Usman Khawaja: అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ బాదిన ఖవాజా ఏ దేశంలో పుట్టాడో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-10T20:39:15+05:30 IST

గోడకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. ఎక్కడైతే స్పిన్ (Spin bowling) ఆడలేవంటూ పక్కనపెట్టారో అక్కడే దమ్ము చూపాడు. మరే ఆస్ట్రేలియా క్రికెటర్‌కూ (Cricket australia) సాధ్యం కాని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడే ఉస్మాన్ ఖవాజా...

Usman Khawaja: అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ బాదిన ఖవాజా ఏ దేశంలో పుట్టాడో తెలుసా?

భారత్‌లో గతంలో రెండుసార్లు పర్యటించినా.. 8 టెస్టుల్లోనూ అదనపు ఆటగాడిగా డ్రింక్స్ మోసేందుకే పరిమితమైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja).. అహ్మదాబాద్ టెస్టు (Ahmedabad test) మ్యాచ్‌లో 5 సెషన్లు క్రీజులో నిలిచి.. 400 పైగా బంతులను ఎదుర్కొని 10 గంటల పైగా క్రీజులో ఆడి భారీ సెంచరీ (Khawaja Century) కొట్టి ఔరా అనిపించాడు. ఏ ఆటగాడైనా.. 34 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు దూరమైతే కెరీర్ ముగిసిందని అనుకుంటాడు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఆస్ట్రేలియా లాంటి జట్టుకు (Team Australia) రెండేళ్లపాటు ఎంపిక కాకుంటే ఆశలు వదిలేసుకుంటాడు.. ఏ ఓపెనర్ అయినా తుది జట్టులో చోటు దక్కక రెండుసార్లు ఓ విదేశీ పర్యటనలో కేవలం డ్రింక్స్ మోసేందుకు పరిమితం అయితే నిరాశ పడిపోతాడు. కానీ, అతడు మాత్రం అలా కాదు. గోడకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. ఎక్కడైతే స్పిన్ (Spin bowling) ఆడలేవంటూ పక్కనపెట్టారో అక్కడే దమ్ము చూపాడు. మరే ఆస్ట్రేలియా క్రికెటర్‌కూ (Cricket australia) సాధ్యం కాని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడే ఉస్మాన్ ఖవాజా.

పాక్ మూలాలు.. కంగారూ గడ్డపై ఓనమాలు

ఉస్మాన్ ఖవాజా పుట్టింది పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్‌లో. అతడికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం ఆస్ట్రేలియాలోని (Australia) న్యూసౌత్ వేల్స్‌కు వలస వెళ్లింది. ఖవాజా ఏవియేషన్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా పొందాడు. అయితే, క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2006లో అండర్ 19 జట్టు సభ్యుడిగా ప్రపంచ కప్ (cricket U-19 world cup) ఆడాడు. 2008లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 2011 జనవరిలో తొలిసారిగా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడాడు. ఈ ఘనత సాధించిన తొలి పాకిస్థాన్ సంతతి ఆటగాడు ఖవాజానే. చిత్రమేమంటే.. 2010 జూన్‌లో ఇంగ్లండ్ (England) వేదికగా (తటస్థ) పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు (Test series) ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులోనూ (Team India) ఖవాజా సభ్యుడు.

Untitled-18.jpg

అనూహ్యంగా జట్టుకు దూరం

2015 నుంచి ఆస్ట్రేలియా జట్టు శాశ్వత సభ్యుడైన ఖవాజా 2018-19 సీజన్ నాటికి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సరిగ్గా నాలుగేళ్ల కిందట భారత్‌లో పర్యటించిన (India tour) జట్టులోనూ అతడు సభ్యుడు. వరుసగా రెండు వన్డేల్లోనూ సెంచరీలు కొట్టి ఆకట్టుకున్నాడు. అయితే, 2019 రెండో భాగంలో వైఫల్యాలు అతడిపై వేటుకు దారితీశాయి. ఆ ఏడాది మొత్తం 11 టెస్టు ఇన్నింగ్స్‌‌లో ఖవాజా చేసింది 439 పరుగులే. అదే సమయంలో ఆస్ట్రేలియాకు లబుషేన్ వంటి బ్యాట్స్‌మెన్ దొరకడం కూడా ప్రభావం చూపింది. దీంతో వన్డేల్లోనూ చోటు కోల్పోయాడు.

