Shoaib Akhtar: ఉమ్రాన్ మాలిక్ ఆ రికార్డు బద్దలు గొడితే.. షోయబ్ అక్తర్ చేసే మొదటి పని అదేనట!
ABN , First Publish Date - 2023-03-17T19:55:35+05:30 IST
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెరుపు వేగంతో బంతులు విసిరే అక్తర్ ఖాతాలో అత్యంత వేగవంతమైన డెలివరీ ఉంది. ఇప్పటి వరకు ఆ రికార్డు అలాగే భద్రంగా ఉంది. ఎవరూ అతడి వేగాన్ని అందుకోలేకపోయారు. అయితే, టీమిండియా బౌలర్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik) రూపంలో ఆ రికార్డుకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. ఉమ్రాన్ ఐపీఎల్‌లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి రికార్డులకెక్కాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ ఆ జట్టు కెప్టెన్ దాసున్ శనకకు 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ బౌలర్ అంతవేగంతో బంతిని విసరడం అదే తొలిసారి.
23 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్(Umran Malik)కు ఆస్ట్రేలియాతో తలపడుతున్న వన్డే జట్టులో చోటు లభించింది. అయితే, తొలి వన్డేలో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. తన అత్యంత వేగవంతమైన డెలివరీ రికార్డును ఎలా బద్దలుగొట్టవచ్చో ఉమ్రాన్(Umran)కు సలహా ఇచ్చాడు. అలాగే, బౌలింగును మరింత మెరుగుపరుచుకోవడమెలానో చెబుతూ విలువైన సలహాలు ఇచ్చాడు.
ఉమ్రాన్ మంచి బౌలర్ అని కొనియాడిన అక్తర్.. అతడి రనప్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని, చేతి వేగం కూడా చాలా వేగంగా ఉంటుందని ప్రశంసించాడు. అతడు చాలా ధైర్యంగా, వేగంగా బంతులు సంధిస్తాడని అన్నాడు. దూకుడును ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించొద్దని సలహా ఇచ్చాడు. పరుగులు ఇచ్చుకున్నా సరే దూకుడును మాత్రం ఏమాత్రం తగ్గించకూడదన్నాడు. వేగంగా బౌలింగ్ చేయాలన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని సలహా ఇచ్చాడు. అలాగే, శిక్షణ కూడా మర్చిపోవద్దని, ఎంత శిక్షణ ఉంటే అంతమంచిదన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నాడు.
‘‘నువ్వో గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావ్. అక్కడి ప్రజలు ఎంతగానో గౌరవిస్తున్నారు. కాబట్టి వారి ఆశలను చిదిమేయొద్దు. గొప్ప హృదయంతో బౌలింగ్ చెయ్’’ అని ఉమ్రాన్‌కు అక్తర్ సూచించాడు. అంతేకాదు, అవసరం అనుకుంటే ఉమ్రాన్‌కు సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. అలాగే, బౌలింగ్ వేగాన్ని పెంచుకోవడమెలానో కూడా చెప్పాడు.
తాను బౌలింగ్ చేసేందుకు 26 గజాలు తీసుకుంటే, ఉమ్రాన్ 20 గజాలు మాత్రమే తీసుకుంటున్నాడని అన్నాడు. కాబట్టి అతడు కూడా 26 గజాలు తీసుకోవాలన్నాడు. ఉమ్రాన్ కనుక తన రికార్డును బద్దలుగొట్టాలని అనుకుంటే ఆ పని చేయాలని అన్నాడు. 20 సంవత్సరాలుగా అది భద్రంగా ఉందన్నాడు. కాబట్టి దానిని దయచేసి బద్దలుగొట్టాలని కోరాడు. ఒకవేళ ఉమ్రాన్ కనుక తన రికార్డును బద్దలుగొడితే అతడిని తొలుత ముద్దాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని అక్తర్ చెప్పుకొచ్చాడు.