Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్ విజేత విహారి టీమ్
ABN , First Publish Date - 2023-07-16T12:55:02+05:30 IST
దులీప్ ట్రోఫీ విజేతగా హనుమ విహారి నేతృత్వంలోని సౌత్ జోన్ నిలిచింది. ఆఖరి రోజు సౌత్ జోన్ బౌలర్లు విజృంభించడంతో 298 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్ 222 పరుగులకే ఆలౌటై ఓటమి చవి చూసింది.
ఆసక్తికరంగా సాగిన దులీప్ ట్రోఫీ (Duleep Trophy) ఫైనల్ చివరి రోజు చప్పగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్ (West Zone) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 62.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 116 పరుగులు మాత్రమే అవసరం కావడం.. చేతిలో 5 వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ గెలిచే అవకాశం ఉందని అభిమానులు భావించారు. కానీ ఐదో రోజు ఉదయం సెషన్‌లోనే ఆ జట్టు చేతులెత్తేసింది. సౌత్ జోన్ (South Zone) బౌలర్లు విజృంభించడంతో 222 పరుగులకే ఆలౌటైంది. దీంతో 75 పరుగుల తేడాతో హనుమ విహారి నేతృత్వంలోని సౌత్ జోన్ విజయం సాధించి దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
వెస్ట్ జోన్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 211 బంతుల్లో 11 ఫోర్లతో 95 పరుగులు చేసి కవేరప్ప బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతడి తర్వాత వెస్ట్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్ త్వరగానే కుప్పకూలింది. సౌత్ జోన్ బౌలర్లలో సాయి కిషోర్ (Sai Kishore) 4 వికెట్లతో రాణించాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం విధ్వత్ కవేరప్పకు దక్కింది. అతడు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన ప్రియాంక్ పాంచల్ వికెట్ సాధించాడు. అంతే కాకుండా సిరీస్ మొత్తం నిలకడగా రాణించినందుకు విధ్వత్ కవేరప్ప మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Team India: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కింద ఇచ్చేది రూ.41వేలు మాత్రమే..!!
కాగా దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 63 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 40 పరుగులు చేసి విహారికి సహకారం అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ 146 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ పృథ్వీ షా 65 పరుగులతో రాణించినా మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) పరుగులు చేసి నిరాశ పరిచారు. దీంతో సౌత్ జోన్‌కు 67 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి కెప్టెన్ విహారి (42) సత్తా చాటడంతో సౌత్ జోన్ 230 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 297 పరుగులు ఆధిక్యం సాధించడంతో వెస్ట్ జోన్ ముందు 298 పరుగుల టార్గెట్ నిలిచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ పుజారా (15), సూర్యకుమార్ (4) విఫలమయ్యారు. పృథ్వీ షా కూడా 7 పరుగులకే అవుటయ్యాడు.