పడిలేచిన కెరటం.. కమ్ బ్యాక్‌లో డబుల్

2020, 2021 సంవత్సరాల్లో ఖవాజా ఆసీస్ టెస్టు జట్టుకు (Team Aussies) అసలు ఎంపికే కాలేదు. అప్పటికి అతడి వయసు 34 ఏళ్లు. మరో ఆటగాడైతే నిరాశ పడిపోయేవాడేమో. కానీ, ఖవాజా పట్టు వీడలేదు. దేశవాళీ జట్టు క్వీన్స్ లాండ్ తరఫున నిలకడగా ఆడుతూ తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితిని సెలక్టర్లకు కల్పించాడు. అయితే, ఇక్కడే ఓ గమ్మత్తు జరిగింది. 2021-22 యాషెస్ సిరీస్‌కు ఖవాజా జట్టులో లేడు. మరో బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ కొవిడ్ బారినపడడంతో నాలుగో టెస్టుకు చివరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. అలా వస్తూనే మిడిలార్డర్‌లో దిగి రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు (137, 101) కొట్టాడు. అప్పటినుంచి తన స్థానాన్ని (ఓపెనింగ్) తప్పించలేని ఆటగాడిగా మారిపోయాడు. దీనికి న్యాయం చేకూరుస్తూ గత 16 మ్యాచ్‌లలో ఆరు సెంచరీలు సహా 69.63 సగటున 1,532 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 180 పరుగుల వద్ద ఔటైన ఖవాజా.. గత డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టులో 195 పరుగుల వద్ద నిష్క్రమించి రెండుసార్లు డబుల్ సెంచరీ చాన్స్ చేజార్చుకున్నాడు.

Untitled-17.jpg

భారత్‌లో 8 టెస్టుల్లో డ్రింక్స్ మోసి..

2013, 2017లో భారత్‌లో పర్యటించిన ఆసీస్ జట్టులో ఖవాజా సభ్యుడు. కానీ, ఆ రెండు సందర్భాల్లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అదనపు ఆటగాడిగా మైదానంలోని ఆటగాళ్లకు డ్రింక్స్ మోసేందుకే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం అవకాశం దక్కించుకున్నాడు. రెండో, మూడో టెస్టులో అర్ధ సెంచరీలు చేసిన ఖవాజా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఏకంగా భారీ సెంచరీ కొట్టాడు. ఈ సందర్భంలో గతాన్ని తలచుకుంటూ ఎన్నడూ లేనివిధంగా సెంచరీ అనంతరం చాలాసేపు నవ్వుతూనే సంబరం చేసుకున్నాడు.

స్పిన్ ఆడలేడన్నవాడే.. స్పిన్‌ను చితక్కొట్టి

స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే ఉపఖండం మూలాలు ఉన్నప్పటికీ.. ఖవాజా స్పిన్ ఆడలేడంటూ అతడికి భారత్‌లో ఆడే అవకాశాలు ఇవ్వలేదు. అయితే, దీనిని తప్పుగా భావించలేదు ఖవాజా. లోపాలను సరిచేసుకుంటూ.. భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా ఏ జట్టుకు ఆడుతూ తాను చేయాల్సింది చేశాడు. ఫలితం.. ఇప్పుడతడే ఆసీస్ జట్టుకు బ్యాటింగ్‌లో పెద్ద దిక్కయ్యాడు. నాలుగు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మొత్తంగా చూసినా సాలిడ్ డిఫెన్స్‌తో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ.. పేస్‌ను దీటుగా ఎదుర్కొంటూ అహ్మదాబాద్ టెస్టులో ఖవాజా ఆడిన తీరు స్ఫూర్తిదాయకం.

Untitled-19.jpg

5 సెషన్లు.. 10 గంటలు.. 422 బంతులు

అహ్మదాబాద్ టెస్టులో (Ahmedabad test) ఉస్మాన్ ఖవాజా 180 పరుగుల మారథాన్ ఇన్సింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. మొత్తం 5 సెషన్లు.. 10 గంటల సమయం అతడు క్రీజులో గడిపాడు. భారత్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు (422) ఎదుర్కొన్న ఆసీస్ బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు గ్రాహం యాలప్స్ (1979లో 392 బంతులు) పేరిట ఉంది. 2001లో మాథ్యూ హేడెన్ తర్వాత భారత్‌లో 150 పైగా పరుగులు చేసిన తొలి ఆసీస్ ఓపెనర్ ఖవాజానే కావడం విశేషం.

Updated Date - 2023-03-10T21:03:58+05:30 IST