Share News

BCCI: అఫీషియల్.. కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2023-11-29T14:50:39+05:30 IST

Team India: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ పొడిగింపు ఎప్పటి వరకు అన్న విషయం బీసీసీఐ ప్రస్తావించలేదు. కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకారం తెలపడంతో అతడితో పాటు సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది.

BCCI: అఫీషియల్.. కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పొడిగింపు

వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో టీమిండియా హెడ్ కోచ్ మారతారంటూ కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ పొడిగింపు ఎప్పటి వరకు అన్న విషయం బీసీసీఐ ప్రస్తావించలేదు. కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకారం తెలపడంతో అతడితో పాటు సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. దీంతో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్టులను కూడా పొడిగించినట్లు స్పష్టం అవుతోంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ ప్రత్యేకంగా చర్చలు జరిపిందని.. ఈ మేరకు మరికొంతకాలం కోచ్‌గా సేవలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా బలంగా మారేందుకు ద్రవిడ్ పాత్రను బీసీసీఐ గుర్తించింది.

మరోవైపు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్, సహాయక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ సేవలను కూడా బీసీసీఐ అభినందించింది. ద్రవిడ్, లక్ష్మణ్ తమ భాగస్వామ్యాలతోనే కాకుండా తమ కోచింగ్ సేవలతో భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని బీసీసీఐ అభిప్రాయపడింది. అటు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కూడా ద్రవిడ్ సేవలపై ప్రశంసలు కురిపించారు. ద్రవిడ్ దార్శనికత, వృత్తి నైపుణ్యం, లొంగని నైజం టీమిండియా విజయంలో మూలస్తంభాలుగా ఉన్నాయని రోజర్ బిన్నీ అన్నారు. ద్రవిడ్, లక్ష్మణ్ సవాళ్లను స్వీకరించడమే కాకుండా వాటిని సాధిస్తూ ముందుకు సాగిపోతున్నారని.. అందుకే టీమిండియా మంచి ప్రదర్శన చేస్తోందని తెలిపారు. కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనకు అంగీకారం తెలిపినందుకు ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్‌లో ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుందని రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T14:50:40+05:30 IST