Tim Paine: క్రికెట్‌కు ముగింపు పలికిన ఆసీస్ మాజీ కెప్టెన్

ABN , First Publish Date - 2023-03-17T17:17:14+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Tim Paine: క్రికెట్‌కు ముగింపు పలికిన ఆసీస్ మాజీ కెప్టెన్

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. షఫీల్డ్‌ షీల్డ్ సిరీస్‌లో భాగంగా టాస్మేనియా-క్వీన్స్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన అనంతరం పైన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. వికెట్ కీపర్ అయిన పైన్ 2018-2021 మధ్య 23 టెస్టుల్లో ఆస్ట్రేలియా(Australia)కు సారథ్యం వహించాడు. మొత్తంగా 35 టెస్టులు ఆడాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల కారణంగా అప్పటి కెప్టెన్ స్మిత్(Steve Smith) నిషేధానికి గురి కావడంతో పైన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఆస్ట్రేలియాకు పైన్ 46వ టెస్టు కెప్టెన్.

2010లో లార్డ్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో పైన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో అతడి సగటు 32.63. అత్యుత్తమ స్కోరు 92 పరుగులు. వికెట్ కీపర్‌గా 157 స్టంపింగ్స్ చేశాడు. అలాగే, 35 వన్డేల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

షఫీల్డ్ షీల్డ్ సిరీస్‌లో టాస్మేనియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 38 ఏళ్ల పైన్ హోబర్ట్‌లో జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. అనంతరం పైన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. హోబర్ట్‌లో జన్మించిన పైన్ 2005 నుంచి అంటే 18 ఏళ్లుగా టాస్మేనియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 153 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడాడు.

Updated Date - 2023-03-17T17:17:14+05:30 IST