Share News

T10 League: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్..?

ABN , Publish Date - Dec 15 , 2023 | 07:28 PM

T10 League: బీసీసీఐ మరో మెగా లీగ్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్ ప్రారంభించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచే ఈ టీ10 లీగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

 T10 League: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్..?

2008లో బీసీసీఐ ప్రవేశపెట్టిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా కోట్లకు కోట్లు బీసీసీఐ ఆర్జిస్తోంది. ఐపీఎల్‌ను స్ఫూర్తిగా తీసుకుని చాలా దేశాలు మెగా టీ20 లీగ్‌లను నిర్వహిస్తున్నాయి. కానీ మిగతా దేశాల కంటే బీసీసీఐపైనే కాసుల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో కూడా ఐసీసీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మరో మెగా లీగ్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్ ప్రారంభించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచే ఈ టీ10 లీగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ సెక్రటరీ జైషా టీ10 లీగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌పై కసరత్తు చేస్తున్నారని సమాచారం.

భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఐపీఎల్‌కు ప్రపంచంలో ఏ లీగ్‌కు దక్కని ఆదాయం, విపరీతమైన క్రేజ్ దక్కుతోంది. 10 ఫ్రాంచైజీలు ఉండటంతో కాసుల వర్షం కురుస్తోంది. అయితే టీ10 లీగ్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలకే అప్పగించాలా లేదా కొత్త ఫ్రాంచైజీల కోసం బిడ్‌లను ఆహ్వానించాలా అన్న విషయంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. మరోవైపు టీ10 లీగ్ ఇండియాలోనే నిర్వహిస్తారా లేదా తటస్థ వేదికల్లో నిర్వహిస్తారా అన్న విషయంపైనా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ లీగ్ కోసం అత్యుత్తమ వైట్ బాల్ క్రికెటర్లను ఎంచుకోవాలని.. ఈ లీగ్‌ను విదేశాల్లో నిర్వహిస్తే అక్కడి క్రికెట్ బోర్డులకు మంచి ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ ఆలోచిస్తోంది. అటు టీ10 లీగ్‌తో క్రికెట్‌లో అనూహ్య మార్పులు వస్తాయని.. ఇప్పటికే మసకబారిన వన్డేలు మరింత ప్రజాదరణ కోల్పోతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 07:28 PM