Love Marriage: పెద్దవాళ్లు ఒప్పుకోలేదని.. కాలేజీలోనే కానిచ్చేశారు..!

ABN , First Publish Date - 2023-02-10T12:51:57+05:30 IST

యూత్ ఫెస్టివల్ (Youth Festival) జరుగుతున్న కాలేజీ కాస్త ఆ జంటకు పెళ్లి వేదికగా (Wedding Venue) మారింది.

Love Marriage: పెద్దవాళ్లు ఒప్పుకోలేదని.. కాలేజీలోనే కానిచ్చేశారు..!

ఇంటర్నెట్ డెస్క్: యూత్ ఫెస్టివల్ (Youth Festival) జరుగుతున్న కాలేజీ కాస్త ఆ జంటకు పెళ్లి వేదికగా (Wedding Venue) మారింది. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ జంట తాము చదువుకున్న కళాశాలలోనే పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇలా కాలేజీలోనే కానిచ్చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని మహారాజా కళాశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మట్టన్‌చెర్రీకి చెందిన నదీం, పనంగాడ్‌కు చెందిన క్రిప 2014-17లో మహారాజా కళాశాలలో (Maharaja College) డిగ్రీ చదివారు. ఆ సయమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త కొంతకాలానికి ప్రేమగా (Love) మారింది. దాంతో డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం వారిద్దరు తమ పెద్దలకు చెప్పారు. నదీం తరపువారు ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ, క్రిప పేరెంట్స్ ఒప్పుకోలేదు.

దాంతో ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమైంది. వారు మాత్రం వీరి ప్రేమ పెళ్లికి (Love Marriage) ససేమీరా అన్నారు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. నదీం, క్రిప తమ ప్రేమను అలాగే కొనసాగించారు. ఈ క్రమంలో ఇటీవల తాము చదివిన మహారాజా కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరిగింది. దాంతో ప్రేమలో ఉన్న ఈ జంట ఎలాగైనా ఇదే వేదికగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ముందు అనుకున్నట్టే ఇద్దరూ ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అంతే.. వేలాది మంది విద్యార్థుల నడుమ నదీం, క్రిప దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లి తమ పెళ్లిని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నదీం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, క్రిప మాత్రం పూతొట్ట శ్రీ నారాయణ న్యాయ కళాశాలలో (Poothotta Sree Narayana Law College) లా చదువుతోంది. ఇక పెళ్లి వార్త కాస్త బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఒక్క నెలలో 91వేల మందిపై వేటు.. ఇండియన్స్ దేశం వీడితే తీవ్ర పరిణామాలంటూ యూఎస్ నిపుణుల వార్నింగ్!

Updated Date - 2023-02-10T12:51:59+05:30 IST