Odisha train accident: అమ్మ అంత్యక్రియల కోసం 14 ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్లాడు.. తిరుగు ప్రయాణమైన అరగంటకే...
ABN , First Publish Date - 2023-06-03T20:35:47+05:30 IST
డిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న మానవీయ కోణాలు కలచివేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ తమ్ముడి కోసం అతడి ఇద్దరు అన్నలు ఆచూకీ వెతుకుతున్న తీరు హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బాలాసోర్: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న మానవీయ కథనాలు కలచివేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ తమ్ముడి ఆచూకీ కోసం అతడి ఇద్దరు అన్నలు వెతుకుతున్న తీరు హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో కూలీగా స్థిరపడిన రమేష్ జనా అనే ఒడిశా వ్యక్తి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతింటికి వెళ్లాడు. అమ్మ అంత్యక్రియల కోసమని చానాళ్ల తర్వాత ఊరికి వెళ్లాడు. అంత్యక్రియలు ముగించుకొని చెన్నైకి తిరుగుపయనమై శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో బాలాసోర్‌లో రైలెక్కాడు. 14 ఏళ్ల తర్వాత వచ్చి వెళ్తున్న తమ్ముడిని ఇద్దరు అన్నలు, వారి కుటుంబ సభ్యులు దగ్గరుండి మరీ రైలు ఎక్కించారు. భద్రక్ స్టేషన్ చేరుకున్నాక ఫోన్ చేస్తానంటూ కదులుతున్న రైళ్లో నుంచి రమేష్ చేతులు ఊపుతూ బైబై చెప్పాడు. తమ్ముడు గమ్యస్థానానికి చేరుతాడనుకుంటే.. మరో అరగంటలోనే మృత్యువడిలోకి చేరాడు.
రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న రమేష్ అన్నలిద్దరూ కన్నీళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ్ముడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ప్రమాదస్థలంతోపాటు శవాలను భద్రపరచిన ప్రదేశాలు, హాస్పిటల్స్‌లో వెతుకులాడారు. అయితే ఎంత వెతికినా వీరికి తమ్ముడి ఆచూకీ తెలియరాలేదు. శవాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడం ఇందుకు ఒక కారణంగా ఉంది. కాగా రమేష్ నంబర్‌కు ఫోన్ చేస్తే వేరెవరో లిఫ్ట్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి జేబులోంచి దీనిని తీసుకున్నామని వారు సమాధానమిస్తున్నారని వారు వాపోయారు. తమ్ముడు ఆచూకీ కోసం మార్చురీలు ఆసుపత్రులు తిరుగుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ తెలియరాలేదని సమాచారం.
భద్రక్ స్టేషన్ చేరుకోగానే కాల్ చేస్తానని తమ్ముడు చెప్పాడని, కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఇద్దరూ చెప్పారు. రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలు విన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటివరకు తమ్ముడి ఆచూకీ దొరకలేదని, వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వెతికినప్పటికీ ఎక్కడా గుర్తుదొరకలేదని వివరించారు.