IND vs AUS: మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం.. సిరీస్ మాత్రం భారత్‌దే!
ABN , First Publish Date - 2023-09-27T22:17:38+05:30 IST
బుధవారం (27-09-23) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని..
బుధవారం (27-09-23) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 286 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో.. 66 పరుగుల తేడాతో కంగారులు ఘనవిజయం సాధించారు. తొలుత రోహిత్ శర్మ పుణ్యమా అని భారత్ శుభారంభమే చేసింది. ఇదే జోష్ కొనసాగిస్తే.. ఈ లక్ష్యాన్ని ఛేధించడం భారత్‌కి కష్టం కాకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే అంచనాలు బొక్కబోర్లా పడ్డాయి. వికెట్లు కోల్పోవడంతో భారత్‌కి పరాజయం తప్పలేదు. అయితే.. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ, తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయకేతనం ఎగురవేసింది కాబట్టి 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. టాపార్డర్‌లో భాగంగా.. డేవిడ్ వార్నర్ (56), మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), మార్నస్ లాబుషేన్ (72) అర్థశతకాలతో అద్భుతంగా రాణించడం వల్ల ఆసీస్ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదట్లో కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకి మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. 57 బంతుల్లోనే అతడు 81 పరుగులు (6 సిక్సులు, 5 ఫోర్లు) చేశాడు. మైదానంలో ఉన్నంతవరకూ బాగానే మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లీ (56) కూడా అర్థశతకం బాదాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 48 పరుగులకే వెనుదిరిగాడు. ఈ ముగ్గురు మినహాయించి జట్టులో మరెవ్వరూ రాణించకపోవడం వల్ల.. భారత్ ఓటమిపాలైంది.
బౌలింగ్ విషయానికొస్తే.. జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు కానీ, తన 10 ఓవర్ల కోటాలో 81 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల గురించి మాట్లాడుకుంటే.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏకంగా 4 వికెట్లు తీసి, భారత్ పతనాన్ని శాసించాడు. హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ గ్రీన్, తన్వీర్ సంఘా తలా వికెట్ తీశారు. ఒకవేళ ఈ మ్యాచ్ భారత్ గెలిచి ఉండే, సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసేది. కానీ.. మూడో వన్డేలో ఘోర పరాజయం చవిచూసి, ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకుంది.