INDW vs BANW: గెలుపు ముంగిట బోల్తా పడ్డ భారత అమ్మాయిలు.. మూడో వన్డే ‘టై’
ABN , First Publish Date - 2023-07-22T17:40:13+05:30 IST
బంగ్లాదేశ్ ఉమెన్స్‌తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు చేజార్జుకున్న అమ్మాయిలు సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ‘టై’ తో గట్టెక్కారు. వర్షం అడ్డుపడడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారింది.
ఢాకా: బంగ్లాదేశ్ ఉమెన్స్‌తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు చేజార్జుకున్న అమ్మాయిలు సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ‘టై’ తో గట్టెక్కారు. వర్షం అడ్డుపడడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారింది. 226 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 191-4తో విజయానికి చేరువగా వచ్చిన భారత జట్టు ఆ తర్వాత 34 పరుగుల వ్యవధిలోనే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్(33) చివరి వరకు పోరాడినప్పటికీ ఇతర బ్యాటర్లెవరూ సహకరించకపోవడం ప్రతికూలంగా మారింది. చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ అమ్మాయిలు ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి మ్యాచ్‌ను కాపాడుకున్నారు. దీంతో మ్యాచ్‌తోపాటు మూడు వన్డేల సిరీస్ కూడా 1-1తో టైగా ముగిసింది. హర్లీన్ డియోల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కగా.. ఫర్గానా హోక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్దు దక్కింది.
226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 32 పరుగులకే షఫాలీ వర్మ(4), యస్తిక భాటియా(5) వికెట్లను కోల్పోయింది. ఇలాంటి స్థితిలో జట్టును ఓపెనర్ స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ ఆదుకున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరు మూడో వికెట్‌కు 107 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే ఈ పాట్నర్‌షిప్‌ను స్పిన్నర్ ఫాహిమా ఖాతున్ విడదీసింది. 59 పరుగులు చేసిన స్మృతి మంధానను పెవిలియన్ చేర్చింది. దీంతో 139 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(14) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. అయితే టీమిండియా స్కోర్ 171-4గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అప్పటికీ భారత జట్ట విజయానికి కావాల్సింది 55 పరుగులే. దీంతో టీమిండియా సునాయసంగా గెలుస్తుందని అనిపించింది.
వర్షం అనంతరం తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 9 ఫోర్లతో 77 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ రనౌట్ కావడంతో భారత్ కొంపముంచింది. ఆ వెంటనే దీప్తి శర్మ(1) కూడా ఔటైంది. 216-6తో ఉన్నప్పుడు కావాల్సింది 10 పరుగులే కావడంతో భారత్ గెలుపు ఖాయమనిపించింది. పైగా ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కానీ రబేయా ఖాన్ వేసిన 47వ చివరి బంతికి అమంజోత్ కౌర్(10) ఔట్ కావడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. నహిదా అక్టర్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో స్నేహ రానా, దేవికా వైద్య డకౌట్లు కావడంతో మ్యాచ్ బంగ్లాదేశ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 5 బంతుల వ్యవధిలోనే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. 217 పరుగులకు టీమిండియా 9 వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ ప్రధాన బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఒంటరిపోరాటం చేసింది. ఆమెకు చివరి బ్యాటర్ అయినా మేఘనా సింగ్ కూడా సహకరించింది. 49వ ఓవర్‌లో మేఘనా ఓ ఫోర్ కూడా బాదడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే స్కోర్లు కూడా లెవల్ అయ్యాయి. కానీ మరుఫా అక్టర్ వేసిన చివరి ఓవర్‌లో నిగర్ సుల్తానాకు క్యాచ్ ఇచ్చి మేఘనా సింగ్(6) ఔటైంది. దీంతో సరిగ్గా 225 పరుగుల వద్ద భారత్ ఆలౌటైంది. కీలక మలుపులు తిరుగుతూ చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మూడో వన్డే మ్యాచ్ ‘టై’గా ముగిసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్టర్ 3, మరుఫా అక్టర్ 2, సుల్తానా ఖాతున్, ఫాహిమా ఖాతున్, రబేయా ఖాన్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు ఓపెనర్లు ఫర్గానా హోక్(107), షమీమా సుల్తానా(52) చెలరేగడంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్గానా హోక్, షమీమా సుల్తానా మొదటి వికెట్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు 93 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 27వ ఓవర్‌లో స్నేహ రానా విడదీసింది. 5 ఫోర్లతో 78 బంతుల్లో 52 పరుగులు చేసిన షమీమా సుల్తానాను పెవిలియన్ చేర్చింది. అనంతరం కెప్టెన్ నిగర్ సుల్తానాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన ఫర్గానా హోక్ రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించింది. ఈ క్రమంలో మరోసారి పాట్నర్‌షిప్‌ను బ్రేక్ చేసిన స్పిన్నర్ స్నేహ రానా 41వ ఓవర్‌లో నిగర్ సుల్తానా(24)ను ఔట్ చేసింది. ఆ వెంటనే రీతు మోని(2)ని దేవిక వైద్య పెవిలియన్ చేర్చింది. అనంతరం శోభన మోస్తరీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన ఫర్గానా హోక్ బంగ్లా స్కోర్‌ను 200 దాటించింది. ఈ క్రమంలోనే 156 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకుంది. బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అయితే 9 ఫోర్లతో 160 బంతుల్లో 107 పరుగులు చేసిన ఫర్గానా హోక్ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయింది. చివర్లో ధాటిగా ఆడిన శోభన మోస్తరీ(23) నాటౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో స్నేహ రానా 2, దేవికా వైద్య ఒక వికెట్ తీశారు.