మజ్లిస్ అవకాశంగా మలచుకుంది. వివాదరహితుడు.. బొగ్గుల వ్యాపారం చేసుకుని, పైకి వచ్చిన సయ్యద్ సజ్జాద్‌ను బరిలోకి దింపింది. అలా.. కార్వాన్ బీజేపీ చేజారింది. మజ్లిస్‌కు కంచుకోటగా మారింది.

Untitled-9.jpg

సజ్జాద్ మరణం తర్వాత మజ్లిస్ ఆస్థానం నుంచి వివాదరహితుడు, సౌమ్యుడు, బిల్డర్ అయిన మౌజంఖాన్(ముక్తదా ఖాన్)కు అవకాశమివ్వగా.. ఆయన హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత ఆయన బహదూర్‌పుర నియోజకవర్గానికి బదిలీ అయినా.. కార్వాన్ స్థానం మజ్లిస్ ఖాతాలోనే ఉంది. ఇక మలక్‌పేట్‌ది విచిత్రమైన పరిస్థితి..‌! ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ హ్యాట్రిక్ కొట్టలేరనే అపవాదు 2018 వరకు ఉండేది. కానీ, బీజేపీకి కంచుకోటగా మలక్‌పేట్‌కు పేరుండేది. 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి(టీడీపీ మాజీ ఎమ్మెల్యే-1994) చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో మజ్లిస్ ఈ స్థానంలో పాగా వేసింది. అలా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన అహ్మద్ బలాలా.. ఎవరూ మూడోసారి గెలవలేరని మలక్‌పేట్ నియోజకవర్గానికి ఉన్న అపవాదును అధిగమించి.. హ్యాట్రిక్ కొట్టారు. నిజానికి గోషామహల్ నియోజకవర్గం పునర్విభజనకు మహారాజ్‌గంజ్‌గా ఉండేది. ఇది కూడా బీజేపీకి కంచుకోటగా ఉన్నా.. సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ను ఓడించిన కాంగ్రెస్ నేత ముఖేశ్‌గౌడ్ ఇక్కడ పాగా వేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో మహారాజ్‌గంజ్ కాస్తా.. గోషామహల్ అయ్యింది. బీజేపీకి అనుకూల ఓటుబ్యాంకు ఉన్న ప్రాంతాలు కలవడంతో.. రాజాసింగ్ ఇక్కడి నుంచి వరుసగా గెలిచారు.

ఇప్పుడే బీజేపీ వ్యూహాలు ఎందుకు..?

ఓల్డ్‌సిటీపై బీజేపీ గురిపెట్టడానికి అనేక కారణాలున్నాయి. బండిసంజయ్ పాదయాత్రతో యువతలో జోష్ నిండిందని బీజేపీ భావిస్తోంది. ప్రత్యేకించి, గత ఏడాది ఆయన భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తన పాదయాత్రను ప్రారంభించినప్పుడు చార్మినార్ వీధుల్లో ఇసుకేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ.. పాతనగరం పరిధిలోని 10 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకోగా.. మరో 10 డివిజన్లలో బీజేపీ-మజ్లిస్ మధ్య పోటాపోటీ కొనసాగింది. ఇంకో 20 దాకా డివిజన్లలో ఓటు బ్యాంకు పెరిగిందనే సంకేతాలను బీజేపీ గుర్తించింది. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా వెళ్తున్న తరుణంలో.. పాతనగరంపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇక ఇటీవల వివాదం జరిగిన రమ్నాస్‌పుర ప్రాంతంతోపాటు.. దూద్‌బౌలి డివిజన్లలో హిందూ ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకు మజ్లిస్‌కు మద్దతు ఇస్తూ వచ్చారు. వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ఆయా ప్రాంతాలపై దృష్టి సారించింది.

Untitled-10.jpg

మజ్లిస్‌ను ఓడించడం సాధ్యమా?

