Asian Games 2023: నాలుగో రోజు భారత్‌కు పతకాల పంట.. రెండు స్వర్ణాలు సహా మొత్తం ఎన్నంటే..?
ABN , First Publish Date - 2023-09-27T11:52:50+05:30 IST
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్‌కు పతకాల పంట పండింది. బుధవారం నాడు ఇప్పటికే భారత్ ఖాతాలో 6 పతకాలు చేరాయి. అందులో రెండు స్వర్ణ పతకాలు కూడా ఉండడం గమనార్హం. ఆ రెండు స్వర్ణ పతకాలను అమ్మాయిలే గెలవడం గమనార్హం.
హాంగ్‌జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్‌కు పతకాల పంట పండింది. బుధవారం నాడు ఇప్పటికే భారత్ ఖాతాలో 6 పతకాలు చేరాయి. అందులో రెండు స్వర్ణ పతకాలు కూడా ఉండడం గమనార్హం. ఆ రెండు స్వర్ణ పతకాలను అమ్మాయిలే గెలవడం గమనార్హం. ముఖ్యంగా మన షూటర్లు అదరగొట్టారు. షూటింగ్‌లో మన దేశానికి ఇప్పటికే రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు వచ్చాయి. మహిళల 25 మీటర్ల పిస్టోల్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం గెలుచుకుంది. మను బాకర్, సంగ్వాన్, ఈషా సింగ్‌తో కూడిన భారత బృందం 1,756 పాయింట్స్ సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అంతకుముందు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి సిఫ్ట్ సమ్రా కౌర్ బంగారు పతకం గెలిచింది. ఈ క్రమంలో ఫైనల్‌లో 469.6 పాయింట్లు సాధించిన సిప్ట్ కౌర్ సమ్రా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. మరో భారత మహిళా షూటర్ ఆషి చౌక్సే ఈ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అలాగే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మహిళల టీమ్ ఈవెంట్‌లో ఆషి చౌక్సే, మణిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా రజత పతకాన్ని సాధించారు. పురుషుల 50 మీటర్ల స్కీట్ షూటింగ్ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. పురుషుల సెయిలింగ్‌లో భారత ఆటగాడు విష్ణు శరవణన్ సెయిలింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 19 పతకాలు గెలిచింది. ఇందులో 5 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.