Zomato CEO Deepinder Goyal: జొమాటో సీఈవో ‘ఫ్రెండ్‌షిప్ డే’ స్పెషల్.. ఒక మెట్టు ఎక్కేశావయ్యా.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-08-06T16:22:44+05:30 IST
ఏదో ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశామా? రెండు, మూడు యాడ్స్ తీసి ప్రచారం చేశామా? అంటే సరిపోదు. ప్రజల్లోకి ఆ ప్రొడక్ట్‌ని తీసుకెళ్లాలన్నా, మార్కెట్‌లో దూసుకుపోవాలన్నా.. కాలానికి అనుగుణంగా వినూత్న ప్రచార కార్యక్రమాలకు తెరతీస్తూ ఉండాలి.
ఏదో ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశామా? రెండు, మూడు యాడ్స్ తీసి ప్రచారం చేశామా? అంటే సరిపోదు. ప్రజల్లోకి ఆ ప్రొడక్ట్‌ని తీసుకెళ్లాలన్నా, మార్కెట్‌లో దూసుకుపోవాలన్నా.. కాలానికి అనుగుణంగా వినూత్న ప్రచార కార్యక్రమాలకు తెరతీస్తూ ఉండాలి. జనాలు మైమరిచిపోయేలా సరికొత్త విధానాల్ని అవలంభించాలి. ఆయా సందర్భాల్లో సర్‌ప్రైజ్‌లు కూడా ఇస్తుండాలి. ఇప్పుడు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కూడా అలాంటి సర్‌ప్రైజే ఇచ్చాడు. గతంలో ఏ సీఈవో కూడా చేయని పని చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచి, అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
ఇంతకీ.. దీపిందర్ గోయల్ చేసిన ఆ పనేంటి? అని అనుకుంటున్నారా! ఈరోజు (06-08-23) స్నేహితుల దినోత్సవం కావడంతో, ఈ వేడుకని చాలా ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. తానే డెలివరీ బాయ్‌గా రంగంలోకి దిగి.. డెలివరీ పార్ట్‌నర్స్, రెస్టారెంట్ పార్ట్‌నర్స్, కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేశాడు. అంతేకాదు.. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్‌ని సైతం డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సందర్భంగా అతను ట్విటర్ మాధ్యమంగా తన ఫోటోలను పంచుకున్నాడు. మొదటి ఫోటోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై జొమాటో టీషర్ట్‌లో కనిపించాడు. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ చేతిలో పట్టుకొని, మరో ఫోటోకి పోజిచ్చాడు. తాను ఫుడ్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ పంపిణీ చేయడానికి వెళ్తున్నానని.. ఇది తన జీవితంలో ఒక గొప్ప రోజు అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
స్వయంగా సీఈవో ఇలా రంగంలోకి దిగడం, ఫుడ్ డెలివరీ చేయడంతో.. దీపిందర్‌పై నెట్టింట్లో ప్రశంసల వర్సం కురుస్తోంది. ‘‘ఈ చర్యతో నువ్వు ఒక మెట్టు ఎక్కేశావయ్యా’’ అని కితాబిస్తున్నారు. ఈ దెబ్బతో జొమాటో ఆర్డర్స్ మరింత పెరిగిపోవడం ఖాయమని అభిప్రాయాలూ వ్యక్తపరుస్తున్నారు. దీపిందర్ చాలా తెలివిగా ఫ్రెండ్‌షిప్‌ని తన జొమాటో బిజినెస్‌కి వినియోగించుకున్నాడంటూ పేర్కొంటున్నారు. ఏదేమైనా.. సీఈవో చేసిన ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం అందరి మనసులు దోచుకుంటోంది. ఇంతకీ.. మీ ఫ్రెండ్‌షిప్ డే ప్లాన్స్ ఏంటి?