రాజకీయాల్లో మజ్లిస్ వ్యూహాలే వేరు..! ఎవరూ ఊహించని విధంగా ఓ అడుగు ముందుకేయడంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) దిట్ట..! 2009 ఎన్నికల్లో సియాసత్ పత్రిక ఎడిటర్ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర బరిలోకి దిగుతానని ప్రకటించారు. కానీ, ఆయన టీడీపీ తరఫున పోటీ చేశారు. ఓ ప్రెస్‌మీట్‌లో తాను టీడీపీలో చేరడానికి కారణాలను వివరించారు. ‘‘నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లోకి వెళ్లాలనుకున్నాను. కానీ, మజ్లిస్ పార్టీ ఓ క్రూరమైన వ్యూహాన్ని పన్నింది. నా పేరుతోపాటు.. తండ్రిపేరు కూడా ఒకేలా ఉన్న ఏడుగురు అభ్యర్థులను స్వతంత్రులుగా బరిలోకి దింపాలని ప్రయత్నించింది. ఓటర్లు పొరపాటు పడే ప్రమాదముందనే ఉద్దేశంతో టీడీపీ తరఫున ఎన్నికల్లోకి దిగాను’’ అని ఆయన అప్పట్లో వివరించారు. 2009 ఎన్నికలకు ముందు.. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కీలక ఓటర్లైన అరబ్బులకు, సిటింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య చెడింది. ఓ హోటల్ యజమానిని అక్బర్ ధూషించారనే కారణంతో.. 35 కమీలాల(జాతులు/వర్గాలు)కు చెందిన అరబ్బులు అక్బర్ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగారు. అప్పట్లో వీరి ఓటుబ్యాంకు 40వేలకు పైనే ఉండేది. అప్పటి వరకు మజ్లిస్‌కు అండగా ఉన్న బడా పహిల్వాన్లు కూడా ఈ వర్గాలకు చెందినవారే. తమ తిరుగుబాటును నేరుగా తెలియజేస్తూ.. యాకుత్‌పుర నుంచి ఓ పహిల్వాన్ బరిలోకి దిగారు. చాంద్రాయణగుట్టలో మజ్లిస్ బచావో తహరీక్(ఎంబీటీ) అభ్యర్థి డాక్టర్ ఖయ్యూంఖాన్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగిన జాహెద్ అలీఖాన్‌కు జైకొట్టేందుకు సిద్ధమయ్యారు. అంతే.. జరగబోయే ముప్పును పసిగట్టిన అసదుద్దీన్ ఒవైసీ.. ఖిల్వత్ సభను నష్టనివారణకు వాడుకున్నారు. ‘‘మా తండ్రి (సలావుద్దీన్ ఒవైసీ) చనిపోయాక.. ఓల్డ్‌సిటీ వాసులు మమ్మల్ని అనాథల్ని చేశారు’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అంతే.. సానుభూతి పవనాలు ఒక్కసారిగా మజ్లిస్‌ వైపు మళ్లాయి. మరోమారు పతంగ్ విజయదుందుభీ మోగించింది. అంతకు ముందు కూడా.. తమ పార్టీ ఎక్కడైనా బలహీనపడుతోందని గ్రహిస్తే.. పరిస్థితులకు తగ్గట్లుగా ప్రసంగాలు చేసి.. గాలి తమవైపు మళ్లేలా చేసుకోవడం మజ్లిస్‌కు కరతలామలకం. ఇందులో అక్బరుద్దీన్ ఒవైసీ దిట్ట..! ఎక్కడైనా తమ ఓటుబ్యాంకు చేజారిపోతుందని భావిస్తే.. అవసరమైతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు. ఓ దశలో తనకు మజ్లిస్ బచావో తహరీక్(ఎంబీటీ) నుంచి గట్టి పోటీ ఉండడంతో.. ‘‘లాల్ దర్వాజాను హరా(పచ్చ) దర్వాజాగా మారుస్తాను’’ అంటూ రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఇప్పుడు బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి కూడా మజ్లిస్ పైఎత్తులు వేస్తూనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-21T21:07:32+05:30 IST