Team India: భారత జట్టుకు ఎంపికైన కూలీ
ABN , First Publish Date - 2023-07-04T16:00:33+05:30 IST
బంగ్లాదేశ్‌లో పర్యటించే 17 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ కోసం రెగ్యులర్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆమె స్థానంలో ఆంధ్రా అమ్మాయి అనూషను ఎంపిక చేశారు.
క్రికెట్‌లో టీమిండియా పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా నిలకడగా రాణిస్తోంది. అంతేకాకుండా మహిళా క్రికెట్‌కు క్రమంగా ఆదరణ కూడా పెరుగుతోంది. అందుకే బీసీసీఐ మహిళల కోసం ప్రత్యేకంగా ఐపీఎల్‌ను కూడా నిర్వహిస్తోంది. అటు రెగ్యులర్‌గా భారత మహిళల జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా పాల్గొంటోంది. ఈనెల 9 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20లు కూడా ఆడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పర్యటించే 17 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఈ ఏడాది ఐపీఎల్ యాడ్ రెవెన్యూ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..!!
అయితే ఈ సిరీస్ కోసం రెగ్యులర్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆమె స్థానంలో ఆంధ్రా అమ్మాయి అనూషను ఎంపిక చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు అనూష బ్యాక్‌గ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అనూషది నిరుపేద కుటుంబం. స్వస్థలం అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి. పూట గడవడం కోసం ఒకప్పుడు కూలీగా పనిచేసిన ఆమె ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్‌లో బండ్లపల్లి స్కూల్ తరఫున అనూష సత్తా చాటింది. అలా అక్కడి అకాడమీలోనే కోచింగ్ తీసుకుంది. స్కూల్ పీఈటీ రవీంద్ర ఆమెకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పించాడు. మొదట పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటేది. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్లకు మంచి అవకాశాలు ఉండటంతో బౌలర్‌గా శిక్షణ పొందింది. స్థిరంగా రాణించడంతో ఆంధ్ర తరఫున అండర్-19 జట్టులో స్థానం దక్కించుకుంది. 2018 చెన్నైలో జరిగిన సౌత్ జోన్ టోర్నీతో కెరీర్ ప్రారంభించిన అనూష 2019లో ఎన్‌సీఏ శిబిరానికి ఎంపికైంది. 2021లో బీసీసీఐ సీనియర్ వన్డే జట్టులో మెరుగైన ప్రదర్శన చేసింది. రాజస్థాన్‌పై 3 వికెట్లు, బెంగాల్‌పై 3 వికెట్లు, హైదరాబాద్ టీమ్‌పై 2 వికెట్లు తీసుకుని సత్తా నిరూపించుకుంది. ఈ ఏడాది ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో కూడా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడింది. కాగా అనూష టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అభిమాని. అతడిలా ఆల్‌రౌండర్‌గా రాణించాలని ఆమె ఆకాంక్షిస్తోంది. తనకు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడం కూడా ఇష్టమని అనూష చెప్పింది.